యథా రూపాం యథా వర్ణాం యథా లక్ష్మీం చ నిశ్చితాం
అశ్రేషం రాఘవస్యాహం సేయ మాసాదితా మయా
విరరామైన ముక్త్వాసౌవాచం వానర పుంగవః.
ఇపుడిచట రాముడు వర్ణించి చెప్పిన రూపురేఖలున్న సీతా దేవిని నేను దర్శించుచున్నాను అని పలికి మౌనం వహించాడు.
తలవని తలంపుగా యీ లంకలో ఇంతగా చెవులకింపుగా నిజమైనా, కలయైనా నిరాశలో ఒకటే అనుటను తలక్రిందులు చేస్తూ రామకథను వినిపించినది ఎవరా అని ఆనందముప్పొంగ చేతిలోని కేశపాశాన్ని విడిచి విప్పారిన కనుదోయితో తలపైకెత్తి చెట్టు పైకి పరికించి చూచింది జానకి.
తననే చూచుచున్న సీత మనసు నెరిగినవాడై పవన తనయుడు మెల్లగ పైనుండి దిగివచ్చి వినయ విధేయతలుట్టిపడ కేల్మోడ్చి -
అమ్మా! నీవెవరవు? ఈ చెట్టు నీడన శోకమూర్తివై నిలబడి ఎందుకిలా దిగాలుగా నున్నావు? అంత కష్టం నీకేమిటమ్మా ? సురాసుర నాగ గంధర్వ యక్ష కిన్న రాంగనవై యుందువా ? చంద్రుని వీడిన రోహిణివా? కోప తాపాలతో భర్తను వీడి వచ్చితివా ? వశిష్ఠునిపై అలిగి వచ్చిన అరుంధతివా ! చూడగా నీవు మానవ కాంతవోలె కన్పట్టుచున్నావు? రాచకన్నియ వనుకొందును. జన స్థానమున రావణుడపహరించిన సీతవు కావుకదా! అదే నిజమైన 'త్వమసి భద్రం తే' నీకు శుభమగు గాక!
ఇది పవన కుమారుడు సీతను గాంచి భాషించ మొదలిడిన సన్నివేశం.
No comments:
Post a Comment