Wednesday 21 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (57)



ఇక దేవదానవుల వలన అపజయ మెరుగని వరం పొందిన నీవు నర, వానరజాతివారైన రామ లక్ష్మణుల చేతిలో చావు కోరి తెచ్చుకోకు. వానర, భల్లూక వీరులు వందల, వేల ఏనుగుల బలం కలవారు, నీ సేనాబలం వారి ఎదుట నిలబడలేదు. ఇంతెందుకు నా ప్రభువాజ్ఞ లేదుగాని, ఉన్నచో నేనొక్కడనే చాలు, నిన్ను, నీ రాజ్యాన్నీ సర్వనాశనం చేయటానికి.


కాన ఓ రాజా! కడసారి చెప్పు నా హితోపదేశాన్ని ఆచరించు. నీకై అందరి ప్రాణాలను ఫణంగా పెట్టకు. లంకకు చేటు తీసుకు రావద్దు. రాము నెదిరించ దేవ, దానవు లెవరూ సమర్థులు కారు. రాముడు - ఎన్ని తప్పులు చేసినా శరణన్నవానిని కాపాడు త్రాణ పరాయణుడు. పరమ దయాళువు. ఆ మహానుభావుని శరణు కోరు. జన క్షయం కోరకు రావణా!


వీర వరేణ్యుడైన రఘువీరున కెగ్గొనరించి దేవ దేవాదుల లోన నెవ్వరును బ్రాణము తోడ సుఖంబు నొందగా నేరరు గాన నా పలుకు నిక్కముగా మదినమ్మి సీత నా ధారుణి నేత కిచ్చి పుర దార సుతాదులు గాచి కొమ్మొగిన్.


తలలు త్తరించే తలారులను కూడ తలలు వంచునట్లు చేసేది వాక్కు. మాట నేర్పుతో- కోపాగ్ని జ్వాలలు కక్కేవాడు కూడ నిరుత్తరుడై చేష్టలుడిగి వినునట్లు చేయగలదీ, తల ఊపించేదీ మాట. ఈ సన్నివేశంలో ఆంజనేయుడు మహోన్నత రాజనీతిజ్ఞుడుగ, వాక్య విశారదుడుగా కనిపిస్తాడు. సర్వకాలానుగుణమైన న్యాయ శాస్త్రాన్ని రాజనీతివేత్తలు “ఔరా” అనునటుల వినిపించినాడు. రాక్షసరాజ సభలో ఉత్తమ రాయబారిగ గోచరిస్తాడు. ప్రదర్శించిన ధైర్య సాహసాలు- బంధీయై కూడ నిర్భీకుడై తొణుకు బెణుకు లేకుండ తాను చెప్పదలచుకున్న నీతి వాక్యాలను నిర్మొగమాటంగా వినిపించుట మరొకరికి సాధ్యము కానిపని. ప్రసంగ నైపుణి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, సంఘ నేతలు- మొదలగువారు అవశ్యం నేర్వవలసినవి.


కార్యసాధకుడు- శత్రు బలగాలను పరిగణనలోనికి తీసుకొని ఏకరీతిగా వారిని భయకంపితులను చేయవలెనో ఆ రీతిగా చేయుట, దోషిగా భావించినపుడు - ఆత్మరక్షణకలా చేయవలసి వచ్చిందని తన నిర్దోషిత్వమును నిరూపించుకొనుట - రాజుగా ఉండవలసిన విధానం, రాజ ధర్మాన్ని మరచిన కలుగు కష్ట నష్టాలు- వివరించిన రీతి అందరూ నేర్చుకోవలసినది.


No comments:

Post a Comment