Friday 9 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (49)



నేను కృష్ణుని నిరాసక్తతను చెప్పదలుచుకున్నాను. శంఖం, చక్రం, గరుడుడు ఆయా సందర్భాలలో కృష్ణుని దగ్గరకు వచ్చాయి. మహావిష్ణువు ధరించే కౌస్తుభమణి కృష్ణుని దగ్గరకు వచ్చింది. 


కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభం 

అనే శ్లోకాన్ని విన్నాం. అట్టి కౌస్తుభాన్ని ధరించగా ఈ మణి కావాలా? 


ఈ శ్యమంతక మణిని ఉగ్రసేన మహారాజు ధరిస్తే బాగుంటుందని సూచించాడు. రాజు ధరించడం వల్ల రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే, అంతేనే కాని తాను ధరించి మురిసి పోవాలని ఉద్దేశ్యం కాదు. సత్రాజిత్తు ఈ భాగ్యమంతా తన కుటుంబానికి చెందాలని భావించే సామాన్య పౌరుడు. ఈ అపార సంపద రాజుకు చెందితే ప్రజలందరికీ సౌభాగ్యము కల్గుతుందనే విశాల భావనతో అట్టి సూచన కృష్ణుడు చేసాడు. 


ఒక సామాన్యుని దగ్గర రాజు కంటే అధిక సంపద ఉంటే అతణ్ణే సామాన్యులు రాజుగా భావిస్తారు. కనుక అట్టి విశేష సంపద సామాన్యుల దగ్గర ఉండకూడదని అర్ధ శాస్త్రం చెప్పింది. విలువైన మణులు రాజునకే చెందుతాయని 'రాజా రత్నహారీ' అనే మాట ఉంది.


ఇట్టి సద్భావనతో కృష్ణుడు సూచించగా నేను రాజును, మంత్రిని లెక్కబెట్టడమేమిటి? ఈ రాజును కృష్ణుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు, ఇతని తాతకే ఆ పదవిని కట్టబెట్టేడని, ఈ మిషతో తానే ఉంచుకోవాలని కృష్ణుడు భావించాడనీ ఊహించాడు సత్రాజిత్తు.


ఈ కథ, ఆశ ఎంత పనిచేస్తుందో చూపించడం లేదా? 

No comments:

Post a Comment