Sunday, 2 January 2022

శ్రీ హనుమద్భాగవతము (120)



సువర్ణమయమైన లంక భగభగమండుచుండెను. లంకానగర వాసులు ఆక్రందనలను ఒనరించుచుండిరి; కాని వారలను రక్షించువారెవ్వరు లేకపోయిరి. మండోదరి మొదలైన రాణులు రోదించుచు పరస్పరమిట్లు పల్కిరి.  "జానకీ దేవిని శ్రీరాముని చెంతకు పంపమని, ఆయనతో వైరము వలదని, మేమెన్ని పర్యాయములో రావణుని ప్రార్థించితిమి. కాని అహంకారవశుడై ఆతడు మా మొరలను ఆలకింపలేదు. ఇపుడాతని బలము, సైన్యము, ప్రతాపము ఏమైనవి? ఒక దొంగ వలె ముఖమును దాచుకొని మూల కూర్చుండెను. ఇక మమ్ముల రక్షించువారెవ్వరు? ఈ ప్రకారముగా బాలకులు, వృద్ధులు, స్త్రీపురుషులెచ్చటి వారచ్చట విలపింప నారంభించిరి. ఈ లంకాదహన కాండలో అనేక భవనములు, రాక్షససమూహములు గజతురగరథాదులు, పశుపక్షి వృక్షాదులు మాడి మసియయ్యేను, మిగిలినవారు దీనులై గోడుగోడున విలపింప సాగిరి.


లంకను తగుల పెట్టుచు మహాపరాక్రమవంతుడైన శ్రీ హనుమంతుడు తన మనస్సులో పరమప్రభువైన శ్రీరామచంద్రునే స్మరించుచుండెను. మర్కటాధీశ్వరుడు ఒనరించుచున్న ఈ అద్భుతము, అప్రమేయమైన లంకాదహన కార్యక్రమమును గాంచి దేవతలు, మహర్షులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు మొదలైన ప్రాణులందరు అత్యంత ప్రసన్నులైయ్యారు. దేవతలు శ్రీహనుమంతుని అనేక విధాల స్తుతించారు.


లంకాధిపతియైన రావణుడు సూర్యకుమారుడైన శనైశ్చరుని బాధించాడు. ఆ కారాగారము శ్రీహనుమదీశ్వరుని పదఘట్టమునకు శిధిలము కాగా హనుమ శనైశ్చరుని దర్శించి రావణుడు ఒనరించిన దుష్కృత్యములను చెప్పాడు. అప్పుడు శనైశ్చరుడు ముక్తిదాతయైన శ్రీహనుమంతుని ప్రార్థించి లంకకు సర్వనాశనము దాపురించినదని పలికి భస్మముకాగా మిగిలిన లంకానగరముపై తన దృక్కులను సారించాడు. ఆ దృష్టి పాతముచే ఒక్క విభీషణుని గృహము దప్ప మిగిలిన లంక అంతా భస్మమయ్యింది.


లంకానగరములో గల సైనిక కేంద్రములు, యుద్ధోపకరణములు నశించుటను, చావగా మిగిలిన అసురులు ఆక్రందనముల ఒనరించుటను, అతులిత బలధాముడైన శ్రీ పవన కుమారుడు చూసాడు. అపుడు ఆయనకు సీతాదేవి జ్ఞప్తికి వచ్చింది. విభీషణుని గృహము దప్ప లంక అంతా భస్మమయ్యింది; కాని జానకి ఎట్లున్నదో అని విచారించాడు. ఇట్లు చింతించి శ్రీహనుమంతుడు విశాలసముద్రమును చేరి తన వాలమును ఆవరించియున్న మంటలను ఆర్పుకొనుచుండెను. అపుడు మహాత్ములైన చారణులు ఇట్లు పలికారు. పవనకుమారుడైన శ్రీహనుమంతుడు స్వర్ణమయమైన లంకకు నిప్పుబెట్టి గొప్ప దుస్సాహసమైన కార్యమును చేసెను. గృహములను వీడి పారిపోయిన రాక్షసులు, స్త్రీలు, బాలకులు, వృద్ధులు దుఃఖించుచు లంకానగరమును వీడారు. లంకానగరమంతా అగ్నిజ్వాలలో బడి భస్మమయ్యింది. కాని శ్రీరామచంద్రుడు అర్ధాంగియైన సీత సురక్షితముగా నుండుట పరమాశ్చర్యకరమైన విషయము. చారణులు పల్కిన ఈ మధుర వచనములు ఆలకింపగానే శ్రీహనుమంతుని హృదయావేదనము దూరమయ్యింది.


No comments:

Post a Comment