Thursday 1 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (38)



నిరాశ నిర్వేదానికి మూలం - ఆత్మహత్య మహా దోషం


ఆంజనేయుడు ఇలా లంకా నగరమంతా - గజశాలలు, పాకశాలలు, పానశాలలు, వనాలు, ఉపవనాలు, సరోవరాలు, లతా గృహాలు, భవనాలు- మొదలైనవన్నీ తిరిగి వెతికాడు. ఎందునా సీత జాడేమాత్రము తెలియరాలేదు. అన్ని ప్రదేశాలూ చూచెను. తన ప్రయత్నం అంతా వ్యర్థమైంది. అసలు జానకి జీవించి ఉన్నదో లేదో! జీవించి ఉంటే ఏదో ఒకచోట కనిపించి ఉండేది కదా! పంజరాన చిలుకనువలె తనను బంధించిన కారణంగా రామ లక్ష్మణులను తలచుకుంటూ కుమిలి కుమిలి కృశించిందో!! లేక నరమాంస భక్షకులు రాక్షసులు తినివేశారో !!! లేక రావణుడు తెచ్చువేళ సంద్రాన పడిపోయిందో! ఏమో!! ఏమి జరిగినదో!!! 


ప్రస్తుతం కింకర్తవ్య ? నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకంతా వెతికి సీతను కానక తిరిగి వెళ్ళితే తానేం సాధించినట్లు? అందరిలో నన్ను గొప్పగ చేసి పంపిన జాంబవంతుని ముఖం ఎలా చూడగలను? అంగదుడు నన్ను పరిహసించకుండునా? అందరిలో ఇక తల యెత్తుకుని ఎలా తిరగగలను? సుగ్రీవుడు నాపై కార్యభార ముంచినపుడు- రాముడు అంగుళీయక మిచ్చి “నీవే అందుకు తగినవాడవన్న" వారి నమ్మకాన్ని వమ్ము చేసితినే- గడువు మీరిన తదుపరి సుగ్రీవుడు నన్ను దండింపకుండునా! 


సీతను చూడలేదన్న వార్త విన్న రాముడుండునా! రాముని వీడి లక్ష్మణుడు నిలుచునా! సుగ్రీవుడును, అంగదుడును ఇలా వానరజాతి అంతయు ఆంతరించునే. ఇంతటి దారుణం నావలననే గదా జరిగేది.


అసలు పోకుండిన- ప్రాయోపవేశ మిచట నేనయిన అందరూ జీవింతురు గదా ! అని నిర్వేదముతో నిరాసక్తతకు లోనై ఆంజనేయుడు క్షణకాలం చింతాక్రాంతుడై వెనువెంటనే నూతనోత్సాహాన్ని తెచ్చుకుని "ఛీ! ఆత్మహత్య ఎంతటి పాపహేతువు. మనస్సులో శోకానికి తావీయవచ్చునా! ప్రాణత్యాగం సమస్యను మరింత జటిల పరచునేగాని పరిష్కరించునా? ప్రాణములున్న సత్ఫలితాలందకపోవు అన్నిటికి మూలం ఉత్సాహం. ఉత్సాహవంతుని సుఖాలు వరించి వస్తయ్. ఉత్సాహవంతుడే సమస్త కోర్కెల నందగలడు" అని భావించి అంతఃపుర ప్రాకారం మీద నిలబడి ఎదురుగా చూచాడు. ఆశోక వనం కనిపించింది. తానింతకు పూర్వం చూడనిది. సీతకై 'ఈ వనం వెతుకుదాం' అనుకుంటూ వనం లోనికి ప్రవేశించాడు.


No comments:

Post a Comment