వాక్య విశారదుడు
ఇక తనకు మరణమే శరణమని, ఆ క్రూర రాక్షసాధముని చేతిలో మడియుట కంటె ప్రాణత్యాగమె మంచిదని భావించి తన జడను ఉరిత్రాడుగ చేసుకుని ప్రాణోమణమునకై ప్రయత్నించుచున్నది.
తాను సీతతో సంభాషించుటకు ఇదే తగిన సమయమని, ఏ కొంచెం ఆలస్యం చేసినా ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని తగిన సమయానికై వేచియున్న మారుతి ఇటులాలోచించసాగాడు. నేనిపుడీమెతో ఎలా మాటలాడవలె? ఈమె నేవిధముగ ఊరడించవలె? ఆత్మహత్యా ప్రయత్నానికి సిద్ధపడిన సీతను విరమింప చేయాలి. లేదేని రామ లక్ష్మణులు వచ్చి ఇచట చేసేదేముంది ? సమయం మించిపోవుతున్నది. కాలయాపన చేయరాదు. సరే నేను వానరుడను. ఈ రూపాన యీమెతో మాటలాడ తగదు. పోనీ సంస్కృతమున మాటలాడుదమన్న- ద్విజుడైన రావణుని మాయా రూపముగా భావించునేమో! కనుక 'అవశ్యమేవ వక్త వ్యం మానుషం వాక్యమర్థవత్' మనుష్య భాషలోనే సంభాషించుట తగియున్నది. నా వేషభాషలు ననుమానించి యీమె పెద్దగ అరచినచో ఎచటెచటనో నున్న రాక్షసులందరును ఒక్కటైనా మీదకు వచ్చిన ఆత్మరక్షణార్థం పోరు సాగించక తప్పదు. జయాపజయాలు దైవాధీనాలు అన్నమాట అటుంచి వచ్చిన పని జటిలమగును. దూతలు దేశకాల పాత్రానుగుణంగా ప్రవర్తించుట న్యాయం. కాదేని పరిస్థితి మరోలా ఉండవచ్చు. తొందరపడి ఉద్రేకానికి లోనైతే- అదే అన్ని అనర్థాలకూ మూలం అవుతుంది ఆనుకుంటూ -
No comments:
Post a Comment