Friday 19 May 2023

శ్రీదత్త పురాణము (143)

 


యోగిన్ ఏమిచెయ్యను? ఎక్కడికి వెళ్ళను? ఏది స్వీకరించను? ఏది పరిత్యజించను? కల్పాంతంలో నీటితో నిండిపోయినట్లు ఈ విశ్వం ఆత్మ పదార్ధంలో నిండిపోయింది. అంతా నేనే, నేను సదానందమయుడ్ని, సోహమ్. నాకింక భోక్తవ్యమేమిటి? పరిత్యాజ్యమేమిటి? అన్నమూ నేనే మంత్రమూ నేనే మరొకటి నేనే అన్నీ నేనే. అంతా నేనే.


శిశుయోగి మాటలకు విష్ణుదత్తుడు చాలా సంబరపడ్డాడు. మృదువుగా కౌగిలించుకున్నాడు. నాయనా నిజమే. అంతా నువ్వే అన్నీ నువ్వే. విశ్వమంతా ఆత్మ పదార్ధమే. అలాంటప్పుడు కర్మను ఆచరించకపోవడం ఎంతటిదో ఆచరించడం అంతటిదే కదా! ఆచరించినందువల్ల నీకు ఏ దోషం చుట్టుకుంటుందో చెప్పు నిష్కామకర్మాచరణంతో జీవన్ముక్తుడవై సుఖంగా జీవించు. కర్మాచరణం నువ్వు చెయ్యి ఎదుటి వారికి నేర్పు. ఆదర్శప్రాయంగా నిలబడు. లోకం కోసం కొన్ని పనులు మనం చెయ్యాలి. ఇందువల్ల కర్మానుబంధం చుట్టుకోదా అని నువ్వు అడగవచ్చు. చుట్టుకోదు. ఎందుకంటే - ఏ బంధమైనా దేహాభిమానంవల్ల పుడుతుంది. దాన్ని వదలడమే కదా ముక్తి అంటే. నేను నాది అనేవి బంధ కారణాలు. నేను కాను - నాది కాదు అనేవి ముక్తి కారకాలు.


శిశు యోగీశ్వరా! స్వస్వరూపం తెలుసుకో ఇక్కడ నీకు కర్మానుబంధం లేదు. మాన అవమానాలవల్ల కలిగే - గుణదోషాలు కూడా అభిమానం వల్లనే. కనుక దేహాభిమానం వదిలేస్తే గుణమూ లేదు దోషమూలేదు. బంధమూ లేదు. ఈ అభిమానాన్ని వదలలేక కర్తృత్వాన్ని తన మీదనే వేసుకునే అహంకారికి విషయ వాసనలు సుఖ దుఃఖాదిక్రియలు తప్పవు. నిరభిమానికి ఇవి ఏవీ అంటవు. అందుచేత ఆ అహంకారాన్ని ఆ దేహాభిమానాన్ని ఒక్కదాన్ని విడిచిపెట్ట గలిగి కర్మ మార్గంలో ప్రయాణం చేసినా - ఒకవేళ అతడు మూఢుడే అయినా కర్మపాశబద్ధుడు కాదంటే ఇక నీబోటి పండితుడి సంగతి చెప్పాలా?


No comments:

Post a Comment