Friday, 16 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (52)



"తలచినదే తడవుగా కర్తవ్యోన్ముఖుడై మనోహర సుందర నందన వనమును బోలిన అశోక వనమును కొన్ని చెట్లు పెకలించి, మరికొన్నింటి కొమ్మలు విరచి కళకళలాడే ఆ వనాన్ని చిందరవందర చేశాడు, ఎదిరించిన వనపాలకులను మట్టుబెట్టాడు. ఈ వార్త రావణునికి చేరింది. ఆశ్చర్యపడి తనతో సమాన శాలురయిన కింకర గణాన్ని ఆ వానరుని దండించమని పంపాడు. మారుతి వారిని యమపురికంపాడు. మహావీరుడు జంబుమాలి, మంత్రుల పుత్రులు, సేనా నాయకులు దుర్జర, విరూపాక్ష, యూపాక్ష, భాసకర్ణాదులు యమాలయానికి అతిథులైనారు. అక్షకుమారుడును సమవర్తి సన్నిధి చేరాడు. రావణ ప్రేరితులై ఒకరి తరువాత ఒకరు వచ్చుటేకాని మరలిపోయినది లేదు. తోరణ స్తంభము నెక్కి సింహనాదం చేస్తూనే ఉన్నాడు వీర సంహారానంతరం, ఆ నాదం చెవిబడగనే శతృవుల గుండియలదరి ఆగి పోవుచున్నవి. ఒకరితో యుద్ధము చేసిన రీతి మరొకరితో చేయుట లేదు. ఆ అరుపులు, చరుపులు, వివిధ యుద్ధ భంగిమలు- ఈనాటి కరాటేలాంటి విద్యలను తలపించుచున్నవి. అంటే యీవిద్య ఆనాడు ఆంజనేయుడు చూపినదేనేమో!! అరుపులతో అదరగొట్టటం- చరుపులతో చావుదెబ్బ తీయటం -


తోరణ స్తంభమెక్కి సింహనాదం చేస్తూ 


జయత్యుతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః, 

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః  

దాసోహం కోనలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః 

హనుమాన్ శతృసైన్యానాం నిహంతా మారుతాత్మజః 

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతి బలం భవేత్ 

శిలాభిస్తు ప్రహరతః పాద పైశ్చ సహస్రశః 

అర్థయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం 

సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వ రక్షసాం.


(ఇది రామాయణలోని జయమంత్రం)


మహా బలశాలురైన రామ లక్ష్మణులకు జయమగు గాక! మా సుగ్రీవ మహారాజునకు జయము !!


ఎంత క్లిష్ట కార్యాన్నయినా అవలీలగా అనాయాసంగా చేయగల నేను వాయు కుమారుడను, రామదాసుడను, శత్రు మర్దనుడను, హనుమంతుడను. 


రాళ్ళు, చెట్లు పెకలించి విసరివేస్తూ పోరు సాగిస్తుంటే.. వేయిమంది రావణులైనా నా ఎదుట నిలబడలేరు.


లంకను అవలేశం కూడా లేకుండా చేయగలను. జానకికి అభివాదం చేసి - రాక్షస గణం బెంబేలెత్తి బిత్తరపోయి చూస్తుంటే - సంతోషాంతరంగుడనై తిరిగి వెళతాను.


ఒకవైపు అరివీర భయంకర స్వరూపం. మరోవైపు విధేయతలు. మారుతి యీ ప్రవృత్తి మహా మహిమాన్వితమైనది.


ఓ రాక్షసులారా! చూస్తున్నారుగా నన్ను. ఈపాటికి నా శక్తి ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. నాలాంటివారు మా రాజు కొలువులో వేలకొలది ఉన్నారు. కొందరు పది ఏనుగుల బలం కలవారైతే ఇంకొందరు వంద ఏనుగుల బలం కలవారు, ఇంకొందరో! వేయి ఏనుగుల బలం కలవారు. వారందరూ తరలి వచ్చారో. మీరూ, మీ లంకా నామ రూపాలు లేకుండా పోతాయి. ఇది నిజం అంటూ ప్రాకార స్తంభం పెకల్చి విసిరివేశాడు. రాక్షస వీరులు ప్రాణభీతితో పరుగెత్తసాగారు.

No comments:

Post a Comment