Saturday 10 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (46)



ఈ సన్నివేశంలో అంజనా నందనుడు చూపిన మాట నేర్పు, సంభాషణలోని ఎత్తుగడ, ముందుగా కార్యసాధన కాతడు చేసిన ఆలోచన - తక్షణ కర్తవ్య నిర్వహణ నిర్ణయము, ఓర్పు నేర్పులు - ఆంజనేయునంతటి వాక్య విశారదునికే చెల్లును. సకల మానవాళి తన బాటలో పయనించునటుల అందించిన సందేశం శిర సావహింప తగినది.


పావని సీతను చూచుటతోనే - వచ్చిన పని పూర్తయినట్లు జీవన సమస్యతో, నిరాశతో కొట్టుమిట్టాడుతున్న సీతకు జీవితంపై ఆశను కల్పించాలి. రాముడు లంక చేరి రావణ సంహార మొనరించి సీతను గ్రహించులోపల ఏ పొరపాటు జరగకుండ ఆమెను ఊరడించాలి. అందుకామెకు తనపై నమ్మకము కలుగురీతిని సంభాషించాలి. ఇందుకు తగినరీతిగా, మాటలాడగల నేర్పుతో మాట్లాడి సఫలీకృతుడయ్యాడు. సమయానుకూలంగా మాట్లాడటానికి చక్కని ఉదాహరణగా ఉంది యీ ప్రసంగ సన్నివేశం.


ఆమె ఎవరైనదీ తనకు తెలుసు. కాని నీవెవరవని, గంధర్వ కాంతవా ? నాగకన్యకవా! రోహిణివా! అరుంధతివా ! అంటూ చివరకు రాముని భార్యపు కాదుగదా! అంటాడు. సంభాషణలో ఇదొక నైపుణ్యం. ఆమె ఎవరో ఆమె నోటనే చెప్పించుట. ఇంతకు ముందు జరిగిన సంగతులు తెలిసియు- అపుడే వచ్చినవానివలె పలుకరించుటలోనే వాక్య విశారదత్వ ముట్టిపడుతుంది.


నాకన్ని సంగతులు తెలుసు అని ప్రారంభిస్తే ఆమె సిగ్గు పడవలసి వస్తుంది. ఎంత కష్టము అనుభవించుచున్నను. కొందరు చెప్పుకొనుటకుగాని, ఓదార్పునకుగాని ఇష్టపడరు.


ఆయుర్విత్రం గృహచ్ఛిద్రం మంత్రమౌషధ సంగమం

దానమానావ మానాని నవగోప్యాని సదానివై 


ఆయువు, విత్తము, ఇంటిపోరు, మంత్రం, ఔషధ సేవ, సంగమం, దానం, అవమానం. ఈ తొమ్మిదింటినీ గోప్యంగా ఉంచాలంటుంది శాస్త్రం.

No comments:

Post a Comment