Saturday, 31 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (67)



విభీషణ శరణాగతి == ముందు చూపు


లంకా నగరాన రావణునితో “యుద్ధము తగదని, సంధి చేసు కొమ్మని, అన్నీ అశుభ శకునాలే కనిపిస్తున్నాయని" తన శక్తి వంచనలేక ఎంతగానో సమరము నాపనెంచిన విభీషణునికి తిరస్కారావమానాలే ఎదురుకాగా- తన సహచరులతో రాముడున్న తావునకు వచ్చి శరణు వేడినాడు. సుగ్రీవాది వానర వీరులు విరోధి సోదరుడు కాన ఇతనికి శరణ మిచ్చుటకు ఇది తగిన సమయము కాదని తమ తమ వాదనలను వినిపించగా ఆంజనేయుడు విభీషణుని అంతరంగాన్ని అవలోకించి అరి (శత్రు) వర్గమునకు చెందిన వాడైనా ఇతని హృదయం ధర్మబద్ధం. ఇతనిలో ఏ దోషం లేదు. ఆశ్రయమీయ తగునని నయబుద్ధితో వివరించి శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయినాడు.


గతాన్ని నెమరువేస్తూ, వర్తమానాన్ని చూస్తూ, భావిని ఊహించగలవాడే భవిష్యత్తులో సుఖసంతోషాల నందగలడు. సలహాల నిచ్చువారు తమ యజమానులకు మేలు జరుగురీతిన ప్రజ్ఞా పాటవాలతో భవిష్యత్కాలాన్ని దృష్టిలో ఉంచుకొని బాగోగులు విచారించి సలహా, సంప్రతింపులు జరిపిననాడు అటు యజమాని సత్ఫలితాల నందగలడు. ఇటు అ సేవకునిపై యజమానికి గౌరవభావం ఇనుమడించును. ఇచట బుద్ధి విశేషం ప్రధానం. స్వార్థమే లేని పదార్థం ప్రధానం. నేటికాలాన ముఖ్యంగా కీలకమైన పదవులలో నున్నవారు ఆంజనేయుని ధీవైభవాన్ని ఏ కొంచెం గ్రహించినా ప్రభుత పడిపోదు. తిరోగమన పథంవైపు సాగదు. ప్రగతిపథాన నడుస్తుంది. ఎటుచూచినా స్వార్ధం, స్వార్థం, స్వార్థం తప్ప పరార్థం కానరాదే. చూడండి హనుమ అందరివలెకాక రాబోవు రామ, రావణ యుద్ధంలో శత్రువుల రహస్యాలు, వారి జవజీవ రహస్యాలన్నీ తెలిసిన విభీషణుని అవసరం ఎంతో ఉందని గ్రహించిన ప్రాజ్ఞుడు కాననే శరణమీయ తగునని సలహా ఇచ్చినాడు. ఈ సన్నివేశం దృష్టిలో ఉంచుకొనే ఏమో!! "ఇంటి గుట్టు లంకకు చేటు" అన్న సామెత వచ్చియుండును. ఎదుటివాని మనసును గ్రహింపగలది ఒక్క బుద్ధి విశేషమే. ఆది హనుమంతునికి వెన్నతో పెట్టిన విద్య. బుద్ధి వైభవాన్ని తెలిపే ఒక పద్యం మన సాహిత్యంలో ఉంది. గమనించండి. 


వాయువు దూరని చోటను 

తోయజ బాంధవుని రశ్మి దూరని చోటన్ 

దీయుతుల బుద్ది దూరుని

రాయాసంబునను కార్యమగు తద్బుద్దిన్.

Friday, 30 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (66)



ఆంజనేయుని.. లంకానగర శోధనా వివరణ 


నగరానికి సమాయత్తమవుతూ రాముడు “ఆంజనేయా! లంకా నగరాన్ని రాక్షసులెలా రక్షిస్తున్నారు. వారి బలగం, ఆయుధ సంపత్తి ఎంత వివరంగా చెప్ప” మనగా -


హృష్టా ప్రముదితా లంకా మత్తద్విప సమాకులా

మహతీ రథ సంపూర్ణా రక్షో గణ సమాకులా

వాజిభిశ్చ సుసంపూర్ణా సా పురీ దుర్గమా పరైః

దృఢబద్ధ కవాటాని మహా పరిషువంతి చ. 


“రామా! లంకానగర వైభవం వర్ణనాతీతం. ఆ నగరవాసులు చీకూ చింతాలేనివారు, కడుపులోని చల్ల కదలకుండా సుఖమయ జీవనయానం సాగిస్తున్నారు. సలలిత రాగ సుధారస గానాలతో సర్వ కళామయ నాట్యవిన్యాసాలతో విరాజిల్లే లంకా పట్టణం - వేనవేల రథాలతో, ఏనుగులతో, గుఱ్ఱాలతో అలరారే స్వర్ణమయి.


ఇక యీ లంకా నగరానికి నలుదిక్కుగా నాలుగు ద్వారాలు. వాటికి అభేద్యమైన కవాటాలు, వాటికి రాళ్ళూ, బాణాలూ వర్షించే యంత్రాలు, బల పరాక్రమాలుగల సాయుధపాణుల కాపలా, ఆ నగర ప్రాకారం బంగారుమయం. ప్రాకారాన్ని చుట్టుముట్టిన అగడ్త. నిరంతరం నిండుగా ప్రవహించే నీరుగల అగడ్తలవి. లంకా ప్రవేశ నిర్గమాలకు నలువైపులా వేలాడే వంతెనలు- వాటిని వాల్చటానికి, ఎత్తటానికి యంత్రాలు, ఇది శత్రు దుర్భేద్యం.


నేను ఆ నాలుగు వంతెసలను విరగగొట్టాను. అగడ్తలను నామరూపాలు లేకుండా పూడ్చివేశాను. ప్రాకారం రూపురేఖలు లేకుండా చేశాను. భవనాలన్నీ భస్మీభూతం చేశాను. ఇక మన ముందున్న తక్షణ కర్తవ్యం సముద్రాన్ని దాటడం" అన్నాడు ఆంజనేయుడు.


ఇచట హనుమానుని బుద్ధి వైభవం గమనింపతగినది. తాను లంకా పరిసరాలను పరీక్షగా పరికించాడు. సామ, దాన, భేదో పాయాలకు లొంగని రాక్షసులను అశోకవన ధ్వంసంతో వారిపై దండోపాయం ప్రయోగించాడు. లంకానగర రహస్యాలు కనుగొన్నాడు. పూర్తి అవగాహనతో గుర్తు పెట్టుకున్నాడు. అవసర సమయాన వినియోగించుకున్నాడు. ముందుచూపు కలిగినవాడు కాబట్టి భావికాలాని కనుగుణంగా ప్రవర్తించి ఉత్తమ దూతగా రామునిచే ప్రశంసింపబడినాడు.


కారణాంతరాల వలన మనం ఏదైనా సరికొత్త తావునకు వెళ్ళుట జరిగితే- ఆ ప్రదేశం పూర్తి సమాచారాన్ని, అచటివారిని మంచి మాటలతో అలరించి తెలుసుకోవాలన్నమాట. అవసరమై నంతమట్టుకే కొందరి ప్రవర్తన ఉంటుంది. అలా చేయరాదు. దీర్ఘ దర్శివోలె ఆ ప్రాంతపు టానుపానులను పూర్తిగా గ్రహించ ఆ గలగాలి.

Thursday, 29 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (65)



అహంచ రఘువంశశ్చ లక్ష్మణశ్చ మహాబలః 

వైదేహ్యా దర్శనే నాద్య ధర్మతః పరిరక్షితాః.


ఈ మహాత్ముడు నిస్సందేహంగా ఉన్నత శ్రేణికి చెందిన సేవకుడు. ఈతడొనర్చిన ఉపకారమునకు నేను, లక్ష్మణుడు, రఘువంశీయులు అంతా ఎంతో ఋణపడి ఉన్నాం. ఈతని ఉపకృతికి నా సర్వస్వం అర్పించినా సమానం కాదు.


మయి ఏక జీర్ణతాం యాకు త్త్వయోపకృతం కపే 

నరః ప్రత్యుపకారాణాం ఆపత్స్వాయాతి పాత్రతాం.


హనుమా! నీవొనర్చిన ఉపపకారము నాలో జీర్ణించుగాక. ఇదిగో! నా ఆలింగనమే యీ సమయాన నీకిచ్చు బహుమానం అని ఎంత తపస్సు చేసినవారికిని అందుకోరాని, అందుకోలేని గాఢ పరిష్వంగంతో (కౌగ్లింత) సమ్మానించాడు. 


ఆంజనేయుని ఔచిత్య సంభాషణ, విషయ వివేచనాశక్తి, ఉచితానుచిత ప్రవర్తన గమనింపతగినది. ఏమంటే- అంగద, జాంబవంతాదుల దగ్గర తన పరాక్రమం పరిక్రమించిన విధానం ఆ అద్భుత సాహస కృత్యాలు వివరించాడేగాని సీతామాత సందేశం- ఆమె చెప్పిన ఆనవాళ్ళు చెప్పలేదు. ఇక రాముని సన్నిధిలో తన సాహసయాత్ర, బల ప్రదర్శన వగైరాలు చెప్పక కేవలం వైదేహి వచనాలే వివరిస్తాడు. ఇందులో ఒక రహస్యం వుంది. ముందే మనం చెప్పుకున్నాం. తన ప్రతి కదలికలో, నడవడికలో లోకానికో సందేశం చాటాడని.


ఇక్కడ- సమాన వయస్కుల దగ్గర, స్నేహితుల దగ్గర మాత్రం తన శక్తియుక్తులు చెప్పుకోవచ్చుగాని, పెద్దల దగ్గర మాత్రం తగురీతిలో విధేయతా వినమ్రతలతో- ఆచి తూచి మాట్లాడాలి. అలాంటప్పుడే వారి ఆదరాభిమానాలూ, ఆశీస్సులూ వీరికి లభిస్తాయి. అంతర్గతంగా వారి శక్తి వీరిలో ప్రవేశిస్తుంది. అలాకాక పెద్దల సమక్షంలో గొప్పలు చెప్పుకుంటే వారు దానిని 'అహంకారం'గా భావించే అవకాశం లేకపోలేదు. వారి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. తన వీర్యం నిర్వీర్యమవుతుంది. అదీ ఇచట గమనింపవలసిన సందేశం.


Wednesday, 28 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (64)


రాముని అభినందన


అని చెప్పుచున్నంతలో గగనాన కిలకిలారావాలు, ఉత్సాహ సింహనాదాలు సుగ్రీవునికి శ్రవణానందం కాగా, పర్వదినాలలో పొంగే సముద్రుని వలె ఆనందభరితుడై వాలం (తోక) పైకెత్తాడు. అంగదాది వానర వీరులు ఉల్లాసంగా భూమికి దిగి రాముని ముంగిట నిలచారు. 'దృష్టా సీతా' అంటూ వినమ్రుడై రామునికి నమస్కరిస్తూ మారుతి చెప్పాడు. పావని మాటలు రామ లక్ష్మణులను ఆనందవార్థిలో ముంచెత్తినవి.


రావణాంకఃపురే రుద్ధా రాక్షసీభి స్సురక్షితా 

ఏకవేణీధరా దీనా త్వయి చింతా పరాయణా 

అధశ్శయ్యా వివర్ణాఁగీ పద్మినీవ హిమాగమే 

రావణా ద్వినివృత్తార్థా మర్తవ్య కృతనిశ్చయా 

దేవీ కథంచిత్ కాకస్థ త్వన్మనా మార్గితా మయా.


