Wednesday 14 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (54)



రహస్యాన్ని ఛేదించాడు


సత్రాజిత్తు యొక్క అనుచరులతో మరల అడవికెళ్ళాడు కృష్ణుడు. గుర్రపు గిట్టల గుర్తులను బట్టి కొంత దూరం వెళ్ళగా, ఒకచోట గుర్తులు కనబడలేదు. ఆ చోటంతా రక్తపు మరకలతో ఉంది. ఎముకలు పడి యున్నాయి. ప్రసేనుని చివికిన గుడ్డలు కనబడ్డాయి. అతని ఆభరణాలు గుర్రపు జీను కనబడ్డాయి. భగవంతుడే దండయాత్ర చేస్తే మొత్తం శవం కనబడాలి కదా! పోనీ ఎవరైనా చంపితే ఆ శవాన్ని జంతువులు తిని ఉండవచ్చు. అట్లా భావించారు ఇతనితో వచ్చినవారు. రాజు యొక్క ఆభరణాలు పడి యున్నాయిగాని మణి మాత్రం కనబడడం లేదు. ఇది సందేహానికి తావిచ్చింది.


ఇంతలో సింహపు కాలిగుర్తులు కనబడ్డాయి, కృష్ణునకు. వీటి జాడ తెలిసి కొందాం రండని అన్నాడు. కొంత దూరం వెళ్ళగా సింహం కళేబరం కనబడింది. సింహం పడినచోట ఎలుగుబంటి జాడలు కనిపించాయి. సింహం పాదాల కంటే వీటి పాదాలు పెద్దవిగా ఉంటాయి. అవి రెండు కాళ్ళ మీద నిలబడగలవు కూడా. పాదాల గుర్తులు నేలలో స్పష్టంగా పెద్దవిగా కన్పిస్తున్నాయి. ఇక జాంబవంతుని గుర్తులను వేరే చెప్పాలా? ఆ గుర్తులను పట్టి గుహలో ప్రవేశించాడు. గుహ చీకటి మయం. తోటి ప్రజలు ప్రవేశించడానికి భయపడ్డారు. ఇక కృష్ణుణ్ణి ఎట్లాగూ సందేహిస్తున్నారాయె. మనలను ఇందులో ప్రవేశపెట్టి చంపుతాడేమో అని భావించారు. 


కృష్ణుడు ఆపదలనెదుర్కొంటాడు కదా! కనుక మీరందరూ గుహ దగ్గర ఉండండి, నేనే లోపలకి వెడతానన్నాడు. అతని శరీర కాంతి ఆ గుహలో వెలుగు.

No comments:

Post a Comment