Tuesday, 13 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (49)



మరల జానకి సంశయగ్రస్తురాలైనది, “వానర సేనలో నీవలె బలశాలు లెంతమంది ఉండగలరు? వేళ్ళమీద లెక్కింపదగిన వారు ఒకరో ఇద్దరో ఉండియుందురు. అటువంటప్పుడు యీ రాక్షస సేనావాహినిని జయించుట రామ లక్ష్మణులకు సాధ్య మగునా! అసలు లంకకు చేరగలరా!" అని చింతించి వగచే ఆమె మనోగతాన్ని గమనించి పావని -


"అమ్మా! రామ లక్ష్మణులను నా వీపుపై నెక్కించుకు రాగలను. ఇక వానర, భల్లూక వీరుల సాటిరాగల వారెవరూ యీ లంకలో లేరు. వానర సేనలో నాతో సమానులూ, నన్ను మించిన పరాక్రమశాలురే అందరూ. నాకన్న తక్కువవారు లేనేలేరు. నా వంటివారే యీ సముద్రాన్ని దాటిరాగా, నాకంటె బలశాలుర గురించి ఇక వేరుగ చెప్పవలెనా! సామాన్యంగా దూత కృత్యానికి ఆల్పులను మాత్రమే పంపుతారు. బలశాలురను పంపరు. కనుక శంకారహితవు కమ్ము. స్వస్థత పొందుము. “క్షిణ దుఃఖ ఫలా హ్యసి" “త్వరలోనే దుఃఖ ముపశమించును గాక!"


హనుమంతుని ధైర్య వచనాల నాలకించి జానకి సంతోషంగా "వాయునందనా! నాకు ఆనందం కలిగే మాటలు వినిపించినావు. నిన్ను చూచుటతోనే గ్రీష్మ తాపానికి వాడిపోయి వాన జల్లుకు కలకలలాడే పంట చేనులా- ఆనందంతో నా మనస్సునకు కొంత ఊరట కలిగింది" అన్నది.


ఈ సన్నివేశం ఆలోచనాత్మకంగా చూడవలసినది. జానకి అనుమానాలు, వానిని మారుతి తీర్పిన విధానాలు నేటి సమాజానికి క్షణక్షణావసరాలు.


నిర్వేదంలో, నిస్సహాయతలో ఉన్నవారినెలా ఓదార్చాలి. వారితో మాట్లాడే విధానం గాయపడినవారి గాయాన్ని మాన్చే సంభాషణా రీతీ, మాటల సందర్భంలో తనకేదయినా బాధాకర విషయం ఎదుటివారినుండి ఎదురైతే- వారు నొచ్చుకోనిరీతిగా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం- కార్యసాధనకు అవసరమనుకుంటే సంశయగ్రస్తమయినవారికి ధైర్యోత్సాహాలు కలగడం కోసం వినయంగా ప్రవర్తించడం- ఎదుటివారి మాటలలోని మంచితనాన్ని గౌరవించడం- కార్య సాఫల్యత కోసం 'తనను మించినవారు లేరని తెలిసినా- పౌరుష ప్రదర్శన కాక వినయ గుణాన్ని నయంగా చూపుట, అణకువతో ఆత్మాభిమానం కలిగి ఉంటూనే తానాశించిన ప్రయోజనాన్ని పొందటానికి తనను తాను తక్కువ చేసుకున్నా నష్టం లేదన్నమాట. అంతేకాని ఎదిరిమాటలు నెదిరించి నేనంత గొప్పవాణ్ణి, ఇంత గొప్పవాణ్ణి, సరిలేరు నాకెవ్వరూ అని మొదలిడితే కార్యభంగం అని తెలిసి ప్రవర్తించాలి. ఇన్ని విధాల ఆలోచనలతో సమయ సందర్భము లెరిగి నడచుకోవాలి సుమా అన్న సందేశాన్ని అందించాడు మారుతాత్మజుడు.

No comments:

Post a Comment