Wednesday, 28 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (64)


రాముని అభినందన


అని చెప్పుచున్నంతలో గగనాన కిలకిలారావాలు, ఉత్సాహ సింహనాదాలు సుగ్రీవునికి శ్రవణానందం కాగా, పర్వదినాలలో పొంగే సముద్రుని వలె ఆనందభరితుడై వాలం (తోక) పైకెత్తాడు. అంగదాది వానర వీరులు ఉల్లాసంగా భూమికి దిగి రాముని ముంగిట నిలచారు. 'దృష్టా సీతా' అంటూ వినమ్రుడై రామునికి నమస్కరిస్తూ మారుతి చెప్పాడు. పావని మాటలు రామ లక్ష్మణులను ఆనందవార్థిలో ముంచెత్తినవి.


రావణాంకఃపురే రుద్ధా రాక్షసీభి స్సురక్షితా 

ఏకవేణీధరా దీనా త్వయి చింతా పరాయణా 

అధశ్శయ్యా వివర్ణాఁగీ పద్మినీవ హిమాగమే 

రావణా ద్వినివృత్తార్థా మర్తవ్య కృతనిశ్చయా 

దేవీ కథంచిత్ కాకస్థ త్వన్మనా మార్గితా మయా.


రామచంద్రా! లంకా నగరమంతా గాలించి రావణాంతఃపుర అశోకవనంలో వికారాకారులైన రాక్షసీగణము చుట్టూ ఉండగా, చిక్కి శల్యమైన జానకిని చూచాను. ఏకవేణీ ధారిణి, దీనురాలై నీ పై చిత్త ముంచి - సదా నిన్నే స్మరించుచు, కటిక నేలపై నిద్రిస్తూ వివర్ణమై హేమంతకాల పద్మినిలా రావణుని చూడటం ఇష్టం లేక మరణమేమె శరణ్యమని తలచిన మైధిలిని చూచాను అంటూ మొదలు పెట్టి- ఆమెకు నమ్మకమును కలిగించుటకు తాను చేసిన ప్రయత్నము- తనపై విశ్వాసముంచి ఆమె చెప్పిన కాకాసుర కథ, మనశ్శిలాతిలక వృత్తాంతం చెప్పి ఆనవాలుగా సీతామాత ఇచ్చిన చూడామణిని ఇస్తూ సీతా సందేశం కనులకు కట్టినట్లు వినిపించగా రాముడు చూడామణలో సీతను చూస్తున్న అనుభూతిని పొంది కేసరి తనయుని అభినందిస్తూ -


కృతం హనుమతా కార్యం సుమహత్ భువి దుష్కరం

మనసాపి యదన్యేన న శక్యం ధరణీతలే. 



హనుమంతుడు అమిత శక్తిసంపన్నుడూ, ప్రాజ్ఞుడూ కావున లంకానగరం చూచి తిరిగి రాగలిగాడు. ఇతరులు దీనిని మనసున కూడా ఊహించనైనా ఊహించలేరు. సాగరయానం చేయగలవారు గరుత్మంతుడు, వాయుదేవుడు, వారికి సరిజోడు యీ హనుమంతుడు.

దుష్కర కార్యమునందు నియుక్తుడై యజమాని ఆజ్ఞను సమయానికి తగినరీతిగా నిర్వర్తించి వచ్చు సేవకుడు ఈ ఉత్తముడు. యజమాని కార్యమును చెప్పినంతవరకే సమర్ధతగా నిర్వహించి వచ్చు సేవకుడు మధ్యముడు. స్వామి కార్యమును చెప్పినంత వరకైనా నెరవేర్చజాలని వాడూ అధముడు.

No comments:

Post a Comment