Monday 5 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (42)



తుల్య శీల వయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం 

రాఘవోర్హతి వైదేహీం తం చేయ మసితేక్షణా


శీల వయోవర్తన ఆభిజాత్యాధి లక్షణాలలో ఇరువురూ సమానులే. సీతారాములు ఈడూ జోడైనవారు. వీరిది అనుకూల దాంపత్యం. ముజ్జగాల రాజ్య రమను జనకజ సీతను పోల్చి చూచిన యీమె ముందు త్రైలోక్య రాజ్యలక్ష్మియు దిగదుడుపే.


కష్టసుఖాల కతీతుడు, తేజస్వీ, పౌరుషవంతుడు, సమయోచిత కర్తవ్య ధురీణుడు, అంజనా సుతుడు- ముందు వెనుకల గురించి ఆలోచిస్తున్నాడు ఇలా చేయవలసినదెంతో ముందుంది. జానకిని చూచాను. నేనిపుడేమి చేయుట యుక్తం? ఈమెతో సంభాషించి ఓదార్చి వెళ్ళుట భావ్యమా! లేక రాముని చేరి సీతా దేవిని చూచానని చెప్పుట ధర్మమా? అసహాయురాలు, దీనురాలు ఐన సీతను ఊరడించి వెళ్ళుటయే న్యాయము. ఎందుకంటే రాముడు సీతను చూచాను అనగనే ఎలావుంది ? నాతో ఏమని చెప్పమంది? అని అడిగితే రాఘవునికి నేనేం చెప్పగలను? కాబట్టి మాటాడి వెళ్ళుటయే యుక్తం. మరి అలాగయిన రాక్షసులు కామ రూప ధరులగుట- ఇప్పటికే అనేక రూపాలతో ఆమెను అదిరించి, బెదిరించి యుందురు. అట్టి స్థితిలో యీమె నన్ను గుర్తించునా!


ప్రాణ త్యాగశ్చ వైదేహ్యా భవేదనభిభాషణే

ఏష దోషో మహాణి స్యాత్ మమ సీతాభిభాషణే. 


అని ఆలోచించి చివరకు సీతాదేవిని ఎలాగైనా ఊరడించ నిశ్చయించుకున్నాడు.

తెలతెలవారుతున్నది. రావణాంతఃపురం నుండి వేద ఘోష వినిపిస్తున్నది. మేల్కాంచిన రావణుడు సపరివారంగా వచ్చి సీతతో- కారడవులలో తిరిగే రామునిమీద నుండి తనవైపుకు మనసు మరల్చుకొమ్మని, కాదను నిను ముట్టనని, రుచులు రుచులుగా వండించుకుని విందారగిస్తానని, నీవిక రాముని చేరుట కలలోని వార్త అని వివిధరీతులు బెదిరించి- భయపెట్టి ఇక నీకు రెండు నెలలే గడువని, ఆలోచించుకొమ్మని చెప్పి -


సీతను కాపలా కాచే రాక్షస స్త్రీలతో “మీరిమె మనసు మార్చండి" అని హెచ్చరికలు చేసి వెళ్ళాడు.


No comments:

Post a Comment