Friday 23 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (59)



తమ రాజు "నోటినుండి యీ మాట వచ్చినదే తడవుగా రాక్షసులు పాత బట్టలు తెచ్చి నూనెలో ముంచి తోకకు చుట్టి అగ్ని నంటించగా భగ భగ మండే అగ్ని జ్వాలలు వెనువెంటనే విను వీధిని తాకినవి. ఈ వింత చూడ రాక్షస, రాక్షసీ గణము తమ తమ ఇళ్ళనువీడి వీధిలోకి రాసాగింది. మారుతి మండే వాలం ఎత్తి కొందరిని చావమోదాడు. కొందరు రాక్షస స్త్రీలు యీ వార్తను సీత చెవిన వేయగా- దుఃఖించినదై అగ్ని వలన వాయుకుమారునకు ఏ కీడూ జరగరాదని, “అతనికి చల్లదనము కలిగించ" మని అగ్నిదేవుని ప్రార్థించింది. ఆమె అభ్యర్ధనమును మన్నించినట్లుగ హనుమానునికి వెచ్చదనమునకు మారుగా వాలము శీతలముగనే యున్నది.


అటులుండుటకు ఆనందాశ్చర్యాలను పొందిన పావని "అగ్ని సఖుడైన తన తండ్రి వాయువు వలన గాని, ఆ రఘురాముని వలనగాని ఇలా జరిగి ఉంటుందని” భావించి తన దేహాన్ని కుంచింప చేసుకుని, కట్లను తెంచుకుని ఈ రాక్షసులు నన్ను ఏ అగ్నితో మర్యాద చేశారో ఆ అగ్నితోనే వారికి మర్యాద చేస్తాను అని ఉత్సాహంగా ఒక్కసారి కుప్పించి పైకెగరి ఒక భవనం పైనుండి మరో భవంతి పైకి దూకుతుంటే, ఆ భవనాలన్నీ ఫెళ ఫెళార్ఫటులతో మంటలంటుకుని జ్వాలామాలికా తోరణాలయ్యాయి. ప్రహస్తుడు, రశ్మికేతుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మొదలగు రాక్షస వీరుల ఇళ్ళన్నీ క్షణాలమీద అగ్నికి ఆహుతి కాసాగినయ్. ఎటుచూచినా- రాక్షసుల ఆక్రందనలే విషాద గీతాలే. 


"వామ్మో! వీడెవడో!! ఇంద్రుడో! బ్రహ్మో! నిర్జర నాథుడో! "వామ్మో! అయివుంటాడు. చూస్తుండగానే లంకకు ఎంత చేటు వచ్చింది" అని వాపోతూ రాక్షసులు విలపింపసాగారు.


పశ్చాత్తాపం .. ఆత్మ పరీక్ష


మిన్నంటే రాక్షస హాహాకారాల మధ్య లంకంతా అగ్నికి ఆహుతికాగా అంజనీ సుతుడు లాంగూల జ్వాలను సముద్ర జలాల చల్లార్చుకుని వెనుదిరిగి చూడగా ఆగ్నికి ఆహుతి అయిన లంకా నగరం హృదయ విదారకంగా కన్పించింది. అంతలోనే ఆశోకవనాన సీత గుర్తురాగా- “తానెంతో తప్పు చేయటం జరిగింది. ఆవేశంలో ఆశోకవనంలో సీతామాత ఉన్న సంగతి గుర్తించలేక పోతినే! ఎంత దారుణానికి ఒడిగట్టాను. తానింతగా కష్టపడింది ఇందుకోసమేనా!" అని తన పనిని గూర్చి తాను వితర్కించుకుంటూ


ధన్యాస్తే పురుషశ్రేష్ఠాయే బుద్ధ్యా కోపముత్థితం 

నిరుంధంతి మహాత్మానో దీప మగ్ని మివాంభ సా. 

క్రుద్దః పాపం న కుర్యాత్కః క్రుద్దో హన్యాద్గురూనపి 

క్రుద్ధః పరుషయా వాచా నర స్సాధూ నదీక్షి పేత్ . 

వాచ్యా వాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్ 

నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్.


ఆగ్రహావేశాలతో తాను చేసిన పని ఇది. జ్వాజ్యల్యమానంగా వెలుగొందే అగ్నిని నీటితో చల్లార్బినటుల - హృదయ కుహరాల నుండి ఉవ్వెత్తున ఎగిరే ఆగ్రహ జ్వాలలను క్షమాగుణంతో ఆర్పువాడే మహాత్ముడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలలో రెండవది క్రోధం. అంటే కోపం. క్రోధి ఎంతటి దారుణానికయినా వెనుదీయడు. మహా పాప కార్యమైన గురుహత్యకు పాల్పడతాడు. కఠినమైన అతని వాక్కులు గుండెకు మానని గాయాలు. సాధు, సజ్జనులకు కోపగాని మాటలు ఱంపపు కోతలు. మంచి చెడుల విచక్షణ, పాపభీతి- అసలే ఉండదు. నోటికి వచ్చినదెల్ల పలుకుతాడు. చేతకు వచ్చినదెల్ల చేస్తాడు.


No comments:

Post a Comment