రామచంద్రా! లంకా నగరమంతా గాలించి రావణాంతఃపుర అశోకవనంలో వికారాకారులైన రాక్షసీగణము చుట్టూ ఉండగా, చిక్కి శల్యమైన జానకిని చూచాను. ఏకవేణీ ధారిణి, దీనురాలై నీ పై చిత్త ముంచి - సదా నిన్నే స్మరించుచు, కటిక నేలపై నిద్రిస్తూ వివర్ణమై హేమంతకాల పద్మినిలా రావణుని చూడటం ఇష్టం లేక మరణమేమె శరణ్యమని తలచిన మైధిలిని చూచాను అంటూ మొదలు పెట్టి- ఆమెకు నమ్మకమును కలిగించుటకు తాను చేసిన ప్రయత్నము- తనపై విశ్వాసముంచి ఆమె చెప్పిన కాకాసుర కథ, మనశ్శిలాతిలక వృత్తాంతం చెప్పి ఆనవాలుగా సీతామాత ఇచ్చిన చూడామణిని ఇస్తూ సీతా సందేశం కనులకు కట్టినట్లు వినిపించగా రాముడు చూడామణలో సీతను చూస్తున్న అనుభూతిని పొంది కేసరి తనయుని అభినందిస్తూ -


కృతం హనుమతా కార్యం సుమహత్ భువి దుష్కరం

మనసాపి యదన్యేన న శక్యం ధరణీతలే. 



హనుమంతుడు అమిత శక్తిసంపన్నుడూ, ప్రాజ్ఞుడూ కావున లంకానగరం చూచి తిరిగి రాగలిగాడు. ఇతరులు దీనిని మనసున కూడా ఊహించనైనా ఊహించలేరు. సాగరయానం చేయగలవారు గరుత్మంతుడు, వాయుదేవుడు, వారికి సరిజోడు యీ హనుమంతుడు.

దుష్కర కార్యమునందు నియుక్తుడై యజమాని ఆజ్ఞను సమయానికి తగినరీతిగా నిర్వర్తించి వచ్చు సేవకుడు ఈ ఉత్తముడు. యజమాని కార్యమును చెప్పినంతవరకే సమర్ధతగా నిర్వహించి వచ్చు సేవకుడు మధ్యముడు. స్వామి కార్యమును చెప్పినంత వరకైనా నెరవేర్చజాలని వాడూ అధముడు.

Tuesday, 27 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (63)



వానరులందరూ రామ సందర్శనాభిలాషులై కిష్కింధకు పయనమయ్యారు. కిష్కింధ పాలిమేర చేరబోతుండగా - మధు వనం కనిపించింది. అందలి మధువును ఆస్వాదింపకోరారు వానర వీరులు. అంగదుని అంగీకారంతో మధువనం వానరవీరుల కానంద నాట్యరంగ స్థలమైంది. మధు రసాస్వాదన మత్తులో కొందరు ఆడగా- కొందరేమో పాటల పల్లవి అందుకున్నారు. కొందరైతే విరగబడి నవ్వసాగారు. ఇంకొందరు వదరుబోతులై అర్థమే లేని మాటలతో గారడీ చేయసాగారు. వన సంరక్షకుడూ, సుగ్రీవుని మేనమామా దధిముఖుడూ, అతని పరివారం మధుపాన మత్తులై మతులుపోయి మ్రానులను ముక్కలు చేసే వానరులను చూచి మ్రాన్పడి– అంతలో తేరుకుని కర్తవ్యం గుర్తురాగా అడ్డగించారు. సమధికోత్సాహాలకు మధుమత్తు తోడుకాగా వానరులు వన సంరక్షకులను చిత్రవిచిత్ర భంగిమలతో చితకగొట్టారు. వనపాలకులు పిక్కబలంతో పరుగు లంఘించుకున్నారు. తమ ప్రభువు సుగ్రీవునికీవార్త చెవినవేయగా - దధిముఖునితో సుగ్రీవుడు “మామా! అంగద జాంబ పంత హనుమదాది వానర వీరులు సీతను చూచారు. సందేహం లేదు. ఆ ఆనందంతో అలా చేశారు. వారి దోషం ఏమీ లేదు. వారిని మన్నించు. వారిని వెంటనే సాదరంగా, హృదయ పూర్వకంగా ఆహ్వానించు. రామ లక్ష్మణులు, నేను ఆ వానర వీరులను చూడగోరుతున్నామని చెప్పు" అని పంపి రామునితో


కౌసల్యా సుప్రజా రామ సమాశ్వసిహి సువ్రత 

దృష్టా దేవీ న సందేహెూ న చాన్యేన హనూమతా. 

నహ్యన్సస్సాధనీ హేతుః కర్మణోస్య హనూమతః 

కార్యసిద్ధి ర్మతి శ్చైవ తస్మివ్వానర పుంగవే 

వ్యవసాయం చ వీర్యంచ వ్రతం బాపి ప్రతిష్టితం.


గల వానరులెవ్వరూ లేరు. గడువుదాటి వస్తున్నారంటే- నిస్సందేహంగా సీతామాత జాడ తెలుసుకున్నారన్నమాటే. పైగా మహోత్సాహంగా- మాతాత ముత్తాతలనుండి కంటికి రెప్పలా కాపాడుకునే మధువనం ధ్వంసం చేశారంటే కార్యసాధనా మహోత్సాహమే కారణం.


ఈ కార్యసాఫల్యతలో ప్రధాన పాత్రధారీ, సూత్రధారి హనుమయే, అతనిలో కార్యసిద్ధికి కావలసిన శక్తియుక్తులు, సఫలతా ప్రయత్నము, పరాక్రమము - పైగా శాస్త్ర పాండిత్యావగాహన పుష్కలంగా ఉన్నాయి. హనుమయే సీతను చూచి ఉంటాడు. దృష్టా సీతా న సందేహః 


Monday, 26 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (62)



వానరులంతా చుట్ట చేరి — “తన ప్రయాణం ఎలా సాగింద'ని అడిగినపుడు ఆంజనేయుడు వారికి సముద్రమును లంఘించి నది మొదలు తిరిగి వచ్చునంతదనుక జరిగిన విషయాలను విపులీకరిస్తాడు.


ఇందులో సీత జాడ- తనకు ఎదురైన విఘ్నాలు- అబ్బురపరచే తన కదన పాండితి అంతా వారికి వివరిస్తాడేకాని సీతా సందేశం మాత్రం చెప్పడు. ఎవరితో ఎప్పుడు ఎంతవరకు చెప్పాలో ఆంత వరకే చెప్పాడు. మిగిలిన విషయాలు వీరికి చెప్పుట అనవసరం అని ఊరుకున్నాడు. ఇదీ హనుమంతుని వచో వైభవం.


వార్తాహరులైనవారు - వారిని మనం యీనాడు విలేఖరులు అంటున్నాం. విలేఖరులైనవారు తాము చూచిన, విన్నవానిని పత్రికల కెక్కించేముందు ఎంతవరకు ప్రజలకు తెలియచేయాలో, ఏ విధంగా తెలియచేస్తే ప్రజలు అవగాహన చేసుకుంటారో ఆంత వరకే వ్రాయాలిగాని అనవసరమైన విషయాలను పొందుపరచరాదు, అలాచేస్తే అవగాహనా లోపంవల్ల పరిస్థితులు పెడదారి పట్టే ప్రమాదముంది. వివేకంతో విలేఖరులు వాస్తవ విషయాలను ప్రజలకందించేటప్పుడు ఇలాగ ఉండాలి అని యీ సన్నివేశం తెలియచేస్తుంది.


హనుమద్వాక్యములను విన్న అంగదుడు అమితానందభరితుడై


సత్త్వే వీర్యే న తే కశ్చిత్ నమో వానర విద్యతే 

యదప ప్లుత్య వీ స్తీర్ణం సాగరం పునరాగతః 

జీవితస్య ప్రదాతా నస్త్వమేకో వానరోత్తమ. 

త్వత్ ప్రసాదాత్ సమేష్యామః సిద్ధార్థ రాఘవేణ హ

అహిూ స్వామిని తే భక్తి రహెూ వీర్య మహెూధృతిః. 


"వానరోత్తమా! బల పరాక్రమాలలో నీకు సాటిరాగల వారెవరూ న భూతో న భవిష్యతి. అతి విస్తీర్ణమైన సాగరాన్ని దాటి కార్యసాధకుడవై తిరిగివచ్చిన నీవు మాకు ప్రాణదాతవయ్యా! నీకై ఎంతగ ఎదురు చూచామో!! కాంతిలేని గాజు కళ్ళయిన మా కనులకు వెలుగును నింపినవాడవు నీవే! నీ మూలమున మేము సఫల మనోరధులమయ్యాము. రామ ప్రభుని దర్శన భాగ్యము నీ వలననే మాకు లభించుచున్నది. ఆ స్వామిపై నీకున్న భక్తి శ్రద్ధలు, నీ ధైర్యసాహసాలు- అహెూ! ఆశ్చర్యకారకాలు' అని అభినందించాడు.


రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (61)



ఈ విషయాన్నే ఒక కవి ఇలా చెప్పాడు.


చేయకుఁడ జేసితినని చెప్పునాత

డధముడు, రవంతజేసి కొండంతచేసి

నాడననువాడు గర్వి యెంతయో యొనర్చి 

సుంత జేసితి ననువాడు సుజను డిలను. 


ఆంజనేయుడు - ఉత్తమ వార్తాహరుడు 


తతః కపిం ప్రాప్త మనోరథార్థ 

స్తామక్షతాం రాజసుతాం విదిత్వా 

ప్రత్యక్షత స్తాం పునరేవ దృష్ట్వా 

ప్రతి ప్రయాణాయ మతిం చకార . 

తతస్త శింశుపా మూలే జానకీం పర్యుపస్థితాం 

అభివాద్య అబ్రవీద్దిష్ట్యా పశ్యామి త్వామిహాక్షతాం.

మరల తిరిగి ఒక్కసారి సీతామాతను దర్శించు కోరిక కలిగింది. వెంటనే ఒక్క ఉదుటున అశోకవనం చేరి శింశుపా వృక్ష చ్ఛాయలో నున్న జానకీ మాతకు నమస్కరించి ఆమె ఆశీస్సుల నంది కిష్కింధ కేగనెంచి ప్రస్రవణ పర్వతం పైనుండి ఉత్తర దిక్కుగా పయనించసాగాడు. సమధికోత్సాహంతో ఆంజనేయుడు రామబాణంలా ముందుకు సాగిపోతూ మార్గమధ్యాన మైనాకుని పలకరించి, మహేంద్రగిరి సమీపం చేరబోతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా మేఘధ్వనిని బోలిన ధ్వనిని చేశాడు. ఆ గంభీర ధ్వని విని జాంబవంతుడు “మన మారుతి సీత జాడ తెలుసుకుని వస్తున్నాడు. అందుకే విజయధ్వనిని సంకేతంగా చేశాడు. నిస్సందేహంగా ఆ ధ్వని ఆంజనేయునిదే" అని వానరులకు తెల్పగా- అవధి లేని ఆనంద తరంగాల తేలియాడారు వానరులు. చెట్ల కొమ్మలను ఊపుతూ, పెద్ద ధ్వనిచేస్తూ, కేకలు వేస్తూ, కిలకిలారావాలు చేస్తూ తోకను పైకెత్తి నేలకేసి కొడుతూ, తమ బట్టలను చింపుకుంటూ ఆంజనేయునకు మధుర ఫలాలను అందింప చూస్తున్నారు. ఈ రీతిగా ఆ ప్రాంతమంతా ఎటుచూసినా వానరులు ఆనంద కోలాహలంతో నిండిపోయింది.


ఆంజనేయుడు క్రిందికి దిగబోతూ “దృష్టా సీతౌతి విక్రాంతః సంక్షేపేణ న్యవేదయత్". చూచాను సీతను అశోకవనంలో అంటూ సంక్షేపంగా, సవివరంగా అచటి వార్తలను చెప్పగా “దృష్టేతి వచనం మహార్థం అమృతోపమం" చూచానన్నమాట అచటి వారందరికి అమృతోపమానమైంది. ఆంజనేయుని సాహస కృత్యాలు వారిని అబ్బురపరచినవి. ఆనందసంద్రాన వారు పొంగిపొంగి ఉప్పొంగారు. మారుతిని ఎంతగానో ప్రశంసించారు.


ఇచట హనుమంతుని వచోనైపుణ (మాటల నైపుణ్యం) గమనింపతగినది. ఆంజనేయుడు వారిని వీడి వెళ్ళినది మొదలు, వేయి కనులతో సీతా మాత కనిపించినదన్న వార్త తెచ్చు పవన కుమారుని మాటకై నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్నారు. తనను చూడగనే వారికి పోయిన ప్రాణాలు లేచివచ్చినట్లవుతుంది. అటువంటప్పుడు వారికే అనుమానం రానివిధంగా సంతోషం కలిగించే మాట ముందు చెప్పాలి. అందుకే 'సీతను చూచాను' అనలేదు,' చూచాను సీతను’ అన్నాడు. సీతను అనీ అనకముందే వ్యధాకులిత హృదయులై వానరులు సీతకేదో ప్రమాదం జరిగిందనే ఆవేదనకు లోనవుతారు. వారినలా నొప్పించరాదు. 'చూచాను' అని అంటే 'అమ్మయ్య' సీత కనిపించింది అని ఆనందపడతారు. ఇదీ మాటకారితనం అంటే!


