Tuesday, 30 May 2023

శ్రీదత్త పురాణము (154)

 


సంప్రదాయ విశుద్ధి కోసం వాటిని కూడా విశదీకరిస్తున్నాను. గ్రహించు. (అష్టాంగ యోగ ఇత్యాహుః షడంగ ఇతి చాపరే)


యమం-నియమం-ఆసనం- ప్రాణాయామం-ప్రత్యాహారం-ధారణ-ధ్యానం-ఇవి సప్తాంగాలు, అష్టమాంగం సమాధినే ఫలము అంటారు. వీటిలో మొదటి యమనియమములు రెండూ యోగులకే కాదు ఏ మార్గంలోనైనా అందరికీ సర్వసాధారణంగా ఉండవలసినవే కనుక ఆసన ప్రాణాయామం నుంచి మొదలు పెట్టి యోగానికి షడంగాలే అంటున్నారు. మరికొందరు ఆసనమూ సర్వసాధరణమే కనుక ప్రాణాయామం నుంచీ పరిగణిస్తున్నారు. సమాధిని సవికల్పమనీ నిర్వికల్పమనీ విభజిస్తున్నారు. ఇలా వీరికి పడంగాలే అవుతున్నాయి. మొదటి రెండింటినీ వదలి సమాధి ద్వైవిధ్యాన్ని అంగీకరించి సప్తాంగములతోనే అష్టాంగయోగము అన్నవారూ ఉన్నారు.


వీటిలో యమములు పది. అహింస - సత్యం- ఆస్తేయం(అచౌర్యం) - బ్రహ్మచర్యం అపరిగ్రహం- ఆస్తిక్యం- మౌనం- అభయం- అసంగం- లజ్జ. నియమాలు కూడా పది. శౌచం- ఆచమనం - స్నానం - స్వాధ్యాయం - ఇజ్వ - మదర్చనం - తపం- జపం - సంతోషం తీర్ధ సేవ- జానూరువుల మధ్య పాదతలాల్ని ప్రేవేశ పెట్టి ఋజు కాయుడై కూర్చుంటే స్వస్తికం అంటారు. ఇలాంటి ఆసనాలు అనేకం ఉన్నాయి. ఎవరికి ఏది సుఖంగా ఉంటుందో ఆ ఆసనం వేసి యోగసాధనకు కూర్చోవాలి. నిర్జనమూ, నిశ్శబ్దమూ, నిరుపద్రవమూ, సుఖప్రదమూ అయిన సమతల ప్రదేశములో దర్భాసనం పరిచి దాని మీద కృష్ణాజినం (జింక చర్మం) పరచి సమకాయ శిరోగ్రీవుడై పద్మాసనమో మరొకటో వేసి కూర్చుని యోగాభ్యాసం చెయ్యాలి.


స్థిరంగా నిశ్చలంగా పరమాత్మను ధ్యానించాలి. ముందుగా మనస్సులో ఉండే మలినాలను తొలచి వేసేందుకు ప్రాణాయామం చెయ్యాలి. దీని కోసం ఎంతశ్రమపడినా పరవాలేదు. ప్రాణవాయువును నియంత్రించ గలిగితే మనస్సును జయించినట్లే. ప్రాణమూ మనస్సూ అనేవి జోడు గిత్తల్లాంటివి. బండిని వేగంగా లాగుతుంటాయి. వీటిలో ఒక గిత్త కొమ్ములకు పగ్గంవేసి అదుపుచేస్తే రెండవగిత్త కూడా తనంతతానే అదుపు అవుతుంది. అలాగే ప్రాణవాయువుకి పగ్గం వేస్తే మనస్సూలొంగి వస్తుంది. కొందరు సత్కర్మాచరణంతో ముందుగా మనశ్శుద్ధిని సాధించి నన్ను అర్చించి అటుపైన వశ్య ప్రాణులు అవుతున్నారు. ఇలా ఏదో క్రమానమనః ప్రాణాలను వశీకరించుకొని మిగతా ధారణాది యోగాంగాలను ఆచరించాలి. ముందుగా ప్రాణాయామం చేసే పద్ధతిని భోదిస్తాను గ్రహించు. ఇందులో మూడు దశలున్నాయి. ఎడమ ముక్కుతో వాయువును పూరించి వూపిరితిత్తులలో కుంభించి కుడి ముక్కుతో బయటికి విడిచి పెట్టాలి. (రేచకం) ఒక్కొక్క దానికీ పదహారు మాత్రల కాలం తీసికోవాలి.


No comments:

Post a Comment