Monday 12 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (48)



సీతమ్మ మాటలు తనకు తక్కువతనాన్ని కలిగిస్తున్నాయి. ఇది ఒక అవమానం, అవమానకరం తన శక్తి నామెతు చూపదలచి “ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎత్తుకు ఎదుగుతూ - దివ్యకాంతుల నీనుచూ- మేరు పర్వతమంత ఎత్తు అయ్యాడు. వజ్రదంష్ట్రలు- వజ్ర నఖాలు- వజ్ర దేహం- కనులు మిరుమిట్లు గొలుపు భీకర రూపంతో తనముందు నిలబడిన మారుతిని చూచి- ఆష్టలక్ష్మీయుతునిగా భావించి


తవ సత్త్వం బలం, చైవ విజానామి మహా కపే

వాయోరిన గతించైవ తేజశ్చాగ్నేరివాద్భుతం.


హనుమా! నీ బలమూ, ధైర్యమూ ఎలాంటివో తెలుసుకున్నాను. గమనంలో వాయు సమానుడవు. తేజస్సులో అగ్నిసముడవు. సందేహించనక్కరలేదు. కానీ నీవు నన్ను తీసుకువెళ్తుంటే - రాక్షస సేన వెంబడించిన వారినెలా ఎదుర్కొనగలవు. అందులో కొందరు నన్ను బంధించిన ఇక నన్ను వధించుట తధ్యం. నీవు నన్ను తీసుకు వెళుతుంటే దారిలో జారి పడ్డాననుకో- భీకర మకరాలయం లోని భయంకర జలచరాలు నన్ను కబళించును. దీనితో రామకార్యం నెరవేరదు మరొక్కమాట. "న స్పృశామి శరీరం తు పుంసో వానర పుంగవ" నేను పర పురుషుని తాకను. మరి రావణుడు స్పృశించలేదా అంటావేమో! అపుడు నేను అసహాయురాలను, ధీనురాలను. బలాత్కరించగా నేనేమి చేయగలను ఆబలను. చాటుగా, పిరికితనంగా అలా తెచ్చాడు. అదేవిధంగా చాటుగా పారిపోవటం నాకూ, నీకూ, రామునకూ గౌరవప్రదం కాదు. బలపరాక్రమోపేతుడై రాముడు రావణుని వధించి నన్ను తీసుకుపోవుట న్యాయమార్గం.


తల్లీ ! నీ మాటలు పతివ్రతా లక్షణాలకూ- స్త్రీ స్వభావాను గుణంగా ఉన్నాయి. రాముని వినా పర పురుషుని తాకనని పల్కుట నీకు చెల్లినదిగాని మరెవరు ఇట్టి మాటలు పలుకగలరు? స్వయముగా రాముడేతెంచి క్రూర రక్కసుల పీచమణచి నిన్ను తీసుకు వెళ్ళుటయే ధర్మ సమ్మతం. "నేను వాయువేగ, మనో వేగాలతో వెళ్ళి రామ లక్ష్మణుల ముందు వాలతాను "అని హనుమంతుడు పల్కగా


No comments:

Post a Comment