Thursday, 4 May 2023

శ్రీదత్త పురాణము (128)

 


విష్ణుదత్తుడు నమ్మలేకపోయాడు. ఇంత అనాచారుడా తన స్వామి. అబ్బే ఈ రాక్షసుడు ఏదో ఆట పట్టించడానికి ఇలా అన్నాడు అని అనుకున్నాడు. ఇలా తనలో తాను తర్కించుకుంటూ వుండగానే ఆ ఉన్మత్తుడు అలా అలా దూరమై అదృశ్యమైనాడు. రాక్షసుడు తిరిగివస్తూనే ఏమి మందమతివయ్యా విష్ణుదత్తా నీకు ముందే చెప్పాను గదా స్వామి చిత్రవిచిత్ర రూపాల్లో తిరుగుతుంటాడని మరచి పోయినట్లున్నావ్. గుర్తించలేకపోయావు బంగారం లాంటి అవకాశాన్ని జారవిడుచుకున్నావు. పోనీలే చింతించకు. మరోసారి చూపిస్తాను అని వూరడించి వెళ్ళిపోయాడు.


మరొక రోజున మరింత హడావిడిగా వచ్చాడు రాక్షసుడు. విష్ణుదత్తా రా, రా మహాదేవుడు ఇక్కడే దగ్గర్లో సంచరిస్తున్నాడు అన్నాడు. విష్ణుదత్తుడు బయలు దేరాడు. అది స్మశానం. శ్మశానవాటికలో దుమ్ము కొట్టుకొని పోయివున్న ఒక మనిషి కనిపించాడు. అతడి చుట్టూ కుక్కలు గుమికూడి తిరుగుతూ వున్నాయి. అతడి చేతిలో కపాలం వుంది. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా వున్నాయి. ఎముకల్ని శరీరంనిండా ఆభరణాలుగా ధరించి వున్నాడు. స్వామికి ఇది మరొకరూపం కాబోలు అనుకొని విష్ణుదత్తుడు దగ్గరికి చేరబోయాడు. ఆ పెద్దమనిషి కస్సుమన్నాడు. అందుబాటులో వున్న పొడవాటి ఎముక ముక్కను తీసికొని విష్ణుదత్తున్ని కొట్టాడు. విష్ణుదత్తుడు భయపడిపోయాడు. కాళ్ళల్లో వణుకు బయలుదేరింది. కళ్ళు తిరిగాయి. పడిపోబోయి నిలద్రొక్కుకున్నాడు. బ్రతికుంటే బలుసాకు తినిబ్రతకొచ్చు అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంఘించాడు. దూరం నుండి రాక్షసుడు ఇదంతా చూస్తున్నాడు. రాక్షసుడు అయ్యో ఈ వెర్రి బాపడు ఈసారి అవకాశం కూడా పోగొట్టుకున్నాడే దైవం అనుకూలించకపోతే దైవ దర్శనం కాదు. విష్ణుదత్తుడు సిగ్గుపడుతూ ఇంటికి చేరుకున్నాడు.


ఇంకొక రోజున ఆ రాక్షసుడు విష్ణుదత్తుణ్ణి పిలచి నీకు దత్తస్వామిని మూడు మార్లు చూపిస్తాను అని చెప్పాను గదా ఇది చివరి ప్రయత్నం నాతో రా అని తీసికెళ్ళాడు. సుశీలమ్మ కూడా భర్తకు బాగా ధైర్యం నూరి పోసింది. ఏమైనా సరే ఈ సారి విజయం సాధించితీరాలి అని గట్టిగా చెప్పి పంపించింది. తాను దృఢంగా సంకల్పించుకున్నాడు. మూడో మారు కూడా భయపడి వెనుదిరిగితే ఈ సృష్టిలో నాకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు వుండడు. ఏమైనా ధైర్యం చెయ్యవలసిందే. స్వామి రూపం ఎంతభయంకరంగా వుండనీ జుగుప్సాకరంగా వుండనీ, నన్ను తిట్టనీ, కొట్టనీ, ఈ మారు స్వామి పాదాలు వదలనుగాక వదలను అని ఆలోచించుకుంటూ రాక్షసుడి వెంటవెళ్ళాడు. గ్రామందాటారు. వెలివాడ చేరుకున్నారు. అల్లంత దూరాన ఒక వికృతాకారుడు కనిపించాడు. చచ్చిపోయిన గాడిద శరీరం నుండి మాంసం ముద్దలు పెకిలించి కాకులకూ, గ్రద్ధలకూ-కుక్కలకూ, నక్కలకూ-విందులు పంచుతున్నాడు. బ్రాహ్మణోత్తమా అతడే దత్తుడు. త్వరగా వెళ్ళు వెళ్ళి కాళ్ళ మీద బడు - అని మెల్లగా చెప్పి రాక్షసుడు చల్లగా జారుకున్నాడు. విష్ణుదత్తుడు సర్వశక్తులూ కూడ గట్టుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. గబగబా వెళ్ళి ఆ వికృతా కారుడి కాళ్ళమీద బడ్డాడు. రెండు పాదాలూ రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు కళ్ళు మూసుకొని. ఆయన ఎంత విదిలించినా వదలలేదు. మాంసం ముద్దలతో వీపు మీద ఎంత బాదినా పట్టు సడలించలేదు. తన శరీరంపై గాడిద మాంసం గుట్టలాగా పడింది. అయినా అసహ్యించుకోలేదు. అలా పాదాలు పట్టుకొని సాష్టాంగపడ్డవాడు పడ్డట్టే ఉన్నాడు.


No comments:

Post a Comment