Saturday, 24 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (60)



“నేను సీతామాత క్షేమాన్ని మరచి, అగ్నికి లంకను ఆహుతి చేయటం ఎంత సిగ్గుమాలిన పని. ఆమెకేదైన కీడు జరిగి ఉంటే స్వామికార్యం చెడగొట్టిన నా జన్మ నిరర్థకం. బుద్ధిహీనుడనై నా వానరత్వాన్ని ఋజువు చేశాను” అని వ్యాకులత నొంది మరల వివేకంతో “సీతారాముల ప్రభావం వలన అగ్ని- నన్నే ఏమీచేయ లేదు. అటువంటపుడు పరమ కళ్యాణి, పతివ్రతా శిరోమణి సీతను అగ్ని దహించునా! 


నాగ్ని రగ్నే ప్రవర్తతే 


అగ్నిని అగ్ని దహించదు. ఆమె తేజస్సంపదయే ఆమెను కాపాడును" అని అనుకొనుచుండగా -


దగ్గేయం నగరీ సర్వా సాట్టప్రాకార తోరణాః

జానకీ న చ దగ్ధతి విస్మయోద్భుత ఏవ సః.


ఆకాశవీధిన సంచరించు సిద్ధచారణులు "లంకంతా బూడిద బుగ్గి అయినా జానకిని ఏమాత్రపు అగ్నిశిఖా తాకలేదు. ఎంత ఆశ్చర్యం" అని సంభాషించుకొను మాటలు చెపులబడగా మారుతి అమితానందమానసుడాయెను.


ఈ సన్నివేశమున ఆంజనేయుడు నవనవోన్మేషమైన బుద్ధి విశేషమును కనబరచాడు. నిజం ఎంతో నిష్ఠురమైనది. అందుకే మనకొక సామెత ఉంది. నిజం చెప్పేవాడికి లోకమంతా విరోధులే. ఈ లౌకికపు మాట ఆచరణీయం కాదంటుంది చాణక్య నీతి. “సత్యం వల్లనే భూమి స్థిరంగా ఉంది. సత్యం వల్లనే సూర్యుడు తపిస్తున్నాడు. సత్యం వల్లనే గాలి వీస్తుంది. సత్యం వల్లనే జగత్తంతా నిలిచిఉంది". మరి నిష్ఠుర సత్యం తనకెంతో హాని అని ఆగక ఆంజనేయుడు మంచిని ప్రబోధించినందుకు ఫలితం లాంగూల (తోక) దగ్ధం. ఐనా వెరవక దానితోనే శత్రుమర్దన చేయటం జరిగింది. భయపడి సత్యం దాచరాదు, అసత్యం చెప్పటం పిరికితనానికి చిహ్నం. లోకంలో చాలామంది తాము చేసింది అణువైనా పరమాణువంత గొప్పతనంగా చెప్పుకోవటం ప్రత్యక్షంగా జరుగుతున్నదే కాని అది హర్షణీయం కాదు. తాము ఎంతో చేసి కొద్దిగా చేశానని చెప్పటం, అదీ దైవామగ్రహం. పెద్దల ఆశీర్వాదంగా భావించటం వినయవంతుల లక్షణం. అదే హనుమ లంకా దహన సందర్భంలో తన తండ్రి, శ్రీరామచంద్రుల అనుగ్రహం వల్ల అగ్ని తన వేడిమితో నన్ను బాధించటం లేదు అని చెప్పుట. 

Friday, 23 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (59)



తమ రాజు "నోటినుండి యీ మాట వచ్చినదే తడవుగా రాక్షసులు పాత బట్టలు తెచ్చి నూనెలో ముంచి తోకకు చుట్టి అగ్ని నంటించగా భగ భగ మండే అగ్ని జ్వాలలు వెనువెంటనే విను వీధిని తాకినవి. ఈ వింత చూడ రాక్షస, రాక్షసీ గణము తమ తమ ఇళ్ళనువీడి వీధిలోకి రాసాగింది. మారుతి మండే వాలం ఎత్తి కొందరిని చావమోదాడు. కొందరు రాక్షస స్త్రీలు యీ వార్తను సీత చెవిన వేయగా- దుఃఖించినదై అగ్ని వలన వాయుకుమారునకు ఏ కీడూ జరగరాదని, “అతనికి చల్లదనము కలిగించ" మని అగ్నిదేవుని ప్రార్థించింది. ఆమె అభ్యర్ధనమును మన్నించినట్లుగ హనుమానునికి వెచ్చదనమునకు మారుగా వాలము శీతలముగనే యున్నది.


అటులుండుటకు ఆనందాశ్చర్యాలను పొందిన పావని "అగ్ని సఖుడైన తన తండ్రి వాయువు వలన గాని, ఆ రఘురాముని వలనగాని ఇలా జరిగి ఉంటుందని” భావించి తన దేహాన్ని కుంచింప చేసుకుని, కట్లను తెంచుకుని ఈ రాక్షసులు నన్ను ఏ అగ్నితో మర్యాద చేశారో ఆ అగ్నితోనే వారికి మర్యాద చేస్తాను అని ఉత్సాహంగా ఒక్కసారి కుప్పించి పైకెగరి ఒక భవనం పైనుండి మరో భవంతి పైకి దూకుతుంటే, ఆ భవనాలన్నీ ఫెళ ఫెళార్ఫటులతో మంటలంటుకుని జ్వాలామాలికా తోరణాలయ్యాయి. ప్రహస్తుడు, రశ్మికేతుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మొదలగు రాక్షస వీరుల ఇళ్ళన్నీ క్షణాలమీద అగ్నికి ఆహుతి కాసాగినయ్. ఎటుచూచినా- రాక్షసుల ఆక్రందనలే విషాద గీతాలే. 


"వామ్మో! వీడెవడో!! ఇంద్రుడో! బ్రహ్మో! నిర్జర నాథుడో! "వామ్మో! అయివుంటాడు. చూస్తుండగానే లంకకు ఎంత చేటు వచ్చింది" అని వాపోతూ రాక్షసులు విలపింపసాగారు.


పశ్చాత్తాపం .. ఆత్మ పరీక్ష


మిన్నంటే రాక్షస హాహాకారాల మధ్య లంకంతా అగ్నికి ఆహుతికాగా అంజనీ సుతుడు లాంగూల జ్వాలను సముద్ర జలాల చల్లార్చుకుని వెనుదిరిగి చూడగా ఆగ్నికి ఆహుతి అయిన లంకా నగరం హృదయ విదారకంగా కన్పించింది. అంతలోనే ఆశోకవనాన సీత గుర్తురాగా- “తానెంతో తప్పు చేయటం జరిగింది. ఆవేశంలో ఆశోకవనంలో సీతామాత ఉన్న సంగతి గుర్తించలేక పోతినే! ఎంత దారుణానికి ఒడిగట్టాను. తానింతగా కష్టపడింది ఇందుకోసమేనా!" అని తన పనిని గూర్చి తాను వితర్కించుకుంటూ


ధన్యాస్తే పురుషశ్రేష్ఠాయే బుద్ధ్యా కోపముత్థితం 

నిరుంధంతి మహాత్మానో దీప మగ్ని మివాంభ సా. 

క్రుద్దః పాపం న కుర్యాత్కః క్రుద్దో హన్యాద్గురూనపి 

క్రుద్ధః పరుషయా వాచా నర స్సాధూ నదీక్షి పేత్ . 

వాచ్యా వాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్ 

నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్.


ఆగ్రహావేశాలతో తాను చేసిన పని ఇది. జ్వాజ్యల్యమానంగా వెలుగొందే అగ్నిని నీటితో చల్లార్బినటుల - హృదయ కుహరాల నుండి ఉవ్వెత్తున ఎగిరే ఆగ్రహ జ్వాలలను క్షమాగుణంతో ఆర్పువాడే మహాత్ముడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలలో రెండవది క్రోధం. అంటే కోపం. క్రోధి ఎంతటి దారుణానికయినా వెనుదీయడు. మహా పాప కార్యమైన గురుహత్యకు పాల్పడతాడు. కఠినమైన అతని వాక్కులు గుండెకు మానని గాయాలు. సాధు, సజ్జనులకు కోపగాని మాటలు ఱంపపు కోతలు. మంచి చెడుల విచక్షణ, పాపభీతి- అసలే ఉండదు. నోటికి వచ్చినదెల్ల పలుకుతాడు. చేతకు వచ్చినదెల్ల చేస్తాడు.


Thursday, 22 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (58)



"దురలస్య బలం రాజా" అన్నది సూక్తి. దుర్బలులంటే స్త్రీ, బాల, వృద్ధులు, ఆనాధలూనూ. వీరికి అండదండలందించ వలసిన రాజు నీతిదప్పి పట్టపగలే నట్టివీధిని పట్టబోరే జార చోరులు అన్నటుల ప్రవర్తించరాదు. ఆహంకార, దౌర్జన్యాలకు రాజుగా చోటీయరాదు. చెల్లియుండియు సైరణ సేయగలగాలి. ఎంతటివారైన ధర్మం తప్పిన అధోగతే. ఇవన్నీ హనుమంతుని దౌత్యం మనకు నేర్పుతుంది.


ఆగ్రహ జ్వాల - లంకా దహనం .


వధే తస్య సమాజ్ఞ స్తే రావణే న దురాత్మనా 


హనుమత్సందేశం విన్న రావణుడు సలసల కాగే నీటిపై చల్లని నీరు చల్లిన మంటలెలా పైకి లేస్తాయో- అలా ఒక్క సారి ప్రచండాగ్నివలె మండిపడి 'దూత' అను మాట మరచి, అతనిని పట్టి చంపండని ఆజ్ఞాపించగా


సాధుర్వా యది వాసాధుః పరై రేష సమర్పితః 

బ్రువన్ పరార్థం పరవాన్న దూతో వధ మర్హతి. 


రాక్షసరాజా! దూత మంచివాడుగానీ, చెడ్డవాడుగానీ దూత అయినందువలన చంపరాదు. అతడాడు మాటలు తన ప్రభువువి కాని తనవి కావు. దూత అస్వతంత్రుడు. అందతని దోషమే మున్నది? తాన లోక విరుద్ధమూ రాజనీతి వ్యతిరేకము అగు పని మనము చేయుట పాడి కాదు. మనకప్రియముల నొనరించి నందున బోడితల చేయుటో- కొరడాతో కొట్టుటో- అంగహీనుని చేయుటో వంటి శిక్షలు కలవు. వానిని చేయవచ్చుననగా రావ ణుడు


"కప్లీనాం కిల లాంగూలం ఇష్టం భవతి భూషణం

తదన్య దీప్యతా శీఘ్రం తేన దగ్గేన గచ్ఛతు". 


కోతులకు తోక అలంకారం ఆ తోకను వెంటనే తగల బెట్టుడి. నలుదిక్కుల తిప్పి పరాభవించి పంపండి. తోక లేని ఇతడు తన జాతివారిలో పరిహాసపాత్రుడు అవుతాడు".  


Wednesday, 21 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (57)



ఇక దేవదానవుల వలన అపజయ మెరుగని వరం పొందిన నీవు నర, వానరజాతివారైన రామ లక్ష్మణుల చేతిలో చావు కోరి తెచ్చుకోకు. వానర, భల్లూక వీరులు వందల, వేల ఏనుగుల బలం కలవారు, నీ సేనాబలం వారి ఎదుట నిలబడలేదు. ఇంతెందుకు నా ప్రభువాజ్ఞ లేదుగాని, ఉన్నచో నేనొక్కడనే చాలు, నిన్ను, నీ రాజ్యాన్నీ సర్వనాశనం చేయటానికి.


