Monday 12 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (52)


సరే ఆ నాటివాడు, ద్వాపరయుగంలో ఉండి ఈ మణిని తీసుకొని వెళ్ళే సింహాన్ని చూసాడు. అతనికి సుకుమారుడనే పిల్లాడున్నాడు. ఆ వయసులో అతనికి పిల్లవాడేమిటని ఆశ్చర్యపోతున్నాం. మెరిసే మణి, తన పిల్లవానికి ఆటవస్తువుగా పనికి వస్తుందని భావించాడు. 


సింహాన్ని చంపి మణిని తీసుకొని పిల్లవాడూగే ఉయ్యాల గొలుసులకు కట్టాడు. వాలి కూడా అంగదుడు నిద్రపోయే ఊయలకు రావణుణ్ణి ఆటబొమ్మగా కట్టాడు. రావణుణ్ణి పది తలల పురుగని అన్నాడు కూడా.


కృష్ణుడు చంద్రుని చూచుట


వినాయకునకు శ్యమంతకమణికి గల సంబంధాన్ని స్కాందంలోని కథ చెప్పింది. దీని ప్రకారం ప్రసేనుడు, కృష్ణుడు కలిసి వేటకు వెళ్ళినట్లుందని చెప్పాను కదా. అప్పుడు ప్రసేనుడు విడిపోయి సింహం చేత చంపబడ్డాడని తుదకు జాంబవంతుని దగ్గరకు మణి చేరిందని కథ. 


భగవానుడు, ప్రసేనునికై వెదికాడు. సూర్యాస్తమయం అయిపోయింది. చీకటి పడింది. ఇంతలో చవితి చంద్రుణ్ణి అకాశంలో చూసాడు. 


శుక్లపక్షంలో చవితి నాటి చంద్రుడు స్పష్టంగా కన్పిస్తాడు. తదియనాడు ప్రొద్దున్న ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటలలోపు అస్తమిస్తాడు. సూర్యుని కాంతి ప్రభావం వల్ల సూర్యాస్తమయం అయ్యేవరకు చంద్రుడు కనిపించడు కదా. వెన్నెలలో 6-30 నుండి 7 గంటలవరకూ పడమర దిక్కు దిగువున మసక మసకగా కన్పిస్తాడు. దీనిని జాగరూకతతో గమనించాలి. చవితినాడు ప్రొద్దున్న తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల సమయంలో స్పష్టంగా కన్పిస్తాడు. అట్టి స్థితిలో అరెరె! చీకటిగా ఉంది. ఇక వెదకటం ఎందుకని ద్వారకకు తిరిగి వచ్చాడు కృష్ణుడు.

No comments:

Post a Comment