Monday, 26 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (61)



ఈ విషయాన్నే ఒక కవి ఇలా చెప్పాడు.


చేయకుఁడ జేసితినని చెప్పునాత

డధముడు, రవంతజేసి కొండంతచేసి

నాడననువాడు గర్వి యెంతయో యొనర్చి 

సుంత జేసితి ననువాడు సుజను డిలను. 


ఆంజనేయుడు - ఉత్తమ వార్తాహరుడు 


తతః కపిం ప్రాప్త మనోరథార్థ 

స్తామక్షతాం రాజసుతాం విదిత్వా 

ప్రత్యక్షత స్తాం పునరేవ దృష్ట్వా 

ప్రతి ప్రయాణాయ మతిం చకార . 

తతస్త శింశుపా మూలే జానకీం పర్యుపస్థితాం 

అభివాద్య అబ్రవీద్దిష్ట్యా పశ్యామి త్వామిహాక్షతాం.

మరల తిరిగి ఒక్కసారి సీతామాతను దర్శించు కోరిక కలిగింది. వెంటనే ఒక్క ఉదుటున అశోకవనం చేరి శింశుపా వృక్ష చ్ఛాయలో నున్న జానకీ మాతకు నమస్కరించి ఆమె ఆశీస్సుల నంది కిష్కింధ కేగనెంచి ప్రస్రవణ పర్వతం పైనుండి ఉత్తర దిక్కుగా పయనించసాగాడు. సమధికోత్సాహంతో ఆంజనేయుడు రామబాణంలా ముందుకు సాగిపోతూ మార్గమధ్యాన మైనాకుని పలకరించి, మహేంద్రగిరి సమీపం చేరబోతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా మేఘధ్వనిని బోలిన ధ్వనిని చేశాడు. ఆ గంభీర ధ్వని విని జాంబవంతుడు “మన మారుతి సీత జాడ తెలుసుకుని వస్తున్నాడు. అందుకే విజయధ్వనిని సంకేతంగా చేశాడు. నిస్సందేహంగా ఆ ధ్వని ఆంజనేయునిదే" అని వానరులకు తెల్పగా- అవధి లేని ఆనంద తరంగాల తేలియాడారు వానరులు. చెట్ల కొమ్మలను ఊపుతూ, పెద్ద ధ్వనిచేస్తూ, కేకలు వేస్తూ, కిలకిలారావాలు చేస్తూ తోకను పైకెత్తి నేలకేసి కొడుతూ, తమ బట్టలను చింపుకుంటూ ఆంజనేయునకు మధుర ఫలాలను అందింప చూస్తున్నారు. ఈ రీతిగా ఆ ప్రాంతమంతా ఎటుచూసినా వానరులు ఆనంద కోలాహలంతో నిండిపోయింది.


ఆంజనేయుడు క్రిందికి దిగబోతూ “దృష్టా సీతౌతి విక్రాంతః సంక్షేపేణ న్యవేదయత్". చూచాను సీతను అశోకవనంలో అంటూ సంక్షేపంగా, సవివరంగా అచటి వార్తలను చెప్పగా “దృష్టేతి వచనం మహార్థం అమృతోపమం" చూచానన్నమాట అచటి వారందరికి అమృతోపమానమైంది. ఆంజనేయుని సాహస కృత్యాలు వారిని అబ్బురపరచినవి. ఆనందసంద్రాన వారు పొంగిపొంగి ఉప్పొంగారు. మారుతిని ఎంతగానో ప్రశంసించారు.


ఇచట హనుమంతుని వచోనైపుణ (మాటల నైపుణ్యం) గమనింపతగినది. ఆంజనేయుడు వారిని వీడి వెళ్ళినది మొదలు, వేయి కనులతో సీతా మాత కనిపించినదన్న వార్త తెచ్చు పవన కుమారుని మాటకై నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్నారు. తనను చూడగనే వారికి పోయిన ప్రాణాలు లేచివచ్చినట్లవుతుంది. అటువంటప్పుడు వారికే అనుమానం రానివిధంగా సంతోషం కలిగించే మాట ముందు చెప్పాలి. అందుకే 'సీతను చూచాను' అనలేదు,' చూచాను సీతను’ అన్నాడు. సీతను అనీ అనకముందే వ్యధాకులిత హృదయులై వానరులు సీతకేదో ప్రమాదం జరిగిందనే ఆవేదనకు లోనవుతారు. వారినలా నొప్పించరాదు. 'చూచాను' అని అంటే 'అమ్మయ్య' సీత కనిపించింది అని ఆనందపడతారు. ఇదీ మాటకారితనం అంటే!


No comments:

Post a Comment