Saturday 24 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (60)



“నేను సీతామాత క్షేమాన్ని మరచి, అగ్నికి లంకను ఆహుతి చేయటం ఎంత సిగ్గుమాలిన పని. ఆమెకేదైన కీడు జరిగి ఉంటే స్వామికార్యం చెడగొట్టిన నా జన్మ నిరర్థకం. బుద్ధిహీనుడనై నా వానరత్వాన్ని ఋజువు చేశాను” అని వ్యాకులత నొంది మరల వివేకంతో “సీతారాముల ప్రభావం వలన అగ్ని- నన్నే ఏమీచేయ లేదు. అటువంటపుడు పరమ కళ్యాణి, పతివ్రతా శిరోమణి సీతను అగ్ని దహించునా! 


నాగ్ని రగ్నే ప్రవర్తతే 


అగ్నిని అగ్ని దహించదు. ఆమె తేజస్సంపదయే ఆమెను కాపాడును" అని అనుకొనుచుండగా -


దగ్గేయం నగరీ సర్వా సాట్టప్రాకార తోరణాః

జానకీ న చ దగ్ధతి విస్మయోద్భుత ఏవ సః.


ఆకాశవీధిన సంచరించు సిద్ధచారణులు "లంకంతా బూడిద బుగ్గి అయినా జానకిని ఏమాత్రపు అగ్నిశిఖా తాకలేదు. ఎంత ఆశ్చర్యం" అని సంభాషించుకొను మాటలు చెపులబడగా మారుతి అమితానందమానసుడాయెను.


ఈ సన్నివేశమున ఆంజనేయుడు నవనవోన్మేషమైన బుద్ధి విశేషమును కనబరచాడు. నిజం ఎంతో నిష్ఠురమైనది. అందుకే మనకొక సామెత ఉంది. నిజం చెప్పేవాడికి లోకమంతా విరోధులే. ఈ లౌకికపు మాట ఆచరణీయం కాదంటుంది చాణక్య నీతి. “సత్యం వల్లనే భూమి స్థిరంగా ఉంది. సత్యం వల్లనే సూర్యుడు తపిస్తున్నాడు. సత్యం వల్లనే గాలి వీస్తుంది. సత్యం వల్లనే జగత్తంతా నిలిచిఉంది". మరి నిష్ఠుర సత్యం తనకెంతో హాని అని ఆగక ఆంజనేయుడు మంచిని ప్రబోధించినందుకు ఫలితం లాంగూల (తోక) దగ్ధం. ఐనా వెరవక దానితోనే శత్రుమర్దన చేయటం జరిగింది. భయపడి సత్యం దాచరాదు, అసత్యం చెప్పటం పిరికితనానికి చిహ్నం. లోకంలో చాలామంది తాము చేసింది అణువైనా పరమాణువంత గొప్పతనంగా చెప్పుకోవటం ప్రత్యక్షంగా జరుగుతున్నదే కాని అది హర్షణీయం కాదు. తాము ఎంతో చేసి కొద్దిగా చేశానని చెప్పటం, అదీ దైవామగ్రహం. పెద్దల ఆశీర్వాదంగా భావించటం వినయవంతుల లక్షణం. అదే హనుమ లంకా దహన సందర్భంలో తన తండ్రి, శ్రీరామచంద్రుల అనుగ్రహం వల్ల అగ్ని తన వేడిమితో నన్ను బాధించటం లేదు అని చెప్పుట. 

No comments:

Post a Comment