Friday 30 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (66)



ఆంజనేయుని.. లంకానగర శోధనా వివరణ 


నగరానికి సమాయత్తమవుతూ రాముడు “ఆంజనేయా! లంకా నగరాన్ని రాక్షసులెలా రక్షిస్తున్నారు. వారి బలగం, ఆయుధ సంపత్తి ఎంత వివరంగా చెప్ప” మనగా -


హృష్టా ప్రముదితా లంకా మత్తద్విప సమాకులా

మహతీ రథ సంపూర్ణా రక్షో గణ సమాకులా

వాజిభిశ్చ సుసంపూర్ణా సా పురీ దుర్గమా పరైః

దృఢబద్ధ కవాటాని మహా పరిషువంతి చ. 


“రామా! లంకానగర వైభవం వర్ణనాతీతం. ఆ నగరవాసులు చీకూ చింతాలేనివారు, కడుపులోని చల్ల కదలకుండా సుఖమయ జీవనయానం సాగిస్తున్నారు. సలలిత రాగ సుధారస గానాలతో సర్వ కళామయ నాట్యవిన్యాసాలతో విరాజిల్లే లంకా పట్టణం - వేనవేల రథాలతో, ఏనుగులతో, గుఱ్ఱాలతో అలరారే స్వర్ణమయి.


ఇక యీ లంకా నగరానికి నలుదిక్కుగా నాలుగు ద్వారాలు. వాటికి అభేద్యమైన కవాటాలు, వాటికి రాళ్ళూ, బాణాలూ వర్షించే యంత్రాలు, బల పరాక్రమాలుగల సాయుధపాణుల కాపలా, ఆ నగర ప్రాకారం బంగారుమయం. ప్రాకారాన్ని చుట్టుముట్టిన అగడ్త. నిరంతరం నిండుగా ప్రవహించే నీరుగల అగడ్తలవి. లంకా ప్రవేశ నిర్గమాలకు నలువైపులా వేలాడే వంతెనలు- వాటిని వాల్చటానికి, ఎత్తటానికి యంత్రాలు, ఇది శత్రు దుర్భేద్యం.


నేను ఆ నాలుగు వంతెసలను విరగగొట్టాను. అగడ్తలను నామరూపాలు లేకుండా పూడ్చివేశాను. ప్రాకారం రూపురేఖలు లేకుండా చేశాను. భవనాలన్నీ భస్మీభూతం చేశాను. ఇక మన ముందున్న తక్షణ కర్తవ్యం సముద్రాన్ని దాటడం" అన్నాడు ఆంజనేయుడు.


ఇచట హనుమానుని బుద్ధి వైభవం గమనింపతగినది. తాను లంకా పరిసరాలను పరీక్షగా పరికించాడు. సామ, దాన, భేదో పాయాలకు లొంగని రాక్షసులను అశోకవన ధ్వంసంతో వారిపై దండోపాయం ప్రయోగించాడు. లంకానగర రహస్యాలు కనుగొన్నాడు. పూర్తి అవగాహనతో గుర్తు పెట్టుకున్నాడు. అవసర సమయాన వినియోగించుకున్నాడు. ముందుచూపు కలిగినవాడు కాబట్టి భావికాలాని కనుగుణంగా ప్రవర్తించి ఉత్తమ దూతగా రామునిచే ప్రశంసింపబడినాడు.


కారణాంతరాల వలన మనం ఏదైనా సరికొత్త తావునకు వెళ్ళుట జరిగితే- ఆ ప్రదేశం పూర్తి సమాచారాన్ని, అచటివారిని మంచి మాటలతో అలరించి తెలుసుకోవాలన్నమాట. అవసరమై నంతమట్టుకే కొందరి ప్రవర్తన ఉంటుంది. అలా చేయరాదు. దీర్ఘ దర్శివోలె ఆ ప్రాంతపు టానుపానులను పూర్తిగా గ్రహించ ఆ గలగాలి.

No comments:

Post a Comment