Monday 15 May 2023

శ్రీదత్త పురాణము (139)

 


మిత్రులారా వీళ్ళిద్దరూ శీలం, రూపం, వయస్సు, స్వరం, వర్గం, ఆవృతి, నామం, గోత్రం, చేష్టలు, అన్నింటిలోనూ ఒక్కటిగా వున్నారు. వీరిలో ఎవరు సత్య కుండిలులో మన ముందువున్న సమస్య. మీరందరూ అంగీకరిస్తే వీళ్ళిద్దరకూ కొన్ని పరీక్షలు పెడతాను. మీరంతా సాక్షులుగా ఉండండి. ఎవరు ఏమిటో ఇప్పుడే తేలుద్దాం - అన్నాడు. అందరూ అంగీకరించారు. వెంటనే ఇద్దరిఫాలభాగాల మీద గుర్తింపుకొరకు ఒకరినొసట “కా” అని ఇంకొకరి నొసట “గా” అని ముద్రలు వేయించాడు. ముందుగా "కా" వ్యక్తిని దగ్గరకు పిలిచి "గా" వ్యక్తిని దూరంగా పంపి మీ ఇంట్లోవున్న వస్త్రములు - ధనములు - ధాన్యములు - ఆభరణములు - వస్తువులు - అలాగే విశాలాక్షి వంటిపై నున్న పుట్టుమచ్చలూ, రోగాలు, రొష్టులూ, అలవాట్లూ అన్నీ జాబితాలాగా చెప్పమన్నాడు. వాడు చెబుతూవుంటే ఒక వ్యక్తి చేత రాయించి పక్షులవద్ద భద్రంగా వుంచాడు. అలాగే "గా" వ్యక్తిని కూడా పిలిపించి అతడితోనూ అలాగే చెప్పించి జాబితా రాయించి భద్రపరిచాడు. ఆ తర్వాత విశాలాక్షిని పిలచి ఆమెతోనూ ఇంట్లో వున్న సామాగ్రి తన పుట్టుమచ్చలూ మగడి పుట్టుమచ్చలూ వగైరా అన్నీ రాయించి సాక్షులకు అందించాడు. మూడు జాబితాలను తాను క్షుణ్ణంగా పరిశీలించాడు. ఇక ఒక నిశ్చయానికి వచ్చాడు. కానీ ఏమీ చెప్పలేదు.


చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరినీ ఒకే సారి దగ్గరకు పిలచి పంచక్రోశవిశాలమైన దివ్యక్షేత్రం ఇది. దీనికి ప్రదక్షిణ చేసి రావాలి. దారిలో ఎన్ని దేవాలయాలు వున్నాయో వాటిలో ఏ దేవతా మూర్తులు వున్నాయో ఆయా మూర్తుల లక్షణాలు ఏమిటో చెప్పాలి ఎవరు ముందు వచ్చి చెబితే వారు గెలిచినట్లు - అని ప్రకటించాడు. ఇద్దరూ వెంటనే బయలు దేరారు. "గా" వ్యక్తి మాత్రం అర్థగంటలోనే తిరిగి వచ్చి అన్ని వివరాలు గడగడా చెప్పాడు. "కా" వ్యక్తి మాత్రం ఎప్పుడో మధ్యాహ్ననికి అలసిసొలసి తిరిగి వచ్చాడు. మెల్లగా అన్నీ చెప్పాడు. విష్ణుదత్తుడు ఇద్దరినీ సమానశ్రద్ధతో విన్నాడు. వారు చెప్పింది ఒక వ్యక్తితో అన్నీ రాయించారు.


ఇంకొక పరీక్ష పెట్టాడు విష్ణుదత్తుడు. ఈ సహ్యాద్రి పర్వతం మీద ప్రసిద్ధులైన సిద్ధ యోగులు కొందరు వున్నారు. వారిని దర్శించి నమస్కరించి వారి గోత్రనామాలు కనుక్కొని రండి ముందు వచ్చి చెప్పిన వాడు జయించినట్లు అన్నాడు. ఇద్దరూ పరుగు పరుగున బయలు దేరారు. క్షణకాలంలోనే తిరిగి వచ్చాడు “గా” వ్యక్తి సిద్ధయోగుల గోత్రనామాలన్నీ వరుసలో ఏకరువు పెట్టాడు. అది కూడా జాబితా రాయించి భద్రపరిచాడు. ప్రాద్దు గుంకింది. చీకట్లు కమ్ముకున్నాయి. తొలి జాము గడిచిపోయింది. అప్పటికి తిరిగి వచ్చాడు “కా” వ్యక్తి రొప్పుతూ రోజుతూ- పాపం పడ్తూ లేస్తూ వచ్చాడు. వస్తూనే విష్ణుదత్తుని పాదాల మీద బడ్డాడు మహానుభావా నిజం చెబుతున్నాను కొండ అంతా తిరిగి తిరిగి వచ్చాను. ఎంతో పరీక్షగా చూసాను. నా కంటికి ఏ సిద్ధయోగీ కనిపించలేదు. ఇంక నమస్కరించడం ఏమిటి? గోత్రనామాలు అడగడం ఏమిటి? కాళ్ళీడ్చుకొంటూ ఎలాగో మీ దగ్గరకు చేరుకున్నాను. ఇంక భయంలేదు. కాసిన్ని మంచి నీళ్ళు ఇప్పించండి అన్నాడు. అతడికి అవసరమైన ఉపచారములు చేయించి విష్ణుదత్తుడు ఈ సారి - గంభీరంగా కూర్చున్నాడు. ఒక్క నిముషం కళ్ళు మూసుకొని తెరిచాడు.


No comments:

Post a Comment