Wednesday 7 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (47)


తపస్సు వల్ల దివ్యమణి


ఒకనాడు సత్రాజిత్తు సముద్ర తీరంలో ఇష్టదైవమైన సూర్యుణ్ణి ఆరాధించాడు. ఏ వరం కావాలని సూర్యుడడిగాడు.  


సూర్యుని మెడలో తళతళలాడే మణి యుంది. అదే శ్యమంతకమణి. ఇది కాంతినే గాక బంగారాన్ని ప్రసాదిస్తుందని ఆ మణిని సత్రాజిత్తు ఇమ్మన్నాడు. దాన్ని సత్రాజిత్తు మెడలో సూర్యుడు వేశాడు. 


నా దివ్య రూపంలా మెరిసే ఈ మణి రోగాదులను కూడా పోగొడుతుందని అన్నాడు. అంతే కాకుండా బంగారాన్ని రోజూ ఇస్తుందన్నాడు. అయితే దీనిని ధరించినవాడు శారీరకంగా, మానసికంగా పరిశుద్ధుడై యుండాలని షరతు పెట్టాడు. ఏ తప్పు చేసినా ఇంతే సంగతులని అదృశ్యమయ్యాడు. 


సత్రాజిత్తు మణిని ధరించి నగరంలో ప్రవేశించాడు. ఆ కాంతి ప్రవాహంలో ఇతణ్ణి ప్రజలు గుర్తు పట్టలేకపోయారు. ఆ కాంతినే చూస్తూ ఉండిపోయారు. సూర్యభగవానుడే శ్రీకృష్ణుని దర్శించడానికి వచ్చాడా అని వారు ఆశ్చర్య చకితులయినప్పుడు మరీ దగ్గరగా చూస్తే ఇతడు కనబడ్డాడు. ఈ సూర్య ప్రసాద మహిమను వేనోళ్ళ కొనియాడారు. 


కృష్ణుడు రసికుడు కనుక ఇందలి సొగసునకు ఆకర్షితుడయ్యాడు. కృష్ణుడు పొగుడుతూ ఉంటే ఇతనికి ఆ మణి కావాలేమోయని ఊహించాడు సత్రాజిత్తు.

No comments:

Post a Comment