Sunday 21 May 2023

శ్రీదత్త పురాణము (145)

 


ఆ శిశుయోగి తల్లిదండ్రులు వున్నంత కాలం వారికి ప్రీతికరంగా మెలిగి ఆ పైన బంధ విముక్తుడై వూరు, ఇల్లూ, వాకిలీ అన్నింటినీ విడచి ఆత్మరతుడై ఈ భూగోళం మీదకి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇంద్రా విన్నావుగదా కధ. ఈ శిశుయోగి జ్ఞాన సుధా సముద్రుడే కాని రవ్వంత సంగభయం ఉంది. విష్ణుదత్తుడు రవ్వంత ప్రభోధం చేసేసరికి ఆ భయాన్ని వదలిపెట్టాడు.


ఇతడిలాగే లోకులు అందరూ లోపలున్న ప్రజ్ఞాఘనుడైన పరమాత్మను నిత్యమూ అనుభవిస్తూ వున్నా మోహావృతులవుతున్నారు. నేనే కర్తను, నేనే దాతను, నేనే వికర్తను, సుఖదుఃఖాలకు నేనే భోక్తము అని భావిస్తూ మూఢులై భ్రాంతులై లోపలున్న పరమాత్మను తెలుసుకో లేక పోతున్నారు. ప్రత్యక్షంగా పరమాత్మానుభూతి పొందుతూ కూడా లోపలికి దృష్టి నిలపలేక నేనెవణ్ని? ఎక్కడ ఎలా నాకు ఆత్మ జ్ఞానం లభిస్తుంది? అని అంగలారుస్తూ వృధాగా వెలుపలకు పరుగులు తీస్తున్నారు. పిల్లాడిని చంకలో పెట్టుకొని పూరంతా గాలించి ఏడుపు లంకించుకుంటున్న తల్లిలాగా ఆత్మతత్వం కోసం విలపిస్తోంది ఈ లోకం అంతా.


దేవతా విభూ! ఇంద్రా! ఇలా శాస్త్రాలన్నీ తేలికగా సుఖంగా బోధలు చేస్తూ క్రమంగా మోహాన్ని తొలగించడంలో ఉపయోగపడుతున్నాయి. ఇందులో నేను చేసిన అపూర్వ సృష్టిగాని కల్పనకానీ అణుమాత్రం కూడా లేదు. నువ్వు నీ సొంత బుద్ధితో ఆలోచించి ఇది నిజమో కాదో, మంచి అవునో కాదో తేల్చి చెప్పు. బృహస్పతి ఇలా ఏడు ఉదాహరణలు చెప్పాడని కార్త వీర్యార్జునునికి దత్తాత్రేయుడు వివరించాడు. అంతా విన్న కార్త వీర్యుడుకి చివరి అంశం సందేహం మిగిలిపోయింది. ఏడు కథలూ విన్నాక దేవేంద్రుడు ఏమన్నాడు? విభిన్న మార్గాలలో నడిచే శాస్త్రాల ఏకత్వం అంగీకరించాడా లేదా? ఇవే సందేహాలు దత్తస్వామి ముందు వుంచాడు. బృహస్పతికి ఇంద్రుడు చెప్పిన సమాధానాన్ని యధాతధంగా దత్తదేవుడు ఇలా వినిపించాడు.


No comments:

Post a Comment