Sunday, 4 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (41)

 


ప్రయత్నిస్తే ఫలితం ఉండకపోదు


ఆంజనేయునికి ఆ వనం చూస్తుంటే ఎందుకో తనువు ఆనంద తరంగాల తేలియాడుతున్నది. ప్రకృతి సౌందర్యంతో వనం పరవశింప చేస్తున్నది. నందనవనంలా ఫల పుష్పభరిత వృక్షతతులతో మనోహరంగా ఉంది. ఇంతవరకు తాను పొందిన నిర్వేదం పటాపంచలైంది. ఒక్కసారి శ్రీరామచంద్రునివైపు మనసు పోయింది. ఏకాగ్రచిత్తంతో సీతారామ లక్ష్మణులకు నమస్కరించాడు. రుద్ర, ఇంద్ర, యమ, వాయుదేవులకు- చంద్ర, సూర్యులకు- మరుద్గణాలకు మనసారా నమోవాకము అర్పించి చుట్టూ కలయచూడగా మైమరపించే ఆ పూల వాసనల నాఘ్రాణిస్తూ చిన్న రూపంతో చెట్ల పైకి ఎగురుతూ- తిరుగుతుండగా


మనోహర చైత్య ప్రాసాదం అల్లంత దూరాన కానవచ్చింది. ఆ రమ్య హర్మ్య ప్రాంత సమీపాన- శింశుపా వృక్షచ్ఛాయలో “శుక్ల ప్రతిపత్ చంద్రరేఖ వోలె" "ఉపవాస కృశాం దీనాం” మాటిమాటికి వేడి నిట్టూర్పులు విడుచుచు, దట్టమైన పొగతో కప్పబడిన అగ్నిశిఖవలె నుండి మాసిన చీరతో, రాక్షసీజన పరి వృతయైన సీతను చూచాడు. ఆమె క్రూర మృగాల మధ్య లేడిలా ఉంది. ఆనాడు తమకు దొరికిన వస్త్రఖండ ఆభరణాలు ఈమె తాల్చిన వస్త్రాభరణాలు ఒక్కటిగ ఉండుటను బట్టి - రాముడు వర్ణించిన ఆభరణాల ధారణ తీరును బట్టి- ఈమెయే రాముని ఇల్లాలు అని నిర్ణయించుకున్నాడు. చెట్టుకొమ్మల మాటున దాగి సీతను చూస్తుంటే హనుమంతునంతటి జితేంద్రియుని హృదయం ద్రవించి కనులు దుఃఖాశ్రువులతో నిండినై,


“యది సీతాపి దుఃఖార్తా కాలో హి దురతి క్రమః” 


సీత వంటి మహాసాధ్వికా ఇంతటి కష్టము దాపురించుట ఆహా! కాలమెంత దురతిక్రమమో కదా !! విధి దాటరానిది. ఎంత వారైనా విధికి బానిసలే.

No comments:

Post a Comment