Tuesday 9 May 2023

శ్రీదత్త పురాణము (133)

 


పీడాతుర వృత్తాంతం


బృహస్పతి చెబుతూ వుంటే శ్రద్ధగా వింటున్న ఇంద్రుడికి ఒక సందేహం వచ్చింది. ఇన్ని దివ్యవరాలు పొందిన విష్ణుదత్తుడు తన శేష జీవితాన్ని ఎలా గడిపాడు? ఆ శక్తుల్ని సద్వినియోగం చేసాడా? తెలుసుకోవాలి అనిపించింది. గురువర్యా తక్కిన ఉదాహరణల్ని తరువాత చెబుదురుగాని ముందు ఈ విష్ణుదత్తుడి కధ పూర్తి చెయ్యండి. వరాలు పొందిన తరువాత అతడి జీవితం ఎలా సాగింది తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది చెప్పండి - అని అడిగాడు. ఇంద్రుడి ఆంతర్యం దేవగురువుకి అర్ధం అయ్యింది. చిన్నగా నవ్వి అలాగేనంటూ ప్రారంభించాడు.


శచీవల్లభా! అత్యంత దుర్లభులైన దివ్యవరాలు పొందిన విష్ణుదత్తుడు సత్వగుణ సంపన్నుడిగానే జీవితాన్ని గడిపాడు. పెద్దగా పొంగిపోలేదు. విర్రవీగలేదు. గర్వించలేదు. శాంతుడూ, దాంతుడూ, సదాచారుడూ, సుశీలుడూ, దయాళుడు గానే జీవించాడు. ఇతరుల గుణాలను మెచ్చుకుంటూ అందరికీ మిత్రుడై, కవియై, సర్వజన ప్రియుడై ఎవరికీ ఏ ద్రోహమూ చేయనివాడై మునుపటిలాగానే తన బ్రతుకేదో తాము బ్రతుకుతూ జీవితం గడుపుతున్నాడు. తన ప్రభావాన్ని దివ్యశక్తుల్ని ఎవరికీ ప్రదర్శించలేదు ప్రచారం చేసుకోలేదు. మట్టిగప్పిన మాణిక్యంలాగానే వుండిపోయాడు.


అయితేనేమి దాగుతుందా? మంచీ దాగదు, చెడూ దాగదు. అతడి ప్రభావం ఆ నోటా ఈ నోటా పడి నెమ్మదినెమ్మదిగా లోకానికి తెలిసిపోయింది. గ్రామాలు, పట్టణాలు చివరికి రాష్ట్రం అంతా వ్యాపించి మొత్తం భూగోళం అంతా తెలిసిపోయింది. విష్ణుమూర్తి మహిమలాగా విష్ణుదత్తుడి కీర్తి దశదిశలా వ్యాపించింది. ఇంతా ఎందుకు చెప్తున్నానంటే అసలు సంగతి వస్తుంది విను.


No comments:

Post a Comment