Monday, 26 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (62)



వానరులంతా చుట్ట చేరి — “తన ప్రయాణం ఎలా సాగింద'ని అడిగినపుడు ఆంజనేయుడు వారికి సముద్రమును లంఘించి నది మొదలు తిరిగి వచ్చునంతదనుక జరిగిన విషయాలను విపులీకరిస్తాడు.


ఇందులో సీత జాడ- తనకు ఎదురైన విఘ్నాలు- అబ్బురపరచే తన కదన పాండితి అంతా వారికి వివరిస్తాడేకాని సీతా సందేశం మాత్రం చెప్పడు. ఎవరితో ఎప్పుడు ఎంతవరకు చెప్పాలో ఆంత వరకే చెప్పాడు. మిగిలిన విషయాలు వీరికి చెప్పుట అనవసరం అని ఊరుకున్నాడు. ఇదీ హనుమంతుని వచో వైభవం.


వార్తాహరులైనవారు - వారిని మనం యీనాడు విలేఖరులు అంటున్నాం. విలేఖరులైనవారు తాము చూచిన, విన్నవానిని పత్రికల కెక్కించేముందు ఎంతవరకు ప్రజలకు తెలియచేయాలో, ఏ విధంగా తెలియచేస్తే ప్రజలు అవగాహన చేసుకుంటారో ఆంత వరకే వ్రాయాలిగాని అనవసరమైన విషయాలను పొందుపరచరాదు, అలాచేస్తే అవగాహనా లోపంవల్ల పరిస్థితులు పెడదారి పట్టే ప్రమాదముంది. వివేకంతో విలేఖరులు వాస్తవ విషయాలను ప్రజలకందించేటప్పుడు ఇలాగ ఉండాలి అని యీ సన్నివేశం తెలియచేస్తుంది.


హనుమద్వాక్యములను విన్న అంగదుడు అమితానందభరితుడై


సత్త్వే వీర్యే న తే కశ్చిత్ నమో వానర విద్యతే 

యదప ప్లుత్య వీ స్తీర్ణం సాగరం పునరాగతః 

జీవితస్య ప్రదాతా నస్త్వమేకో వానరోత్తమ. 

త్వత్ ప్రసాదాత్ సమేష్యామః సిద్ధార్థ రాఘవేణ హ

అహిూ స్వామిని తే భక్తి రహెూ వీర్య మహెూధృతిః. 


"వానరోత్తమా! బల పరాక్రమాలలో నీకు సాటిరాగల వారెవరూ న భూతో న భవిష్యతి. అతి విస్తీర్ణమైన సాగరాన్ని దాటి కార్యసాధకుడవై తిరిగివచ్చిన నీవు మాకు ప్రాణదాతవయ్యా! నీకై ఎంతగ ఎదురు చూచామో!! కాంతిలేని గాజు కళ్ళయిన మా కనులకు వెలుగును నింపినవాడవు నీవే! నీ మూలమున మేము సఫల మనోరధులమయ్యాము. రామ ప్రభుని దర్శన భాగ్యము నీ వలననే మాకు లభించుచున్నది. ఆ స్వామిపై నీకున్న భక్తి శ్రద్ధలు, నీ ధైర్యసాహసాలు- అహెూ! ఆశ్చర్యకారకాలు' అని అభినందించాడు.


No comments:

Post a Comment