కాన ఓ రాజా! కడసారి చెప్పు నా హితోపదేశాన్ని ఆచరించు. నీకై అందరి ప్రాణాలను ఫణంగా పెట్టకు. లంకకు చేటు తీసుకు రావద్దు. రాము నెదిరించ దేవ, దానవు లెవరూ సమర్థులు కారు. రాముడు - ఎన్ని తప్పులు చేసినా శరణన్నవానిని కాపాడు త్రాణ పరాయణుడు. పరమ దయాళువు. ఆ మహానుభావుని శరణు కోరు. జన క్షయం కోరకు రావణా!


వీర వరేణ్యుడైన రఘువీరున కెగ్గొనరించి దేవ దేవాదుల లోన నెవ్వరును బ్రాణము తోడ సుఖంబు నొందగా నేరరు గాన నా పలుకు నిక్కముగా మదినమ్మి సీత నా ధారుణి నేత కిచ్చి పుర దార సుతాదులు గాచి కొమ్మొగిన్.


తలలు త్తరించే తలారులను కూడ తలలు వంచునట్లు చేసేది వాక్కు. మాట నేర్పుతో- కోపాగ్ని జ్వాలలు కక్కేవాడు కూడ నిరుత్తరుడై చేష్టలుడిగి వినునట్లు చేయగలదీ, తల ఊపించేదీ మాట. ఈ సన్నివేశంలో ఆంజనేయుడు మహోన్నత రాజనీతిజ్ఞుడుగ, వాక్య విశారదుడుగా కనిపిస్తాడు. సర్వకాలానుగుణమైన న్యాయ శాస్త్రాన్ని రాజనీతివేత్తలు “ఔరా” అనునటుల వినిపించినాడు. రాక్షసరాజ సభలో ఉత్తమ రాయబారిగ గోచరిస్తాడు. ప్రదర్శించిన ధైర్య సాహసాలు- బంధీయై కూడ నిర్భీకుడై తొణుకు బెణుకు లేకుండ తాను చెప్పదలచుకున్న నీతి వాక్యాలను నిర్మొగమాటంగా వినిపించుట మరొకరికి సాధ్యము కానిపని. ప్రసంగ నైపుణి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, సంఘ నేతలు- మొదలగువారు అవశ్యం నేర్వవలసినవి.


కార్యసాధకుడు- శత్రు బలగాలను పరిగణనలోనికి తీసుకొని ఏకరీతిగా వారిని భయకంపితులను చేయవలెనో ఆ రీతిగా చేయుట, దోషిగా భావించినపుడు - ఆత్మరక్షణకలా చేయవలసి వచ్చిందని తన నిర్దోషిత్వమును నిరూపించుకొనుట - రాజుగా ఉండవలసిన విధానం, రాజ ధర్మాన్ని మరచిన కలుగు కష్ట నష్టాలు- వివరించిన రీతి అందరూ నేర్చుకోవలసినది.


Tuesday, 20 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (56)



అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్తస్తవాలయం 

రాక్షసేంద్ర హరీశస్త్వాం భ్రాతా కుశలమబ్రవీత్.


ఓ రాజా! నేను వాలి సోదరుడగు సుగ్రీవ సచివుడను. నీ సోదరుడైన సుగ్రీవుడు మొదటగా నీ కుశలం అడగనున్నాడు. జనకుని మాటను జవదాటక రాముడు సీతా లక్ష్మణ సహితుడై విపిన భూములకేతెంచి- దండాకాటవీన నపహృతయైన జానకి నన్వేషించుచు ఋష్యమూకము చేరినాడు. రామ, సుగ్రీవులు మిత్రులుగ పరస్పరం ప్రతిజ్ఞలు చేసుకున్నారు. వాలిని నీవెరుగుదువు గదా! ఒక్క బాణముతో వాలిని వధించి సుగ్రీవుని కిష్కింధకభిషిక్తునిగ చేసినాడు. సుగ్రీవుడు సర్వ దిశలకూ సీతాన్వేషణకై వానర వీరుల నంపినాడు. నేనిచటి కామె నన్వేషింప వచ్చి


"దృష్టా హీయం మయా దేవీ లబ్ధం యదిహ దుర్లభం 

ఉత్తరం కర్మ యచ్ఛేషం నిమిత్తం తత్ర రాఘవః.


ఆశోకవనాన జనక నందినిని చూచాను. ఇక మిగిలిన కార్యమును నిర్వర్తించుటకు అచట రఘురాముడున్నాడు. మున్ముందు జరుగబోవు తీవ్ర పరిణామం నీవు గమనించినట్లు లేదు. నీ హితము కోరి చెప్పు నా హితవు నాలకింపుము. 


జన స్థాన వధం బుద్ధ్వా బుద్ధ్వా వాలి వదం తథా


రామసుగ్రీవ సఖ్యంచ బుధ్యస్వ హితమాత్మనః


జనస్థానమున నీ అనుంగు సేవకులు ఖర, దూషణాదులను మన్ను కరపించినదీ- నిన్ను చంకన ఇరికించి సప్త సముద్రాల ముంచి ఊపిరితో వదలిన బల పరాక్రమశాలి వాలిని ఒకే ఒక్క బాణంతో నేలకూల్చిందీ - రాముడు. ఆ రామ, సుగ్రీవ సఖ్యం నీకు ప్రాణాంతకం అన్నది గుర్తుంచుకో. రాజా! నీవు తెలియనివాడవనుకోను. తపస్సంపన్నుడవు. సర్వశాస్త్ర విశారదుడవు. మీదు మిక్కిలి ధర్మము నెరిగినవాడవు. బుద్ధిమంతుడు క్షణక్షణం ప్రమాదాల నిలయం అధర్మ కార్యం అని - వాని జోలికి పోడు. నీ ఈశ్వర భక్తి- తపశ్శక్తి అధర్మము నుండి కాపాడలేవు. దేని ఫలితము దానిదే. ఇప్పటివరకు ధర్మఫలితము ననుభవించావు. ఇక అధర్మ ఫలితాన్ని రుచి చూడబోతున్నావు.

నీ వశమందున్న సీతను సామాన్య స్త్రీగా భావింపకుము. ఆత్మరక్షణ సమర్ధురాలయ్యు- అది తన నాథుని కపయశమని ఆగింది. "గృహ్యయాం నాభి జానాసి పంచాస్యమివ పన్నగీం." ఆమె నీ ఇంట నున్న పంచాస్య పన్నగమని తెలిసికో. 

విష సం సృష్ట మత్యర్ధం భుక్తమన్న మివౌజసా. 

అవివేకియైనా విషం తినాలనుకుంటాడు! ఆమె కాళరాత్రి. లంకా నాశనకారిగా గ్రహించు.

కాళరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశినీం 
తదలం కాలపాశేన సీతా విగ్రహ రూపిణా.

Monday, 19 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (56)



సామాన్యంగా సమాజంలో విరోధిలోని లోపాలను ఎత్తి చూపి – అతనిని ద్వేషించేటట్లు చేయటానికే పాటుపడతారు కాని మంచినిమాత్రం మసిపూసి మారేడుకాయగా చేయచూస్తారు. అది పొరపాటు. మన కయిష్టునిలోని సద్గుణాలను, సదాశయాలను గౌరవించటం ధర్మం, దుర్గుణాలను ఎలాగూ విమర్శిస్తాం కదా. ఈ విషయంలో తరతమ భేదం చూపరాదన్నమాట. అలాగే ఆకారాన్ని చూచి అతని స్వభావ గుణ సంపత్తిని బేరీజు వేయరాదు. ఆకారమున్న- గుణముండబోదు, గుణమున్న ఆకారము లేకపోవచ్చు. ప్రధానం ఆకారం కాదు గుణం, ఆత్మ నముపమానంగా చేసుకుని నిర్ణయించాలి. ఇదే భావాన్ని తెలిపే ఒక చాటువు ఇలా ఉంది.


విజ్ఞుడగువాడు మెప్పొందు వికృతుడైన 

సుందరుండగు మూర్ఖుని చూడరెవరు 

వాసనలు గల్గు కురు వేరు వాసికెక్కు 

అందమైనట్టి మోదుగ నడుగరెవరు.


కోపావేశంతో కనుల నిప్పులురాల రావణుడు మంత్రిసత్తముడైన ప్రహస్తునితో “దురాత్మా! పృచ్ఛ్యతాంమేష కుతః కిం వాస్య కారణం, వనభంగే చ కోస్యార్ధో రాక్షసీనాం చ తర్జనే". ఈ దురాత్ముడు మన వీటికేల ఏతెంచెను?” వన భంగ మొనర్చనేల? రాక్షసుల నేమి కతంబున హింసించెనో అడుగు" మని కాలయుక్తంగా అర్ధవంతంగా పలికిన పలుకు లాలకించి హరిసత్తముడు లంకాధీశునకు ---  

హనుమంతుని దౌత్యం


అసత్యం పిరికివాని లక్షణం:


రాక్షసేంద్రా ! మీరనుకుంటున్నట్లు నన్ను ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు- పంపలేదు. విష్ణుని దూతనూ కాను. ఉన్నమి తౌజసుడగు రాఘవుని దూతగా తెలిసికొనుము. నేను వేషధారిని కాను, వానరుడనే. ఒక రాచకార్య నిర్వహణార్థం ఇచటికి వచ్చాను, లంకేశ్వరుని చూడ- వన భంగం కావించాను. ఉన్మత్తుడను కాను, ఆత్మరక్షణకై ఎదిరించిన రాక్షసుల వధించాను. దేవ దానవులెవరూ నన్ను అస్త్రాలతో బంధించజాలరు. పితామహుడట్టి వరాన్ని ప్రసాదించినాడు. రాజ దర్శన కాంక్షినై నేనే బ్రహ్మాస్త్రానికి పట్టుబడ్డాను, మూర్ఖులు రాక్షసులు ఇతర పాశాలతో బంధించగా- ఆ అస్త్రబంధనం నుండి కూడా విముక్తుడనైనాను. 'మమ పథ్యం ఇదం వచనం చాపి శ్రూయతాం' పథ్యములైన నా మాటలను సావధానంగా వినవలసినది.



Sunday, 18 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (54)



విజ్ఞుడగువాడు మెప్పొందు వికృతుడైన


ఇంద్రజిత్తు కపివరుని రావణ సభముందు నిలిపాడు బంగరు గద్దియపై అసమాన తేజస్సంపదతో వెలుగొందే రావణుని చూచి 


అహెూ రూప మహో ధైర్యం అహో సత్త్వ మహెూధృతిః 

అహెూ రాక్షస రాజస్య సర్వలక్షణ యు క్తతా.

స్యాదయం సుర లోకస్య స శక్రస్యాపి రక్షితా 

అయం హ్యుత్సహతే శ్రద్ధః కర్తుమేకార్ణవం జగత్.


ఆహెూ! ఏమి రూపం! ఏమి ధైర్యం ! ఏమి సత్త్వం! ఏమి శాంతం! మూర్తీభవించిన సర్వ శుభ లక్షణ లక్షతుడై విలసిల్లే యీ రాక్షస రాజు సురలోకమును సైతము పాలింప శక్తి సంపన్నుడు. ఇతడే అలిగిననాడు లోకాలను, సముద్రమున ముంచెత్తకపోవునా! అటువంటివానిని పరదారా వ్యామోహం ఎంతగ పెడదారి పట్టించినదో గదా!


అలాగే లంకేశ్వరుడును మారుతిని చూచి - 


శంకా హృతాత్మా దధ్యౌ స కపీంద్రం తేజసా వృతం 

కిమేష భగవాన్నందీ భవేత్పాక్షాదిహా గతః  

యేన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా 

సోయం వానరమూర్తి స్యాత్ కిం స్విద్బాణోవ్ వా సురః 


వీడు ఎచటినుండి ఇటకు వచ్చినాడు ? ఏ పనికై వచ్చి యుండును? వచ్చినవాడు వనభంగము చేయనేల? రాక్షసులను నిర్జింపనేల? అలనాడు కైలాసగిరిని కదలింప నందీశ్వరుడు నాపై ఆగ్రహమును చూపెను కదా! అతడే యీ కపి రూపాన వచ్చి యుండునా? ఏమీ తేజము? కానిచో బాణాసురుడు యీ ఆకృతిన రాలేదు కదా! అని శంకా హృతాత్ముడాయెను.


