Tuesday 13 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (53)


నీలాపనిందలు కృష్ణునకు


ప్రసేనుడు తిరిగి రాకపోవడం విని సత్రాజిత్తు కంగారు పడ్డాడు. కృష్ణుడే చంపి యుంటాడని సత్రాజిత్తు నిర్ధారణకు వచ్చాడు. భాగవతం ప్రకారం కృష్ణుడు ప్రసేనునితో కలిసి వెళ్ళకపోయినా ఇతడు తన సోదరుణ్ణి చంపించి యుంటాడని సత్రాజిత్తు సందేహించి నట్లుంది. "ఈ కృష్ణునకు మణిపై ఏనాడో కన్ను పడింది. మణిని ధరించి ప్రసేనుడు అడవికి వెళ్ళడం ఇతనికి మంచి అవకాశాన్ని కల్పించింది. అతడు తిరిగి రాకపోతే ఏ క్రూర జంతువు చంపి యుంటుందని ప్రజలు సందేహిస్తారు. కనుక శ్రీకృష్ణుడు తన మనుష్యులను పంపి ప్రసేనుణ్ణి చంపించి యుంటాడు" అని సత్రాజిత్తు నిర్ణయించాడు.


పరమాత్ముడు, మానవ కారం ధరించినపుడు మానవుల పట్ల వేసే నీలాపనిందలు అతనిపట్ల మోపుతారు. వాటిని అనుభవిస్తూ మానవునకు గుణపాఠం నేర్పడమే అవతార ప్రయోజనం.


సత్రాజిత్తు రెండు నేరాలను మోపాడు. కృష్ణుడు ప్రసేనుణ్ణి చంపాడని, మణిని దొంగిలించి ఎక్కడో పెట్టాడని, ఇట్లా నిందా ప్రచారం సాగింది. 


మానవ ప్రవృత్తి చిత్రవిచిత్రంగా ఉంటుంది. ఒకమాటు తమ నాయకుణ్ణి ఆకాశానికి ఎత్తుతారు. కొంతకాలానికి చెత్తబుట్టలో వేస్తారు. ఇది అన్నికాలాలలోనూ ఉంది. ఏ కృష్ణుడు కంసుని బారినుండి యాదవ కులాన్ని రక్షించాడో, సుఖ సంపదలనిచ్చాడో అట్టివాడే నీలాపనిందలకు లోనైనాడు. ఈ ప్రజలు సత్రాజిత్తునకు వంత పాడారు. మోసం, దగా కృష్ణునకు వెన్నతో బెట్టిన విద్యలని అంటూ లేనిపోని అక్కసును వ్రెళ్ళకక్కారు. కాళీయుని నుండి ప్రజలను కాపాడం, గోవర్ధనాన్ని గొడుగుగా చేసి ప్రజలను రక్షించడం మొదలైనవి ప్రజలకు గుర్తుకు రాలేదు. చూసారా ప్రజల మనఃప్రవృత్తి? 


ఇట్లా ఉన్నారేమిటిని భగవానుడే కలత చెందాడు (కలత చెందినట్లు నటించాడని అందాం). ఇట్లా నిందలు వేస్తారని ఊహించలేదు. ఒక నిజాయితీ గల మనిషి ఇట్టి పరిస్థితులలో ఎట్ల బాధ పడతాడో అట్లా బాధపడ్డాడు. తన పరబ్రహ్మ తత్వాన్ని ప్రకటించకుండా ప్రసేనుడు కనబడకపోవడం ఏమిటో తెలుసుకోవాలని నిందలను తొలగించుకోవాలని ప్రయత్నించాడు.

No comments:

Post a Comment