Tuesday 6 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (43)



తతస్సీతాం ఉపాగమ్య రాక్షస్యో వికృతాననాః 

పరుషం పరుషానార్య ఊచుస్తాం వాక్యమప్రియం.


రావణుడు అలా వెళ్ళాడో లేదో వెంటనే చుట్టుముట్టారు సీతాదేవిని రాక్షస స్త్రీలు. తమ స్వామి ఆదేశానుసారం వివిధ రీతుల భయ పెట్టసాగారు. వారి మాటలు సీతాదేవికి కంటక ప్రాయమై, తనను మాటలతో హింసించవద్దని, కావలిస్తే చంపి తినండని ఎంతగ బ్రతిమాలినా ఆ రక్కసి మూక వినిపించుకోదయ్యె. వారిని తప్పించుకుని ఆంజనేయుడున్న శింశుపా వృక్ష చ్ఛాయ నాశ్రయించింది ఆ వికార రూపసులు అక్కడకు చేరి కర్ణకఠోరమైన వాగ్బాణాలతో వేధింపసాగారు. వారి మాటలు విన లేక తన విధికి ఎంతగానో విలపించింది. రామ లక్ష్మణులను, కౌసల్యా సుమిత్రలను పేరు పేరునా తలచుకుని, అందరూ ఉండి కూడా లేనిదాననై నశించుచున్నాననుకుంది.


ప్రసక్తా శ్రుముఖీత్యేవం బ్రువంతీ జనకాత్మజా 

అధోముఖ ముఖీ చాలా విలప్తుముపచక్రమే.


తీరమే కానరాని “అగాధ నడిసంద్రాన త్రోయబడినదాని" వలె, కుమిలి కుమిలి దుఃఖించి, ఇంకను 'ఉన్మత్తురాలి వలె' విలపించింది.


ఇదంతా చెట్టుకొమ్మల ఆకుల సందులనుండి పవన తనయుడు చూచుచునే ఉండెను.


నిద్రపోతున్న త్రిజట అను రక్కసి మేల్కాంచి, సీతను భయపెడుతున్న రాక్షస గణాన్ని వారించి, తాను కన్నకలలోని దృశ్యాలను వివరించి చెప్పింది. ఆ స్వప్న వృత్తాంతం వింటూనే నిద్రలోకి జారుకున్నారు రాక్షస స్త్రీలు.


No comments:

Post a Comment