ఈ సన్నివేశంలో ఆంజనేయుడు నిర్వహించిన పాత్ర అసాధారణమైనది. కార్యసాధకుడు సమయస్ఫూర్తితో బాగుగా ఆలోచించి ఆత్మవిశ్వాసంతో సమయోచిత నిర్ణయం చేయగల ధైర్యస్థైర్యాలు, బుద్ధి విశేషం- తరతరాలవారికి తరగనిగనిలా అందించిన ఆదర్శవంతుడు.

Saturday, 17 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (53)



ఈ రీతిగా ఆంజనేయుడు చిత్ర విచిత్ర గతులతో చెట్లు పెకలించి, విసిరివైచి, గోళ్ళతో చీల్చి, పిడికిళ్ళతో పొడిచి, కాళ్ళతో మర్దించి, బిగ్గరగా అరచి వీర విహారం చేస్తూ తనపై దాడిచేసిన శత్రువులను మట్టుబెడుతున్నాడు.


రావణుని మదినిండా కలవరం, కలకలం. తాను పంపిన ప్రతి యోథుడూ మరలి వచ్చుటన్నది లేదు. బ్రతికి బట్టకట్టగలి గినవాడు లేడు. తనకూ, తనవారికి రణరంగమంటే కందుక క్రీడ. ఓటమి యెరుగని యోధాను యోధులు ఒక్క కపికి ఆహుతి అయ్యారు. ఇపుడేం చేయాలి అని ఆలోచిస్తుండగా ఆ వానరుని బంధించగలవాడు తన పెద్ద కొడుకు ఇంద్రజిత్తే ననిపించింది. ఇంద్రజిత్తు మహావీరుడు. సుర నాయకుని (ఇంద్రుని), సకల దేవతలను గడగడ లాడించినవాడు. ఎందరో శత్రువులను మట్టి కరపించిన ఇంద్రజిత్తుని రావించి, "కుమారా! ఈ కోతి సామాన్యమైనది కాదు. ఇతని ముందు మన సేనలు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. వజ్రాయుధం సైతం పనిచేయుట లేదు. గతంలో నేనెందరినో హరి వీరులను చూచాను. జాంబవంతుడు, వాలి సుగ్రీవులు, మైంద, ద్వివిదుడూ - మొదలైనవారి బల ధైర్య, సాహసాలను నేనెరుగుదును కాని వారెవ్వరిలో లేని యుద్ధ గతి, పరాక్రమోత్సాహాలూ, రూపగుణ విశేషాలూ యీ వానరంలో కనిపిస్తున్నాయి. చూడగా ఒక పెనుభూతం యీతని రూపంలో వచ్చినట్లు తోస్తున్నది. అతనిని తేలికగా తీసుకోరాదు. అతనిపట్ల ఏమరు పాటు తగదు. బాహాబాహీ పోరు పనికిరాదు. బ్రహ్మాస్త్రం పొందిన నీవు తప్ప మరెవరూ అతని ధాటికి తట్టుకోలేరు. అతని ప్రతి కదలికా గమనిస్తూ- పట్టి బంధించు. విజయుడవై తిరిగి రా” అని హనుమంతునిపై యుద్ధానికి పంపాడు. 


ఇంద్రజిత్తు అత్యుత్సాహముతో పవన కుమారుని తాకెను. ఇరువురకు పోరు ఘోరముగ సాగినది. ఇంద్రజిత్తు క్షాత్ర విద్యలు, మాయా విద్యలు మాయలు నేర్చిన ఆంజనేయుని ముందు నిర్వీర్యము లయినవి. మహావీరుడైన మారుతి రణపాండితికి మేఘ నాథుడు ఆశ్చర్యపడి, మిగిలిన బ్రహ్మాస్త్రమును ప్రయోగించినాడు. బ్రహ్మ వరం పొందిన ఆంజనేయుని బ్రహ్మాస్త్రం బంధించలేదు. కాని రావణుని చూడతలచి తానే ఇచ్చాపూర్వకంగా బంధీ అయ్యాడు.


Friday, 16 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (52)



"తలచినదే తడవుగా కర్తవ్యోన్ముఖుడై మనోహర సుందర నందన వనమును బోలిన అశోక వనమును కొన్ని చెట్లు పెకలించి, మరికొన్నింటి కొమ్మలు విరచి కళకళలాడే ఆ వనాన్ని చిందరవందర చేశాడు, ఎదిరించిన వనపాలకులను మట్టుబెట్టాడు. ఈ వార్త రావణునికి చేరింది. ఆశ్చర్యపడి తనతో సమాన శాలురయిన కింకర గణాన్ని ఆ వానరుని దండించమని పంపాడు. మారుతి వారిని యమపురికంపాడు. మహావీరుడు జంబుమాలి, మంత్రుల పుత్రులు, సేనా నాయకులు దుర్జర, విరూపాక్ష, యూపాక్ష, భాసకర్ణాదులు యమాలయానికి అతిథులైనారు. అక్షకుమారుడును సమవర్తి సన్నిధి చేరాడు. రావణ ప్రేరితులై ఒకరి తరువాత ఒకరు వచ్చుటేకాని మరలిపోయినది లేదు. తోరణ స్తంభము నెక్కి సింహనాదం చేస్తూనే ఉన్నాడు వీర సంహారానంతరం, ఆ నాదం చెవిబడగనే శతృవుల గుండియలదరి ఆగి పోవుచున్నవి. ఒకరితో యుద్ధము చేసిన రీతి మరొకరితో చేయుట లేదు. ఆ అరుపులు, చరుపులు, వివిధ యుద్ధ భంగిమలు- ఈనాటి కరాటేలాంటి విద్యలను తలపించుచున్నవి. అంటే యీవిద్య ఆనాడు ఆంజనేయుడు చూపినదేనేమో!! అరుపులతో అదరగొట్టటం- చరుపులతో చావుదెబ్బ తీయటం -


తోరణ స్తంభమెక్కి సింహనాదం చేస్తూ 


జయత్యుతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః, 

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః  

దాసోహం కోనలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః 

హనుమాన్ శతృసైన్యానాం నిహంతా మారుతాత్మజః 

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతి బలం భవేత్ 

శిలాభిస్తు ప్రహరతః పాద పైశ్చ సహస్రశః 

అర్థయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం 

సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వ రక్షసాం.


(ఇది రామాయణలోని జయమంత్రం)


మహా బలశాలురైన రామ లక్ష్మణులకు జయమగు గాక! మా సుగ్రీవ మహారాజునకు జయము !!


ఎంత క్లిష్ట కార్యాన్నయినా అవలీలగా అనాయాసంగా చేయగల నేను వాయు కుమారుడను, రామదాసుడను, శత్రు మర్దనుడను, హనుమంతుడను. 


రాళ్ళు, చెట్లు పెకలించి విసరివేస్తూ పోరు సాగిస్తుంటే.. వేయిమంది రావణులైనా నా ఎదుట నిలబడలేరు.


లంకను అవలేశం కూడా లేకుండా చేయగలను. జానకికి అభివాదం చేసి - రాక్షస గణం బెంబేలెత్తి బిత్తరపోయి చూస్తుంటే - సంతోషాంతరంగుడనై తిరిగి వెళతాను.


ఒకవైపు అరివీర భయంకర స్వరూపం. మరోవైపు విధేయతలు. మారుతి యీ ప్రవృత్తి మహా మహిమాన్వితమైనది.


ఓ రాక్షసులారా! చూస్తున్నారుగా నన్ను. ఈపాటికి నా శక్తి ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. నాలాంటివారు మా రాజు కొలువులో వేలకొలది ఉన్నారు. కొందరు పది ఏనుగుల బలం కలవారైతే ఇంకొందరు వంద ఏనుగుల బలం కలవారు, ఇంకొందరో! వేయి ఏనుగుల బలం కలవారు. వారందరూ తరలి వచ్చారో. మీరూ, మీ లంకా నామ రూపాలు లేకుండా పోతాయి. ఇది నిజం అంటూ ప్రాకార స్తంభం పెకల్చి విసిరివేశాడు. రాక్షస వీరులు ప్రాణభీతితో పరుగెత్తసాగారు.

Thursday, 15 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (51)

ఆంజనేయుడు - ఉత్తమ దూత


దూతగ వచ్చినవాడు పంపినవాని సందేశాన్ని పూసగుచ్చినట్లు చెప్పవలె గాని తన అభిప్రాయాలను వానికి జత చేయరాదు. సహజంగా "అదిగో పులి అంటే ఇదిగో తోక" అన్నట్లుగ మాట్లాడే మనస్తత్వం కలవారే ఎక్కువ. ఆ విధానం పనికిరానిది. వాస్తవిక దృశ్పథం ఎంతో అవసరం మాట విలువ తెలిసి మసలుకోవాలి. మంచికి ఉపయోగించాలి. ఆది పుణ్య ఫలితాన్నిస్తుంది.


ఆ మాట నేర్పు కలవాడు కాబట్టే వాయుసూనుడు మొదటి చూపులో రామునికి ఆత్మీయుడయ్యాడు. అలాగే ఇచట సీతా మాతయు ఆత్మబంధువు వలె చూచింది మారుతిని. వీడలేక, వీడలేక గుండె దిటవు చేసుకుని వీడ్కోలు చెప్పింది. సాగర లంఘనానికి సిద్ధమయ్యాడు. అంతలోనే తన కార్యం అసంపూర్తిగనున్నట్లు తోచింది. తాను వచ్చుటలోని ప్రధానాంశం చూచుట, సంభాషించుట జరిగినది. ఇక యీ లంకను గురించిన విశేషాలు తెలుసుకోవాలి? సముద్రతీరాన గల దీని ఉనికి తెలిసికోనిదే వెళ్ళుట సమంజసం కాబోదు.


రాక్షసులు సామ, దాన, భేద, దండోపాయాలలో మొదటి మూడింటికి లోబడరు. తామసులైన యీ రాక్షసులపట్ల సామం పనికిరాదు, సకల సంపదలతో తులతూగే వీరియెడ దానం పనికి రాదు, బలపరాక్రమోపేతులగుట భేదం పనికిరాదు. ఇక వీరియెడ దండోపాయమే తగినది. పరాక్రమ ప్రకటనమే సరైనదని నాకు తోచుచున్నది. పూర్వకార్య విరోధం లేకుండగ అనేక కార్యాలను సాధించువాడే- కార్యసాధకుడు, సమరుడనిపించుకొనును, శత్రుపుల బలాబలాలను బేరీజు వేసుకొనుటకు యీ అవకాశం ఉపయోగించుకోవాలి. వానరులు, రాక్షసుల యుద్ధ విధానంలో గల తేడాలు తెలుసుకొనుట మంచిది. అంతేకాక నా బాహుబలంతో శత్రు సేనను కొంతవరకు రూపుమాపిన మిగిలినవారిని సంహరించుట సుగ్రీవాంగద రామ లక్ష్మణులకు తేలికైన పని. రావణునికి తమ శక్తి సామర్థ్యములను తెలియచేసినట్లయి- కనువిప్పు కలిగించ గలదేమో! దూతయినవాడు అన్ని కోణాలనుండి తన ప్రభువు కార్యాన్ని సాధించగలగాలి. తానే ముందుగా శతృవును కవ్వించి, కదనానికి రప్పించి కాలుని పన్నిధానానికి పంపాలి. అందుకు తగిన విధానం రావణునికి అత్యంత ప్రీతిపాత్రమైన అశోక వన విధ్వంసనం. 

Wednesday, 14 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (50)



మన నీతికారులు కూడా -


చేతనగువాడు కార్యము 

కై తగ్గును వంగు గాక యల్పుండగునా|

యేతము చడి తా వంగును

బాతాళము నీరు దెచ్చి బయలం జల్లున్ 


"ధనమును విద్యయు వంశం 

బును దుర్మదులకు మదంబు బొనరించును స 

జ్జను లైనవారి కడకువ

యును వినయము నివియ తెచ్చు" నన్నటుల మారుతి యీ సందర్భమున చూపిన వినయం సమాజంలో సర్వులూ అల వరచుకోవలసిన విశిష్ట లక్షణం.


