Thursday 29 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (65)



అహంచ రఘువంశశ్చ లక్ష్మణశ్చ మహాబలః 

వైదేహ్యా దర్శనే నాద్య ధర్మతః పరిరక్షితాః.


ఈ మహాత్ముడు నిస్సందేహంగా ఉన్నత శ్రేణికి చెందిన సేవకుడు. ఈతడొనర్చిన ఉపకారమునకు నేను, లక్ష్మణుడు, రఘువంశీయులు అంతా ఎంతో ఋణపడి ఉన్నాం. ఈతని ఉపకృతికి నా సర్వస్వం అర్పించినా సమానం కాదు.


మయి ఏక జీర్ణతాం యాకు త్త్వయోపకృతం కపే 

నరః ప్రత్యుపకారాణాం ఆపత్స్వాయాతి పాత్రతాం.


హనుమా! నీవొనర్చిన ఉపపకారము నాలో జీర్ణించుగాక. ఇదిగో! నా ఆలింగనమే యీ సమయాన నీకిచ్చు బహుమానం అని ఎంత తపస్సు చేసినవారికిని అందుకోరాని, అందుకోలేని గాఢ పరిష్వంగంతో (కౌగ్లింత) సమ్మానించాడు. 


ఆంజనేయుని ఔచిత్య సంభాషణ, విషయ వివేచనాశక్తి, ఉచితానుచిత ప్రవర్తన గమనింపతగినది. ఏమంటే- అంగద, జాంబవంతాదుల దగ్గర తన పరాక్రమం పరిక్రమించిన విధానం ఆ అద్భుత సాహస కృత్యాలు వివరించాడేగాని సీతామాత సందేశం- ఆమె చెప్పిన ఆనవాళ్ళు చెప్పలేదు. ఇక రాముని సన్నిధిలో తన సాహసయాత్ర, బల ప్రదర్శన వగైరాలు చెప్పక కేవలం వైదేహి వచనాలే వివరిస్తాడు. ఇందులో ఒక రహస్యం వుంది. ముందే మనం చెప్పుకున్నాం. తన ప్రతి కదలికలో, నడవడికలో లోకానికో సందేశం చాటాడని.


ఇక్కడ- సమాన వయస్కుల దగ్గర, స్నేహితుల దగ్గర మాత్రం తన శక్తియుక్తులు చెప్పుకోవచ్చుగాని, పెద్దల దగ్గర మాత్రం తగురీతిలో విధేయతా వినమ్రతలతో- ఆచి తూచి మాట్లాడాలి. అలాంటప్పుడే వారి ఆదరాభిమానాలూ, ఆశీస్సులూ వీరికి లభిస్తాయి. అంతర్గతంగా వారి శక్తి వీరిలో ప్రవేశిస్తుంది. అలాకాక పెద్దల సమక్షంలో గొప్పలు చెప్పుకుంటే వారు దానిని 'అహంకారం'గా భావించే అవకాశం లేకపోలేదు. వారి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. తన వీర్యం నిర్వీర్యమవుతుంది. అదీ ఇచట గమనింపవలసిన సందేశం.


No comments:

Post a Comment