ఈ ప్రార్ధనకు సంబరపడ్డాడు అంబరవిహరి. సౌమ్యుడై విప్రరూపంలో దర్శనమిచ్చాడు. సాధ్వీ ఏమి ఆజ్ఞ ? అన్నాడు. ఆబ్ధికంలో రెండవ భోక్తగా కూర్చోవాలి నాయనా - అంది. సరే అన్నాడు. లోపలికి వచ్చి విష్ణుదత్తుడి నుండి అర్ఘ్యపాద్యాదులు అందుకొని రెండో పీట మీద కూర్చున్నాడు. అరిటాకు పరిచాడు విష్ణుదత్తుడు. సాధ్వీ! విశ్వదేవస్థానంలో మేమిద్దరం కుదిరాము. బాగుంది. మరి పితృదేవస్థానంలో కూర్చోడానికి మాకు సాటి మనిషి ఏడి? అని అడిగారు దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ.
స్వామి తొందరపడకండి ఇపుడే వస్తాను అంటూ సుశీల తమ నిరతాగ్నిశాలలోకి వెళ్ళింది. ఇలవేల్పు అగ్ని దేవుడ్ని ప్రార్ధించింది. సర్వశుచీ! సర్వభక్షకా! లే మరో రూపం ధరించు. త్వరగా రా. శ్రాద్ధభోక్తగా వచ్చి కూర్చున దత్తస్వామి నీ కోసం ఎదురు చూస్తూ వున్నాడు. తమకు సాటి వచ్చే మూడవ వాడివి నువ్వేనని భావిస్తున్నాడు. సురోత్తమా - సురవర్యా- వైశ్వానరా హవిర్భుజా అగ్నిముఖావై దేవాః అంటుంది వేదం. దేవతలకు నీవు ముఖ స్థానీయుడవు - ధూమకేతూ- గృహపతీ- కర్మాధ్యక్షా- నీకు ఇదే నమస్కరిస్తున్నాను అనుగ్రహించు.
ఆ పతివ్రత ఇలా ప్రార్ధించేసరికి ఒకానొక అగ్ని గుండం నుండి ఒక అంశతో అగ్నిదేవుడు ఆవిర్భవించాడు. మరొక అంశతో కుండంలోనే వున్నాడు. వచ్చిన అగ్ని దేవునికి కూడ అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు విష్ణుదత్తుడు. సరాసరి పీట మీదకెళ్ళి కూర్చున్నాడు. అరిటాకు సిద్దంచేసాడు విష్ణుదత్తుడు. ఆ పాతివ్రత్య మహత్మ్యాన్ని చూస్తున్న దత్తస్వామి ఆనందం పొందాడు. సూర్యాగ్నులూ దత్తదేవుడూ ఆహుతులై ఆయాస్థానాల్లో కూర్చుంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వంగా నిర్వహించాడు. ఇంతటి ఉత్తము విప్రులు ఎవరికైనా ఎన్నడైనా దొరుకుతారా? ముగ్గురూ శ్రాద్ధవిధి నియమాలకు అనుగుణంగా భోక్తృత్వం నెరపి సంతుష్టులై తృప్తాస్మాః అని ముక్త కంఠంతో పలికారు. విష్ణుదత్తుడి పితృపితామహ, ప్రపితామహులకు అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆశీర్వదించారు. సుశీలా విష్ణు దత్తులు సాష్టాంగపడ్డారు. లేచి అంజలి ఘటించి శిరస్సు వంచి నిలబడ్డారు. అప్పుడు ఆనందంతో భక్తిశ్రద్ధలతో విష్ణుదత్తుడు దత్తాత్రేయుడ్ని స్తుతించాడు.
No comments:
Post a Comment