Saturday, 17 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (53)



ఈ రీతిగా ఆంజనేయుడు చిత్ర విచిత్ర గతులతో చెట్లు పెకలించి, విసిరివైచి, గోళ్ళతో చీల్చి, పిడికిళ్ళతో పొడిచి, కాళ్ళతో మర్దించి, బిగ్గరగా అరచి వీర విహారం చేస్తూ తనపై దాడిచేసిన శత్రువులను మట్టుబెడుతున్నాడు.


రావణుని మదినిండా కలవరం, కలకలం. తాను పంపిన ప్రతి యోథుడూ మరలి వచ్చుటన్నది లేదు. బ్రతికి బట్టకట్టగలి గినవాడు లేడు. తనకూ, తనవారికి రణరంగమంటే కందుక క్రీడ. ఓటమి యెరుగని యోధాను యోధులు ఒక్క కపికి ఆహుతి అయ్యారు. ఇపుడేం చేయాలి అని ఆలోచిస్తుండగా ఆ వానరుని బంధించగలవాడు తన పెద్ద కొడుకు ఇంద్రజిత్తే ననిపించింది. ఇంద్రజిత్తు మహావీరుడు. సుర నాయకుని (ఇంద్రుని), సకల దేవతలను గడగడ లాడించినవాడు. ఎందరో శత్రువులను మట్టి కరపించిన ఇంద్రజిత్తుని రావించి, "కుమారా! ఈ కోతి సామాన్యమైనది కాదు. ఇతని ముందు మన సేనలు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. వజ్రాయుధం సైతం పనిచేయుట లేదు. గతంలో నేనెందరినో హరి వీరులను చూచాను. జాంబవంతుడు, వాలి సుగ్రీవులు, మైంద, ద్వివిదుడూ - మొదలైనవారి బల ధైర్య, సాహసాలను నేనెరుగుదును కాని వారెవ్వరిలో లేని యుద్ధ గతి, పరాక్రమోత్సాహాలూ, రూపగుణ విశేషాలూ యీ వానరంలో కనిపిస్తున్నాయి. చూడగా ఒక పెనుభూతం యీతని రూపంలో వచ్చినట్లు తోస్తున్నది. అతనిని తేలికగా తీసుకోరాదు. అతనిపట్ల ఏమరు పాటు తగదు. బాహాబాహీ పోరు పనికిరాదు. బ్రహ్మాస్త్రం పొందిన నీవు తప్ప మరెవరూ అతని ధాటికి తట్టుకోలేరు. అతని ప్రతి కదలికా గమనిస్తూ- పట్టి బంధించు. విజయుడవై తిరిగి రా” అని హనుమంతునిపై యుద్ధానికి పంపాడు. 


ఇంద్రజిత్తు అత్యుత్సాహముతో పవన కుమారుని తాకెను. ఇరువురకు పోరు ఘోరముగ సాగినది. ఇంద్రజిత్తు క్షాత్ర విద్యలు, మాయా విద్యలు మాయలు నేర్చిన ఆంజనేయుని ముందు నిర్వీర్యము లయినవి. మహావీరుడైన మారుతి రణపాండితికి మేఘ నాథుడు ఆశ్చర్యపడి, మిగిలిన బ్రహ్మాస్త్రమును ప్రయోగించినాడు. బ్రహ్మ వరం పొందిన ఆంజనేయుని బ్రహ్మాస్త్రం బంధించలేదు. కాని రావణుని చూడతలచి తానే ఇచ్చాపూర్వకంగా బంధీ అయ్యాడు.


No comments:

Post a Comment