సీతామాతకు ధైర్యం చెప్పి- ఆనవాలుగా ఇచ్చిన శిరోరత్నాన్ని తీసుకుని- ఆనాడు అరణ్యవాసంలో జరిగిన కాకాసుర వృత్తాంతంతోపాటు ఆమె సందేశాన్ని విని తిరుగుముఖం బోతున్న పావనితో "మారుతీ! నీకు మరోసారి నా దీనావస్థను చెబుతున్నాను విను. కార్యసాధన జరిగే తీరున రామ ప్రభువును ప్రోత్సహించు. నీవు చక్కగా యోజించి ప్రయత్నిస్తే నా కష్ట పరంపరలు తొలగుతాయి!" అనగనే పవన తనయుడు 'తధేతి' అన్నాడు. అంతలోనే కన్నీరు విడుస్తూ సీత “హనుమా! అందరినీ పేరుపేరునా అడిగానని చెప్పు. నా బొందిలో ప్రాణాలుడుగక పూర్వమే రాముడు నన్ను చూచేటట్లు చేయవలసినది. నీవు పుణ్యవంతుడవు. నీ మాటలు విని రామప్రభువు స్పందించి వచ్చి నన్ను తీసుకు వెళ్ళునట్లు చేయి. నా మాటలనెలా చెబితే నా నాథుడు ఉత్తేజితుడై ఎంత త్వరగా తీసుకు వెళ్ళగలడో- అలా చెప్పు అంటుంది.


అంటే మాట విలువ ఆమోఘం అన్నమాట. మాటకున్న శక్తిని గూర్చి మహాభారతం ఇలా అంటుంది.


అరిది విలుకాని యుజ్వల శరమొక్కని నొంచు 

దప్పి చనినం జను, నేర్పరియైన వాని నీతిస్ఫురణము, పగరాజు నతని భూమిం జెరచుస్.


విలుకాని బాణం గురితప్పనిచో ఒక్కని నొంచును. గురి తప్పిన వ్యర్థమగును కాని నీతిమంతుని మాట గురితప్పుట అన్నదే లేదు, మాట అంత శక్తివంతమైనదన్నమాట. ప్రమోదం, ప్రళయం రెంటిని కలిగించగలదు.


Tuesday, 13 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (49)



మరల జానకి సంశయగ్రస్తురాలైనది, “వానర సేనలో నీవలె బలశాలు లెంతమంది ఉండగలరు? వేళ్ళమీద లెక్కింపదగిన వారు ఒకరో ఇద్దరో ఉండియుందురు. అటువంటప్పుడు యీ రాక్షస సేనావాహినిని జయించుట రామ లక్ష్మణులకు సాధ్య మగునా! అసలు లంకకు చేరగలరా!" అని చింతించి వగచే ఆమె మనోగతాన్ని గమనించి పావని -


"అమ్మా! రామ లక్ష్మణులను నా వీపుపై నెక్కించుకు రాగలను. ఇక వానర, భల్లూక వీరుల సాటిరాగల వారెవరూ యీ లంకలో లేరు. వానర సేనలో నాతో సమానులూ, నన్ను మించిన పరాక్రమశాలురే అందరూ. నాకన్న తక్కువవారు లేనేలేరు. నా వంటివారే యీ సముద్రాన్ని దాటిరాగా, నాకంటె బలశాలుర గురించి ఇక వేరుగ చెప్పవలెనా! సామాన్యంగా దూత కృత్యానికి ఆల్పులను మాత్రమే పంపుతారు. బలశాలురను పంపరు. కనుక శంకారహితవు కమ్ము. స్వస్థత పొందుము. “క్షిణ దుఃఖ ఫలా హ్యసి" “త్వరలోనే దుఃఖ ముపశమించును గాక!"


హనుమంతుని ధైర్య వచనాల నాలకించి జానకి సంతోషంగా "వాయునందనా! నాకు ఆనందం కలిగే మాటలు వినిపించినావు. నిన్ను చూచుటతోనే గ్రీష్మ తాపానికి వాడిపోయి వాన జల్లుకు కలకలలాడే పంట చేనులా- ఆనందంతో నా మనస్సునకు కొంత ఊరట కలిగింది" అన్నది.


ఈ సన్నివేశం ఆలోచనాత్మకంగా చూడవలసినది. జానకి అనుమానాలు, వానిని మారుతి తీర్పిన విధానాలు నేటి సమాజానికి క్షణక్షణావసరాలు.


నిర్వేదంలో, నిస్సహాయతలో ఉన్నవారినెలా ఓదార్చాలి. వారితో మాట్లాడే విధానం గాయపడినవారి గాయాన్ని మాన్చే సంభాషణా రీతీ, మాటల సందర్భంలో తనకేదయినా బాధాకర విషయం ఎదుటివారినుండి ఎదురైతే- వారు నొచ్చుకోనిరీతిగా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం- కార్యసాధనకు అవసరమనుకుంటే సంశయగ్రస్తమయినవారికి ధైర్యోత్సాహాలు కలగడం కోసం వినయంగా ప్రవర్తించడం- ఎదుటివారి మాటలలోని మంచితనాన్ని గౌరవించడం- కార్య సాఫల్యత కోసం 'తనను మించినవారు లేరని తెలిసినా- పౌరుష ప్రదర్శన కాక వినయ గుణాన్ని నయంగా చూపుట, అణకువతో ఆత్మాభిమానం కలిగి ఉంటూనే తానాశించిన ప్రయోజనాన్ని పొందటానికి తనను తాను తక్కువ చేసుకున్నా నష్టం లేదన్నమాట. అంతేకాని ఎదిరిమాటలు నెదిరించి నేనంత గొప్పవాణ్ణి, ఇంత గొప్పవాణ్ణి, సరిలేరు నాకెవ్వరూ అని మొదలిడితే కార్యభంగం అని తెలిసి ప్రవర్తించాలి. ఇన్ని విధాల ఆలోచనలతో సమయ సందర్భము లెరిగి నడచుకోవాలి సుమా అన్న సందేశాన్ని అందించాడు మారుతాత్మజుడు.

Monday, 12 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (48)



సీతమ్మ మాటలు తనకు తక్కువతనాన్ని కలిగిస్తున్నాయి. ఇది ఒక అవమానం, అవమానకరం తన శక్తి నామెతు చూపదలచి “ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎత్తుకు ఎదుగుతూ - దివ్యకాంతుల నీనుచూ- మేరు పర్వతమంత ఎత్తు అయ్యాడు. వజ్రదంష్ట్రలు- వజ్ర నఖాలు- వజ్ర దేహం- కనులు మిరుమిట్లు గొలుపు భీకర రూపంతో తనముందు నిలబడిన మారుతిని చూచి- ఆష్టలక్ష్మీయుతునిగా భావించి


తవ సత్త్వం బలం, చైవ విజానామి మహా కపే

వాయోరిన గతించైవ తేజశ్చాగ్నేరివాద్భుతం.


హనుమా! నీ బలమూ, ధైర్యమూ ఎలాంటివో తెలుసుకున్నాను. గమనంలో వాయు సమానుడవు. తేజస్సులో అగ్నిసముడవు. సందేహించనక్కరలేదు. కానీ నీవు నన్ను తీసుకువెళ్తుంటే - రాక్షస సేన వెంబడించిన వారినెలా ఎదుర్కొనగలవు. అందులో కొందరు నన్ను బంధించిన ఇక నన్ను వధించుట తధ్యం. నీవు నన్ను తీసుకు వెళుతుంటే దారిలో జారి పడ్డాననుకో- భీకర మకరాలయం లోని భయంకర జలచరాలు నన్ను కబళించును. దీనితో రామకార్యం నెరవేరదు మరొక్కమాట. "న స్పృశామి శరీరం తు పుంసో వానర పుంగవ" నేను పర పురుషుని తాకను. మరి రావణుడు స్పృశించలేదా అంటావేమో! అపుడు నేను అసహాయురాలను, ధీనురాలను. బలాత్కరించగా నేనేమి చేయగలను ఆబలను. చాటుగా, పిరికితనంగా అలా తెచ్చాడు. అదేవిధంగా చాటుగా పారిపోవటం నాకూ, నీకూ, రామునకూ గౌరవప్రదం కాదు. బలపరాక్రమోపేతుడై రాముడు రావణుని వధించి నన్ను తీసుకుపోవుట న్యాయమార్గం.


తల్లీ ! నీ మాటలు పతివ్రతా లక్షణాలకూ- స్త్రీ స్వభావాను గుణంగా ఉన్నాయి. రాముని వినా పర పురుషుని తాకనని పల్కుట నీకు చెల్లినదిగాని మరెవరు ఇట్టి మాటలు పలుకగలరు? స్వయముగా రాముడేతెంచి క్రూర రక్కసుల పీచమణచి నిన్ను తీసుకు వెళ్ళుటయే ధర్మ సమ్మతం. "నేను వాయువేగ, మనో వేగాలతో వెళ్ళి రామ లక్ష్మణుల ముందు వాలతాను "అని హనుమంతుడు పల్కగా


Sunday, 11 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (47)



కార్యసాధనకై తగ్గిన ఆల్పుఁడగునా?


శ్రవణ సుభగాలైన ఆ మాటలకు ఆనందాశ్చర్యాలతో తన వృత్తాంతం వివరించి జానకి - మీకూ రామలక్ష్మణులకు పరిచయం ఎట్లు కలిగిందన్న అనుమానం వెలిబుచ్చగా .. ఆంజనేయుడు ఆమె సందేహాలను తీరుస్తూ - "అమ్మా! నేను రామదూతినై నీ దగ్గరకు వచ్చాను." ఉన్నాడు లెప్స రాఘవుడు. లక్ష్మణుడును కుశలమే. 'త్వాంచ కుశల మబ్రవీత్' నీ క్షేమం అడగమన్నారు. నాపై నీకు నమ్మకము కలుగుటకై - దేవీ! రామనామాంకిత అంగుళీయకాన్ని ఇచ్చారు. ఇదిగో చూడు తల్లీ! అని ఉంగరం యీగా తీసుకుని 'జానకీ ముదితా భవత్' సంతోషించింది. విశ్వాసం కలిగింది. "హనుమా! నాకున్న గడువు ఇక రెండు మాసములే" అని గద్గదకంఠయై పలికింది.


అమ్మా! నిన్నీ స్థితిలో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతున్నది. సందేహించకు తల్లీ!! నా వీపుపై కూర్చుంటే నిన్ను క్షణంలో రాముని దగ్గరకు చేరుస్తాను. "అస్మాద్దుఃఖా దుపారోహ మమ పృష్ఠం అనిందతే" అవలీలగా శతయోజన విస్తీర్ణ సాగరం దాటి వచ్చాను. అనాయాసంగా తిరిగి వెళ్ళగలను. అంతేకాదు రావణ సహితంగా లంకను పెళ్ళగించి మరీ తీసుకు వెళ్ళగలను. రాక్షసులు నన్ను వెంబడిస్తారని భయపడవలదు. వేగాన్ని అందుకునే శక్తి వారికి లేదు". నా గమన వేగాన్ని అందుకనే శక్తి వారికి లేదు." 


ఆ మాటల కానందించినా జనక నందినికి అనుమానం మాత్రం వీడలేదు.


హనుమన్ దూరమధ్వానం కథం మాం ఓడుమిచ్చసి 

తదేవ ఖలుతే మన్యే కపిత్వం హరి యూధప


హనుమా! అంగుష్ఠమాత్రమైన లేవే! నన్ను అంతదూరం ఎలా మోస్తావు. నీ మాటలు నీ కవిత్వాన్ని చూపుతున్నాయి.

Saturday, 10 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (46)



ఈ సన్నివేశంలో అంజనా నందనుడు చూపిన మాట నేర్పు, సంభాషణలోని ఎత్తుగడ, ముందుగా కార్యసాధన కాతడు చేసిన ఆలోచన - తక్షణ కర్తవ్య నిర్వహణ నిర్ణయము, ఓర్పు నేర్పులు - ఆంజనేయునంతటి వాక్య విశారదునికే చెల్లును. సకల మానవాళి తన బాటలో పయనించునటుల అందించిన సందేశం శిర సావహింప తగినది.


