Monday, 19 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (56)



సామాన్యంగా సమాజంలో విరోధిలోని లోపాలను ఎత్తి చూపి – అతనిని ద్వేషించేటట్లు చేయటానికే పాటుపడతారు కాని మంచినిమాత్రం మసిపూసి మారేడుకాయగా చేయచూస్తారు. అది పొరపాటు. మన కయిష్టునిలోని సద్గుణాలను, సదాశయాలను గౌరవించటం ధర్మం, దుర్గుణాలను ఎలాగూ విమర్శిస్తాం కదా. ఈ విషయంలో తరతమ భేదం చూపరాదన్నమాట. అలాగే ఆకారాన్ని చూచి అతని స్వభావ గుణ సంపత్తిని బేరీజు వేయరాదు. ఆకారమున్న- గుణముండబోదు, గుణమున్న ఆకారము లేకపోవచ్చు. ప్రధానం ఆకారం కాదు గుణం, ఆత్మ నముపమానంగా చేసుకుని నిర్ణయించాలి. ఇదే భావాన్ని తెలిపే ఒక చాటువు ఇలా ఉంది.


విజ్ఞుడగువాడు మెప్పొందు వికృతుడైన 

సుందరుండగు మూర్ఖుని చూడరెవరు 

వాసనలు గల్గు కురు వేరు వాసికెక్కు 

అందమైనట్టి మోదుగ నడుగరెవరు.


కోపావేశంతో కనుల నిప్పులురాల రావణుడు మంత్రిసత్తముడైన ప్రహస్తునితో “దురాత్మా! పృచ్ఛ్యతాంమేష కుతః కిం వాస్య కారణం, వనభంగే చ కోస్యార్ధో రాక్షసీనాం చ తర్జనే". ఈ దురాత్ముడు మన వీటికేల ఏతెంచెను?” వన భంగ మొనర్చనేల? రాక్షసుల నేమి కతంబున హింసించెనో అడుగు" మని కాలయుక్తంగా అర్ధవంతంగా పలికిన పలుకు లాలకించి హరిసత్తముడు లంకాధీశునకు ---  

హనుమంతుని దౌత్యం


అసత్యం పిరికివాని లక్షణం:


రాక్షసేంద్రా ! మీరనుకుంటున్నట్లు నన్ను ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు- పంపలేదు. విష్ణుని దూతనూ కాను. ఉన్నమి తౌజసుడగు రాఘవుని దూతగా తెలిసికొనుము. నేను వేషధారిని కాను, వానరుడనే. ఒక రాచకార్య నిర్వహణార్థం ఇచటికి వచ్చాను, లంకేశ్వరుని చూడ- వన భంగం కావించాను. ఉన్మత్తుడను కాను, ఆత్మరక్షణకై ఎదిరించిన రాక్షసుల వధించాను. దేవ దానవులెవరూ నన్ను అస్త్రాలతో బంధించజాలరు. పితామహుడట్టి వరాన్ని ప్రసాదించినాడు. రాజ దర్శన కాంక్షినై నేనే బ్రహ్మాస్త్రానికి పట్టుబడ్డాను, మూర్ఖులు రాక్షసులు ఇతర పాశాలతో బంధించగా- ఆ అస్త్రబంధనం నుండి కూడా విముక్తుడనైనాను. 'మమ పథ్యం ఇదం వచనం చాపి శ్రూయతాం' పథ్యములైన నా మాటలను సావధానంగా వినవలసినది.



No comments:

Post a Comment