Thursday 25 May 2023

శ్రీదత్త పురాణము (149)

 



ఇదిగో ఈ ఆత్మ స్వరూపాన్నే ఆహర్నిశలూ ధ్యానిస్తుంటాను. బాలబోధ కోసం భ్రమకు కూడా బుద్ధిమంతులు శాస్త్రాలలో నామాలు కల్పించారు. వాటిని చెబుతాను - ఆలకించు. మాయ - అవిద్య - పర - దేవి - మనస్సు - అనాది - భ్రమ - త్రివిత్తు - ప్రధానం- ప్రకృతి - బ్రహ్మయోని - అవ్యయం - విభ్రమం - శక్తి - కారణం - అజ్ఞానం అధ్యాస మోహం - ప్రస్వాపం - తపస్సు - ఇవికారణా విద్య నామధేయాలు. మోహం - మహామోహం - తామిశ్రం- అంధ తామిశ్రం - అనేవి అవిద్య తాలూకు పంచపర్వాలు. ఈ అవిద్యను తొలగించే ఉపాయం జ్ఞానమూ లేక విద్య అని బుధులు చెబుతున్నారే అవి కార్యాత్మక మోహానికి నామాలు. మూలాజ్ఞానానికి రెండు శక్తులు చెబుతారు. విక్షేపము, ఆవరణము అని. అవిభాగమైన పరమానందంలో విభాగాన కల్పన చేసే శక్తికి విక్షేపము అని పేరు. లేని కర్తృత్వ భోక్తృత్యాదులను ఇది కల్పిస్తుంది. ఈశ్వరుణ్ని ఆవరించి తెలియకుండా చేసేది ఆవరణ శక్తి.


జీవేశ్వరులకు బేధం ఏమిటి అన్నావుగదా విను. ఒక్క ముక్కలో చెబుతాను. మాయను లోబరుచుకున్నవాడు ఈశ్వరుడు. మాయకు లోబడినవాడు జీవుడు. వీరిలో స్వావిర్భూతచిదానందుడు- ఈశ్వరుడు. స్వావిర్భూత దుఃఖభోజనుడు జీవుడు. హ్లాదినియైన సంవిత్తులో (జ్ఞానం) కూడి ఈశ్వరుడు సచ్చిదానందుడిగా వుంటాడు. అవిద్యాసంవృతుడై జీవుడు దుఃఖభాజనుడవుతున్నాడు.


పరబ్రహ్మమే మాయచేత జగత్తుగా, జీవుడుగా, ఈశ్వరుడుగా భాసిస్తున్నాడు. ఆ మాయను పోగొట్టడం కోసం వేదం. సృష్టి ప్రళయకల్పన చేసింది. మూఢులు దాన్నే సత్యమని అనుకుంటున్నారు. వీరి జ్ఞానాన్ని, మూఢత్వాన్ని తొలగించే విధానం ఏమిటో - విను - ఆత్మ పదార్థం ఒక్కటే - అదే నానారూపాలతో జగత్తుగా మోహితుడికి కనబడుతోంది. జ్ఞానికి అలా కనబడదు. నిద్రలో స్వప్నం వస్తుంది. అలాంటిదే ఈ జగద్దర్శనం కూడానూ.


స్వప్నంలో కోరిన కోరికలు అన్నీ తీరుతాయి. అలాగే నానావిషయగోచరం అయిన ఈ జగత్తు నిజానికి అసత్తు అయినా సత్తుగా భాసిస్తుంది. మరి దీనితత్వం తెలుసుకోవటం ఎలాగూ అంటావా, చెబుతున్నాను విను. ఏ వస్తువు పట్ల ఎవడికి మోహం వల్ల అన్యధాజ్ఞానం కలుగుతుందో దాన్ని (మోహాన్ని) తొలగిస్తే తప్ప వాడికి తత్వం బోధపడదు. అవునుగదా, శుక్తి రజతభ్రాంతి ఉంది. రజత వివేకం వల్ల భ్రాంతిని తొలగించుకుంటే శుక్తి శుక్తిగా మిగులుతుంది. ఇలాగే స్థాణుచోరభ్రాంతి, రజ్జుసర్పభ్రాంతి మొదలైనవి. చోరజ్ఞానం, సర్పజ్ఞానం వీటితో భ్రమలు తొలగి అసలు వస్తువులు కనిపిస్తాయి. ఇలా భ్రమలు తొలగటానికి వస్తువులు సిద్ధించటానికి సాధనం యాగయోగాదికం. ఇంతకన్నా ఆక్షేపించవలసింది ఏమీ లేదు.


No comments:

Post a Comment