Saturday 3 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (40)



మనసుంటే మార్గం ఉంటుంది 


ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఒక్కక్షణం మనస్సును వశము నందుంచుకుని వివేశంతో కూడిన బుద్ధితో ఆలోచిస్తే తమ సమస్యకు ఒక మార్గం దొరుకుతుంది.. మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా! అపజయాలు విజయానికి సోపానాలు. తన ప్రయత్నంలో ఎక్కడో లోపం జరిగి ఉంటుంది. ఆ లోపం గమనించి ప్రయత్నిస్తే ఫలితం లభింపకపోదు. నైరాశ్యం పనికి రాదు. శరీరాన్ని వీడి సాధించేదేముంటుంది? శరీరంతోనే సర్వం సానుకూలం చేసుకోవాలి. ఆశించిన ఫలితం పొందేవరకు కృత నిశ్చయంతో ఉత్సాహపూర్వక ప్రయత్నం చేస్తున్టుఁటే అభీష్ట వస్తు సందర్శన ప్రాప్తి కాగలదు. 


బలంగా బంతి నేలకేసి కొడితే- అది అంతే వేగంతో పైకి ఎలా ఎగురునో అలాగే విఘ్నాలెంత కలిగినా జితేంద్రియుడై ధైర్యంతో, వివేకంతో, పవిత్రశీలంతో ప్రయత్నించాలి. నిరాశతో విజయం చేకూరదనీ, విశ్వాసంతో ఉత్సాహంతో కర్తవ్యోన్ముఖుడవ్వాలి. ఆవేశం ఆణచుకుని ఆత్మస్థైర్యంతో దైవాన్ని నమ్మి కార్యసాధకుడవ్వాలి. ఎందుకంటే ఒక్కోసారి గొప్పవారు సైతం దేవుని మరచి శక్తిహీనులౌతుం టారు. పురుష ప్రయత్నానికి దైవం తోడు కావాలి "షడ్భిర్మనుష్య యత్నేన సప్తమం దైవచింతనం". అపుడే "మబ్బును  వీడిన చంద్రునివలె" సమస్యల నుండి బయటపడ గలగుతాడు.


అంతేగాని తొందరపడి పిరికితనంతో కింకర్తవ్యతామూఢుడై ఆత్మహత్య నిర్ణయం చేయరాదు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని - అంటే తను కన్నవారిని, తనను కన్నవారిని గాలికి వదిలేసి అన్యాయం చేయరాదు. జీవన సమస్యలతో రాజీలేని పోరాటాన్ని సాగించాలి. ఎదురెంత యీదినా - అలసి సొలసినా తన లక్ష్యాన్ని వీడరాదు. గమ్యం చేరాలి. ఇదే ఇచట మారుతి మనకిచ్చిన మహత్తర సందేశం.


No comments:

Post a Comment