Saturday, 31 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (67)



విభీషణ శరణాగతి == ముందు చూపు


లంకా నగరాన రావణునితో “యుద్ధము తగదని, సంధి చేసు కొమ్మని, అన్నీ అశుభ శకునాలే కనిపిస్తున్నాయని" తన శక్తి వంచనలేక ఎంతగానో సమరము నాపనెంచిన విభీషణునికి తిరస్కారావమానాలే ఎదురుకాగా- తన సహచరులతో రాముడున్న తావునకు వచ్చి శరణు వేడినాడు. సుగ్రీవాది వానర వీరులు విరోధి సోదరుడు కాన ఇతనికి శరణ మిచ్చుటకు ఇది తగిన సమయము కాదని తమ తమ వాదనలను వినిపించగా ఆంజనేయుడు విభీషణుని అంతరంగాన్ని అవలోకించి అరి (శత్రు) వర్గమునకు చెందిన వాడైనా ఇతని హృదయం ధర్మబద్ధం. ఇతనిలో ఏ దోషం లేదు. ఆశ్రయమీయ తగునని నయబుద్ధితో వివరించి శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయినాడు.


గతాన్ని నెమరువేస్తూ, వర్తమానాన్ని చూస్తూ, భావిని ఊహించగలవాడే భవిష్యత్తులో సుఖసంతోషాల నందగలడు. సలహాల నిచ్చువారు తమ యజమానులకు మేలు జరుగురీతిన ప్రజ్ఞా పాటవాలతో భవిష్యత్కాలాన్ని దృష్టిలో ఉంచుకొని బాగోగులు విచారించి సలహా, సంప్రతింపులు జరిపిననాడు అటు యజమాని సత్ఫలితాల నందగలడు. ఇటు అ సేవకునిపై యజమానికి గౌరవభావం ఇనుమడించును. ఇచట బుద్ధి విశేషం ప్రధానం. స్వార్థమే లేని పదార్థం ప్రధానం. నేటికాలాన ముఖ్యంగా కీలకమైన పదవులలో నున్నవారు ఆంజనేయుని ధీవైభవాన్ని ఏ కొంచెం గ్రహించినా ప్రభుత పడిపోదు. తిరోగమన పథంవైపు సాగదు. ప్రగతిపథాన నడుస్తుంది. ఎటుచూచినా స్వార్ధం, స్వార్థం, స్వార్థం తప్ప పరార్థం కానరాదే. చూడండి హనుమ అందరివలెకాక రాబోవు రామ, రావణ యుద్ధంలో శత్రువుల రహస్యాలు, వారి జవజీవ రహస్యాలన్నీ తెలిసిన విభీషణుని అవసరం ఎంతో ఉందని గ్రహించిన ప్రాజ్ఞుడు కాననే శరణమీయ తగునని సలహా ఇచ్చినాడు. ఈ సన్నివేశం దృష్టిలో ఉంచుకొనే ఏమో!! "ఇంటి గుట్టు లంకకు చేటు" అన్న సామెత వచ్చియుండును. ఎదుటివాని మనసును గ్రహింపగలది ఒక్క బుద్ధి విశేషమే. ఆది హనుమంతునికి వెన్నతో పెట్టిన విద్య. బుద్ధి వైభవాన్ని తెలిపే ఒక పద్యం మన సాహిత్యంలో ఉంది. గమనించండి. 


వాయువు దూరని చోటను 

తోయజ బాంధవుని రశ్మి దూరని చోటన్ 

దీయుతుల బుద్ది దూరుని

రాయాసంబునను కార్యమగు తద్బుద్దిన్.

No comments:

Post a Comment