కొందరు అగ్ని నుండి జరిగింది అంటున్నారు. పాంచభౌతిక శరీరాలు, నరదేవాసుర జాతులూ పశుపక్ష్యాదులు తరులతా గుల్మాదులూ స్థూలసూక్ష్మ శరీరాలు ఇది అంతా ఉపక్రమపర్వం. ఇక ఉపసంహారక్రమం ఏమిటంటే-
ఏది దేని నుండి పుట్టిందో అది అందులోనే లయిస్తుంది. ఇంద్రియాలూ, తదధి దేవతలూ మనస్సు ఇవన్నీ తమకు కారణమైన అహంకారంలో లయిస్తాయి. అహంకారం మహత్తులో - మహత్తు వ్యక్త ప్రకృతిలో వ్యక్తప్రకృతి నిష్కళంకమైన అవ్యక్తపరబ్రహ్మంలో లయిస్తున్నాయి. ఈ లయాన్ని భ్రాంతులు సశేషమని సందేహిస్తున్నారు. సశేష కారణరూపమని సంభావిస్తారు. ఆత్మజ్ఞుడు మాత్రం నిస్స్వరూపమని గ్రహిస్తాడు. అన్నింటినీ తనలోనే ఆవిర్భవింపజేసుకుని పరబ్రహ్మం ఒక్కటే శాశ్వతంగా మిగిలి వెలుగుతుందని తెలుసుకుంటాడు. అంచేత నాయనా కార్తవీర్యా ఈ జగత్తులేదు. వట్టి మిథ్య. ఆత్మఒక్కటే సత్యం "జగన్మిథ్యా బ్రహ్మ సత్యమ్" మోహితుడికే జగత్తు తప్ప బోధితుడికి కేవలం ఆత్మఒక్కటే. దయానిధీ. దత్తదేవా! నీ అనుగ్రహం వల్ల కృతార్జుణ్ని అయ్యాను. బ్రహ్మతత్వం విషయమై నాకు నిశ్చయజ్ఞానం కలిగింది. సందేహాలన్నీ అంతరించాయి. ఈ ఆత్మానందాన్ని హృదయంలో రూఢపర్చుకోవాలంటే చెదిరిపోకుండా స్థిరపరచుకోవాలంటే ఉపాయం ఏమిటి? మహా యోగి! దీనవత్సలా! దయచేసి ఆ రహస్యం బోధించు అని కార్తవీర్యార్జునుడు అభ్యర్థించాడు.
అర్జునా! నీకు చిత్తశుద్ధి కలిగింది. దృఢమైన వైరాగ్యం ఏర్పడింది. నాయందు నిశ్చలమైన భక్తి కుదిరింది. అందువల్ల నేను చెప్పిన మహావాక్యాల అర్థాన్ని ఆసక్తిగా విన్నావు. అవగతం చేసుకున్నావు. దానితో తత్వజ్ఞానం కలిగింది. చితస్ధమైన ప్రపంచాస్థ అన్ని విధాల విలయమైంది. ముముక్షువు అయ్యావు. ఏకైకమూ అద్వితీయమూ అయిన ఈ మహోన్నతా భూమికకు నువ్వు చేరుకున్నావు. కనుక రాజోత్తమా నీకిప్పుడు బ్రహ్మసాక్షాత్కారం కలిగిస్తాను. దానికి కావలసిన సాధన సంపత్తిని వివరిస్తాను దత్త చిత్తుడవై ఆలకించు.
No comments:
Post a Comment