పావని సీతను చూచుటతోనే - వచ్చిన పని పూర్తయినట్లు జీవన సమస్యతో, నిరాశతో కొట్టుమిట్టాడుతున్న సీతకు జీవితంపై ఆశను కల్పించాలి. రాముడు లంక చేరి రావణ సంహార మొనరించి సీతను గ్రహించులోపల ఏ పొరపాటు జరగకుండ ఆమెను ఊరడించాలి. అందుకామెకు తనపై నమ్మకము కలుగురీతిని సంభాషించాలి. ఇందుకు తగినరీతిగా, మాటలాడగల నేర్పుతో మాట్లాడి సఫలీకృతుడయ్యాడు. సమయానుకూలంగా మాట్లాడటానికి చక్కని ఉదాహరణగా ఉంది యీ ప్రసంగ సన్నివేశం.


ఆమె ఎవరైనదీ తనకు తెలుసు. కాని నీవెవరవని, గంధర్వ కాంతవా ? నాగకన్యకవా! రోహిణివా! అరుంధతివా ! అంటూ చివరకు రాముని భార్యపు కాదుగదా! అంటాడు. సంభాషణలో ఇదొక నైపుణ్యం. ఆమె ఎవరో ఆమె నోటనే చెప్పించుట. ఇంతకు ముందు జరిగిన సంగతులు తెలిసియు- అపుడే వచ్చినవానివలె పలుకరించుటలోనే వాక్య విశారదత్వ ముట్టిపడుతుంది.


నాకన్ని సంగతులు తెలుసు అని ప్రారంభిస్తే ఆమె సిగ్గు పడవలసి వస్తుంది. ఎంత కష్టము అనుభవించుచున్నను. కొందరు చెప్పుకొనుటకుగాని, ఓదార్పునకుగాని ఇష్టపడరు.


ఆయుర్విత్రం గృహచ్ఛిద్రం మంత్రమౌషధ సంగమం

దానమానావ మానాని నవగోప్యాని సదానివై 


ఆయువు, విత్తము, ఇంటిపోరు, మంత్రం, ఔషధ సేవ, సంగమం, దానం, అవమానం. ఈ తొమ్మిదింటినీ గోప్యంగా ఉంచాలంటుంది శాస్త్రం.

Thursday, 8 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (45)



యథా రూపాం యథా వర్ణాం యథా లక్ష్మీం చ నిశ్చితాం 

అశ్రేషం రాఘవస్యాహం సేయ మాసాదితా మయా 

విరరామైన ముక్త్వాసౌవాచం వానర పుంగవః.


ఇపుడిచట రాముడు వర్ణించి చెప్పిన రూపురేఖలున్న సీతా దేవిని నేను దర్శించుచున్నాను అని పలికి మౌనం వహించాడు.


తలవని తలంపుగా యీ లంకలో ఇంతగా చెవులకింపుగా నిజమైనా, కలయైనా నిరాశలో ఒకటే అనుటను తలక్రిందులు చేస్తూ రామకథను వినిపించినది ఎవరా అని ఆనందముప్పొంగ చేతిలోని కేశపాశాన్ని విడిచి విప్పారిన కనుదోయితో తలపైకెత్తి చెట్టు పైకి పరికించి చూచింది జానకి.


తననే చూచుచున్న సీత మనసు నెరిగినవాడై పవన తనయుడు మెల్లగ పైనుండి దిగివచ్చి వినయ విధేయతలుట్టిపడ కేల్మోడ్చి -


అమ్మా! నీవెవరవు? ఈ చెట్టు నీడన శోకమూర్తివై నిలబడి ఎందుకిలా దిగాలుగా నున్నావు? అంత కష్టం నీకేమిటమ్మా ? సురాసుర నాగ గంధర్వ యక్ష కిన్న రాంగనవై యుందువా ? చంద్రుని వీడిన రోహిణివా? కోప తాపాలతో భర్తను వీడి వచ్చితివా ? వశిష్ఠునిపై అలిగి వచ్చిన అరుంధతివా ! చూడగా నీవు మానవ కాంతవోలె కన్పట్టుచున్నావు? రాచకన్నియ వనుకొందును. జన స్థానమున రావణుడపహరించిన సీతవు కావుకదా! అదే నిజమైన 'త్వమసి భద్రం తే' నీకు శుభమగు గాక!


ఇది పవన కుమారుడు సీతను గాంచి భాషించ మొదలిడిన సన్నివేశం.


Wednesday, 7 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (44)



వాక్య విశారదుడు


ఇక తనకు మరణమే శరణమని, ఆ క్రూర రాక్షసాధముని చేతిలో మడియుట కంటె ప్రాణత్యాగమె మంచిదని భావించి తన జడను ఉరిత్రాడుగ చేసుకుని ప్రాణోమణమునకై ప్రయత్నించుచున్నది.


తాను సీతతో సంభాషించుటకు ఇదే తగిన సమయమని, ఏ కొంచెం ఆలస్యం చేసినా ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని తగిన సమయానికై వేచియున్న మారుతి ఇటులాలోచించసాగాడు. నేనిపుడీమెతో ఎలా మాటలాడవలె? ఈమె నేవిధముగ ఊరడించవలె? ఆత్మహత్యా ప్రయత్నానికి సిద్ధపడిన సీతను విరమింప చేయాలి. లేదేని రామ లక్ష్మణులు వచ్చి ఇచట చేసేదేముంది ? సమయం మించిపోవుతున్నది. కాలయాపన చేయరాదు. సరే నేను వానరుడను. ఈ రూపాన యీమెతో మాటలాడ తగదు. పోనీ సంస్కృతమున మాటలాడుదమన్న- ద్విజుడైన రావణుని మాయా రూపముగా భావించునేమో! కనుక 'అవశ్యమేవ వక్త వ్యం మానుషం వాక్యమర్థవత్' మనుష్య భాషలోనే సంభాషించుట తగియున్నది. నా వేషభాషలు ననుమానించి యీమె పెద్దగ అరచినచో ఎచటెచటనో నున్న రాక్షసులందరును ఒక్కటైనా మీదకు వచ్చిన ఆత్మరక్షణార్థం పోరు సాగించక తప్పదు. జయాపజయాలు దైవాధీనాలు అన్నమాట అటుంచి వచ్చిన పని జటిలమగును. దూతలు దేశకాల పాత్రానుగుణంగా ప్రవర్తించుట న్యాయం. కాదేని పరిస్థితి మరోలా ఉండవచ్చు. తొందరపడి ఉద్రేకానికి లోనైతే- అదే అన్ని అనర్థాలకూ మూలం అవుతుంది ఆనుకుంటూ -

మృదుమధురంగా మంగళప్రదమూ, ధర్మసమ్మతమూ నైనరీతిగా - సీతా నిర్వేదము తొలగునట్లు, ఆత్మత్యాగము నుండి మరలునటుల రామకథను... 

రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్
పుణ్యశీలో మహాకీర్తిః ఋజురాశీన్మహా యశాః  

దశరథ మహారాజు అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్నాడు. పరాక్రమశాలీ, ధర్మతత్పరుడు. అతని పెద్దకొడుకు రాముడు, సదాచార పరాయణుడు, మృదుభాషి. జీవ కారుణ్యము కలవాడు. సత్యవాక్పాలకుడు. తండ్రి ఆనతి తలదాలిచి భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు వెంటరాగా దండకాటవికి ఏతెంచినాడు. ముని జనులను హింసించే ఖర దూషణాదులను వధించాడు. ఇది తెలిసిన రావణుడు మాయా లేడిని కల్పించి రామ, లక్ష్మణులను దూరం చేసి ఒంటరిగానున్న రామపత్ని సీతను మాయా రూపంలో అపహరించాడు. భార్యాన్వేషణలో కిష్కింధ చేరిన రామునికి వానర రాజు సుగ్రీవునికి సఖ్యమేర్పడింది. సుగ్రీవుని అన్న వాలి. రాముడు వాలిని సంహరించి సుగ్రీవుని రాజుగా చేశాడు. సుగ్రీవుని ఆదేశానుసారం వేలకొలది వానర వీరులు సీతను వెదకుటకై అన్ని దిక్కులకు బయలుదేరి వెళ్ళారు. వారిలో నేనొకడను. సంపాతి మాటల ననుసరించి నేను నూరు యోజనాల సముద్రాన్ని దాటి సీతాన్వేషణ చేయుచు లంక చేరాను.

Tuesday, 6 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (43)



తతస్సీతాం ఉపాగమ్య రాక్షస్యో వికృతాననాః 

పరుషం పరుషానార్య ఊచుస్తాం వాక్యమప్రియం.


రావణుడు అలా వెళ్ళాడో లేదో వెంటనే చుట్టుముట్టారు సీతాదేవిని రాక్షస స్త్రీలు. తమ స్వామి ఆదేశానుసారం వివిధ రీతుల భయ పెట్టసాగారు. వారి మాటలు సీతాదేవికి కంటక ప్రాయమై, తనను మాటలతో హింసించవద్దని, కావలిస్తే చంపి తినండని ఎంతగ బ్రతిమాలినా ఆ రక్కసి మూక వినిపించుకోదయ్యె. వారిని తప్పించుకుని ఆంజనేయుడున్న శింశుపా వృక్ష చ్ఛాయ నాశ్రయించింది ఆ వికార రూపసులు అక్కడకు చేరి కర్ణకఠోరమైన వాగ్బాణాలతో వేధింపసాగారు. వారి మాటలు విన లేక తన విధికి ఎంతగానో విలపించింది. రామ లక్ష్మణులను, కౌసల్యా సుమిత్రలను పేరు పేరునా తలచుకుని, అందరూ ఉండి కూడా లేనిదాననై నశించుచున్నాననుకుంది.


ప్రసక్తా శ్రుముఖీత్యేవం బ్రువంతీ జనకాత్మజా 

అధోముఖ ముఖీ చాలా విలప్తుముపచక్రమే.


తీరమే కానరాని “అగాధ నడిసంద్రాన త్రోయబడినదాని" వలె, కుమిలి కుమిలి దుఃఖించి, ఇంకను 'ఉన్మత్తురాలి వలె' విలపించింది.


ఇదంతా చెట్టుకొమ్మల ఆకుల సందులనుండి పవన తనయుడు చూచుచునే ఉండెను.


నిద్రపోతున్న త్రిజట అను రక్కసి మేల్కాంచి, సీతను భయపెడుతున్న రాక్షస గణాన్ని వారించి, తాను కన్నకలలోని దృశ్యాలను వివరించి చెప్పింది. ఆ స్వప్న వృత్తాంతం వింటూనే నిద్రలోకి జారుకున్నారు రాక్షస స్త్రీలు.


Monday, 5 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (42)



తుల్య శీల వయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం 

రాఘవోర్హతి వైదేహీం తం చేయ మసితేక్షణా


శీల వయోవర్తన ఆభిజాత్యాధి లక్షణాలలో ఇరువురూ సమానులే. సీతారాములు ఈడూ జోడైనవారు. వీరిది అనుకూల దాంపత్యం. ముజ్జగాల రాజ్య రమను జనకజ సీతను పోల్చి చూచిన యీమె ముందు త్రైలోక్య రాజ్యలక్ష్మియు దిగదుడుపే.


కష్టసుఖాల కతీతుడు, తేజస్వీ, పౌరుషవంతుడు, సమయోచిత కర్తవ్య ధురీణుడు, అంజనా సుతుడు- ముందు వెనుకల గురించి ఆలోచిస్తున్నాడు ఇలా చేయవలసినదెంతో ముందుంది. జానకిని చూచాను. నేనిపుడేమి చేయుట యుక్తం? ఈమెతో సంభాషించి ఓదార్చి వెళ్ళుట భావ్యమా! లేక రాముని చేరి సీతా దేవిని చూచానని చెప్పుట ధర్మమా? అసహాయురాలు, దీనురాలు ఐన సీతను ఊరడించి వెళ్ళుటయే న్యాయము. ఎందుకంటే రాముడు సీతను చూచాను అనగనే ఎలావుంది ? నాతో ఏమని చెప్పమంది? అని అడిగితే రాఘవునికి నేనేం చెప్పగలను? కాబట్టి మాటాడి వెళ్ళుటయే యుక్తం. మరి అలాగయిన రాక్షసులు కామ రూప ధరులగుట- ఇప్పటికే అనేక రూపాలతో ఆమెను అదిరించి, బెదిరించి యుందురు. అట్టి స్థితిలో యీమె నన్ను గుర్తించునా!


ప్రాణ త్యాగశ్చ వైదేహ్యా భవేదనభిభాషణే

ఏష దోషో మహాణి స్యాత్ మమ సీతాభిభాషణే. 


