Tuesday 27 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (63)



వానరులందరూ రామ సందర్శనాభిలాషులై కిష్కింధకు పయనమయ్యారు. కిష్కింధ పాలిమేర చేరబోతుండగా - మధు వనం కనిపించింది. అందలి మధువును ఆస్వాదింపకోరారు వానర వీరులు. అంగదుని అంగీకారంతో మధువనం వానరవీరుల కానంద నాట్యరంగ స్థలమైంది. మధు రసాస్వాదన మత్తులో కొందరు ఆడగా- కొందరేమో పాటల పల్లవి అందుకున్నారు. కొందరైతే విరగబడి నవ్వసాగారు. ఇంకొందరు వదరుబోతులై అర్థమే లేని మాటలతో గారడీ చేయసాగారు. వన సంరక్షకుడూ, సుగ్రీవుని మేనమామా దధిముఖుడూ, అతని పరివారం మధుపాన మత్తులై మతులుపోయి మ్రానులను ముక్కలు చేసే వానరులను చూచి మ్రాన్పడి– అంతలో తేరుకుని కర్తవ్యం గుర్తురాగా అడ్డగించారు. సమధికోత్సాహాలకు మధుమత్తు తోడుకాగా వానరులు వన సంరక్షకులను చిత్రవిచిత్ర భంగిమలతో చితకగొట్టారు. వనపాలకులు పిక్కబలంతో పరుగు లంఘించుకున్నారు. తమ ప్రభువు సుగ్రీవునికీవార్త చెవినవేయగా - దధిముఖునితో సుగ్రీవుడు “మామా! అంగద జాంబ పంత హనుమదాది వానర వీరులు సీతను చూచారు. సందేహం లేదు. ఆ ఆనందంతో అలా చేశారు. వారి దోషం ఏమీ లేదు. వారిని మన్నించు. వారిని వెంటనే సాదరంగా, హృదయ పూర్వకంగా ఆహ్వానించు. రామ లక్ష్మణులు, నేను ఆ వానర వీరులను చూడగోరుతున్నామని చెప్పు" అని పంపి రామునితో


కౌసల్యా సుప్రజా రామ సమాశ్వసిహి సువ్రత 

దృష్టా దేవీ న సందేహెూ న చాన్యేన హనూమతా. 

నహ్యన్సస్సాధనీ హేతుః కర్మణోస్య హనూమతః 

కార్యసిద్ధి ర్మతి శ్చైవ తస్మివ్వానర పుంగవే 

వ్యవసాయం చ వీర్యంచ వ్రతం బాపి ప్రతిష్టితం.


గల వానరులెవ్వరూ లేరు. గడువుదాటి వస్తున్నారంటే- నిస్సందేహంగా సీతామాత జాడ తెలుసుకున్నారన్నమాటే. పైగా మహోత్సాహంగా- మాతాత ముత్తాతలనుండి కంటికి రెప్పలా కాపాడుకునే మధువనం ధ్వంసం చేశారంటే కార్యసాధనా మహోత్సాహమే కారణం.


ఈ కార్యసాఫల్యతలో ప్రధాన పాత్రధారీ, సూత్రధారి హనుమయే, అతనిలో కార్యసిద్ధికి కావలసిన శక్తియుక్తులు, సఫలతా ప్రయత్నము, పరాక్రమము - పైగా శాస్త్ర పాండిత్యావగాహన పుష్కలంగా ఉన్నాయి. హనుమయే సీతను చూచి ఉంటాడు. దృష్టా సీతా న సందేహః 


No comments:

Post a Comment