అని ఆలోచించి చివరకు సీతాదేవిని ఎలాగైనా ఊరడించ నిశ్చయించుకున్నాడు.

తెలతెలవారుతున్నది. రావణాంతఃపురం నుండి వేద ఘోష వినిపిస్తున్నది. మేల్కాంచిన రావణుడు సపరివారంగా వచ్చి సీతతో- కారడవులలో తిరిగే రామునిమీద నుండి తనవైపుకు మనసు మరల్చుకొమ్మని, కాదను నిను ముట్టనని, రుచులు రుచులుగా వండించుకుని విందారగిస్తానని, నీవిక రాముని చేరుట కలలోని వార్త అని వివిధరీతులు బెదిరించి- భయపెట్టి ఇక నీకు రెండు నెలలే గడువని, ఆలోచించుకొమ్మని చెప్పి -


సీతను కాపలా కాచే రాక్షస స్త్రీలతో “మీరిమె మనసు మార్చండి" అని హెచ్చరికలు చేసి వెళ్ళాడు.


Sunday, 4 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (41)

 


ప్రయత్నిస్తే ఫలితం ఉండకపోదు


ఆంజనేయునికి ఆ వనం చూస్తుంటే ఎందుకో తనువు ఆనంద తరంగాల తేలియాడుతున్నది. ప్రకృతి సౌందర్యంతో వనం పరవశింప చేస్తున్నది. నందనవనంలా ఫల పుష్పభరిత వృక్షతతులతో మనోహరంగా ఉంది. ఇంతవరకు తాను పొందిన నిర్వేదం పటాపంచలైంది. ఒక్కసారి శ్రీరామచంద్రునివైపు మనసు పోయింది. ఏకాగ్రచిత్తంతో సీతారామ లక్ష్మణులకు నమస్కరించాడు. రుద్ర, ఇంద్ర, యమ, వాయుదేవులకు- చంద్ర, సూర్యులకు- మరుద్గణాలకు మనసారా నమోవాకము అర్పించి చుట్టూ కలయచూడగా మైమరపించే ఆ పూల వాసనల నాఘ్రాణిస్తూ చిన్న రూపంతో చెట్ల పైకి ఎగురుతూ- తిరుగుతుండగా


మనోహర చైత్య ప్రాసాదం అల్లంత దూరాన కానవచ్చింది. ఆ రమ్య హర్మ్య ప్రాంత సమీపాన- శింశుపా వృక్షచ్ఛాయలో “శుక్ల ప్రతిపత్ చంద్రరేఖ వోలె" "ఉపవాస కృశాం దీనాం” మాటిమాటికి వేడి నిట్టూర్పులు విడుచుచు, దట్టమైన పొగతో కప్పబడిన అగ్నిశిఖవలె నుండి మాసిన చీరతో, రాక్షసీజన పరి వృతయైన సీతను చూచాడు. ఆమె క్రూర మృగాల మధ్య లేడిలా ఉంది. ఆనాడు తమకు దొరికిన వస్త్రఖండ ఆభరణాలు ఈమె తాల్చిన వస్త్రాభరణాలు ఒక్కటిగ ఉండుటను బట్టి - రాముడు వర్ణించిన ఆభరణాల ధారణ తీరును బట్టి- ఈమెయే రాముని ఇల్లాలు అని నిర్ణయించుకున్నాడు. చెట్టుకొమ్మల మాటున దాగి సీతను చూస్తుంటే హనుమంతునంతటి జితేంద్రియుని హృదయం ద్రవించి కనులు దుఃఖాశ్రువులతో నిండినై,


“యది సీతాపి దుఃఖార్తా కాలో హి దురతి క్రమః” 


సీత వంటి మహాసాధ్వికా ఇంతటి కష్టము దాపురించుట ఆహా! కాలమెంత దురతిక్రమమో కదా !! విధి దాటరానిది. ఎంత వారైనా విధికి బానిసలే.

Saturday, 3 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (40)



మనసుంటే మార్గం ఉంటుంది 


ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఒక్కక్షణం మనస్సును వశము నందుంచుకుని వివేశంతో కూడిన బుద్ధితో ఆలోచిస్తే తమ సమస్యకు ఒక మార్గం దొరుకుతుంది.. మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా! అపజయాలు విజయానికి సోపానాలు. తన ప్రయత్నంలో ఎక్కడో లోపం జరిగి ఉంటుంది. ఆ లోపం గమనించి ప్రయత్నిస్తే ఫలితం లభింపకపోదు. నైరాశ్యం పనికి రాదు. శరీరాన్ని వీడి సాధించేదేముంటుంది? శరీరంతోనే సర్వం సానుకూలం చేసుకోవాలి. ఆశించిన ఫలితం పొందేవరకు కృత నిశ్చయంతో ఉత్సాహపూర్వక ప్రయత్నం చేస్తున్టుఁటే అభీష్ట వస్తు సందర్శన ప్రాప్తి కాగలదు. 


బలంగా బంతి నేలకేసి కొడితే- అది అంతే వేగంతో పైకి ఎలా ఎగురునో అలాగే విఘ్నాలెంత కలిగినా జితేంద్రియుడై ధైర్యంతో, వివేకంతో, పవిత్రశీలంతో ప్రయత్నించాలి. నిరాశతో విజయం చేకూరదనీ, విశ్వాసంతో ఉత్సాహంతో కర్తవ్యోన్ముఖుడవ్వాలి. ఆవేశం ఆణచుకుని ఆత్మస్థైర్యంతో దైవాన్ని నమ్మి కార్యసాధకుడవ్వాలి. ఎందుకంటే ఒక్కోసారి గొప్పవారు సైతం దేవుని మరచి శక్తిహీనులౌతుం టారు. పురుష ప్రయత్నానికి దైవం తోడు కావాలి "షడ్భిర్మనుష్య యత్నేన సప్తమం దైవచింతనం". అపుడే "మబ్బును  వీడిన చంద్రునివలె" సమస్యల నుండి బయటపడ గలగుతాడు.


అంతేగాని తొందరపడి పిరికితనంతో కింకర్తవ్యతామూఢుడై ఆత్మహత్య నిర్ణయం చేయరాదు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని - అంటే తను కన్నవారిని, తనను కన్నవారిని గాలికి వదిలేసి అన్యాయం చేయరాదు. జీవన సమస్యలతో రాజీలేని పోరాటాన్ని సాగించాలి. ఎదురెంత యీదినా - అలసి సొలసినా తన లక్ష్యాన్ని వీడరాదు. గమ్యం చేరాలి. ఇదే ఇచట మారుతి మనకిచ్చిన మహత్తర సందేశం.


Friday, 2 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (39)



యుగాలు మారినా- తరాలు దొర్లినా రామాయణ కాలంనాటి సాంఘిక జీవన స్థితిగతులు నేటి సమాజానికి దర్పణాలుగా నిలవడం ఆశ్చర్యకరం. రామాయణాన్ని అనుదినం మననం చేసి అందలి జ్ఞాన విజ్ఞానాలను "నీటికొలది తామర సుమ్మీ" అన్నట్లు ఆగాధ జలనిధిలోని అనంత రత్నాలను అందగలిగినంతవరకు ఆందుకుని జీవన ధన్యత నందుటకు ప్రయత్నించవలెను.


చూడండి. ఈ సన్నివేశంలో పవన తనయుడు సీతాన్వేషణ నిరంతర పరిశ్రమ, కఠోర దీక్ష, నిస్వార్థ సేవాభావం, నిర్మల హృదయం, ఏకాగ్ర చిత్తంతో చేసినా ఫలితం శూన్యమైంది. ఎంతటివానికైనా ఆ పరిస్థితులలో జీవితం మీదనే విరక్తి కలుగుతుంది. మరి అటువంటప్పుడు కలిగే మనోవికారం ఆత్మహత్య. ఆత్మహత్య మహా దోషం. ఆ భావం అసలు మనసులోకి రానీయ రాదు. వచ్చిందా వివేకం లోపిస్తుంది సామాన్యులకు.


ఇది యీనాడు మనం నిత్యం చూస్తున్నదే. ఈనాటి సమాజం చూస్తే ఏమున్నది గర్వకారణం? ఏ పేపరు చూచినా ప్రేమ విఫలమైతే - ఆత్మహత్య. పెద్దలు బుద్ధి చెబితే - ఆత్మహత్య. పరీక్షా ఫలితాలలో తన నెంబరు కనబడకపోతే ఆత్మహత్యే! ఇంటిలోని వారు తన మాట కాదంటే- ఆత్మహత్య. ఇలా ప్రతి సమస్యకు తేలిక మార్గం ఆత్మహత్యే. అంటే అన్నింటికీ పరిష్కార మార్గం ఆత్మహత్యేనన్న మాట. ఇదీ నేటి సమాజ పరిస్థితి.


Thursday, 1 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (38)



నిరాశ నిర్వేదానికి మూలం - ఆత్మహత్య మహా దోషం


ఆంజనేయుడు ఇలా లంకా నగరమంతా - గజశాలలు, పాకశాలలు, పానశాలలు, వనాలు, ఉపవనాలు, సరోవరాలు, లతా గృహాలు, భవనాలు- మొదలైనవన్నీ తిరిగి వెతికాడు. ఎందునా సీత జాడేమాత్రము తెలియరాలేదు. అన్ని ప్రదేశాలూ చూచెను. తన ప్రయత్నం అంతా వ్యర్థమైంది. అసలు జానకి జీవించి ఉన్నదో లేదో! జీవించి ఉంటే ఏదో ఒకచోట కనిపించి ఉండేది కదా! పంజరాన చిలుకనువలె తనను బంధించిన కారణంగా రామ లక్ష్మణులను తలచుకుంటూ కుమిలి కుమిలి కృశించిందో!! లేక నరమాంస భక్షకులు రాక్షసులు తినివేశారో !!! లేక రావణుడు తెచ్చువేళ సంద్రాన పడిపోయిందో! ఏమో!! ఏమి జరిగినదో!!! 


ప్రస్తుతం కింకర్తవ్య ? నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకంతా వెతికి సీతను కానక తిరిగి వెళ్ళితే తానేం సాధించినట్లు? అందరిలో నన్ను గొప్పగ చేసి పంపిన జాంబవంతుని ముఖం ఎలా చూడగలను? అంగదుడు నన్ను పరిహసించకుండునా? అందరిలో ఇక తల యెత్తుకుని ఎలా తిరగగలను? సుగ్రీవుడు నాపై కార్యభార ముంచినపుడు- రాముడు అంగుళీయక మిచ్చి “నీవే అందుకు తగినవాడవన్న" వారి నమ్మకాన్ని వమ్ము చేసితినే- గడువు మీరిన తదుపరి సుగ్రీవుడు నన్ను దండింపకుండునా! 


సీతను చూడలేదన్న వార్త విన్న రాముడుండునా! రాముని వీడి లక్ష్మణుడు నిలుచునా! సుగ్రీవుడును, అంగదుడును ఇలా వానరజాతి అంతయు ఆంతరించునే. ఇంతటి దారుణం నావలననే గదా జరిగేది.


అసలు పోకుండిన- ప్రాయోపవేశ మిచట నేనయిన అందరూ జీవింతురు గదా ! అని నిర్వేదముతో నిరాసక్తతకు లోనై ఆంజనేయుడు క్షణకాలం చింతాక్రాంతుడై వెనువెంటనే నూతనోత్సాహాన్ని తెచ్చుకుని "ఛీ! ఆత్మహత్య ఎంతటి పాపహేతువు. మనస్సులో శోకానికి తావీయవచ్చునా! ప్రాణత్యాగం సమస్యను మరింత జటిల పరచునేగాని పరిష్కరించునా? ప్రాణములున్న సత్ఫలితాలందకపోవు అన్నిటికి మూలం ఉత్సాహం. ఉత్సాహవంతుని సుఖాలు వరించి వస్తయ్. ఉత్సాహవంతుడే సమస్త కోర్కెల నందగలడు" అని భావించి అంతఃపుర ప్రాకారం మీద నిలబడి ఎదురుగా చూచాడు. ఆశోక వనం కనిపించింది. తానింతకు పూర్వం చూడనిది. సీతకై 'ఈ వనం వెతుకుదాం' అనుకుంటూ వనం లోనికి ప్రవేశించాడు.