Saturday 22 January 2022

శ్రీ హనుమద్భాగవతము (138)



ఇట్లు పల్కి సీతాదేవి దుఃఖింప ఆరంభించెను. ఆమె వానరరాజైన సుగ్రీవుని, యువరాజగు అంగదుడు, మతిమంతుడైన జాంబవంతుడు మొదలగు వానరవీరులందఱను ఆశీర్వదించుచు శీఘ్రమే లంకకువచ్చి రాసులను సంహరింపవలసినదిగా ప్రార్ధించినది. 


శ్రీ వాయునందనుని వలన భగవతియైన జానకి యొక్క సమాచారం విని శ్రీ రామచంద్రుడు ఎంతో కలత చెందెను. లక్ష్మణుని నేత్రములనుండి అశ్రుధారలు ప్రవహింప ఆరంభించెను, వానర భల్లూక వీరులందఱు శోకముచే సజలనయనులైరి. కాని శ్రీ ఆంజనేయుడు మాత్రము ధైర్యముగా ఇట్లు పలుకుచుండెను. “తల్లి ఆజ్ఞను పొందినవాడనై అశోక వనమునందు గల మధుర ఫలములను ఆరగించితిని, రావణుని కలిసికొనవలెననెడి సంకల్పము కలిగినవాడనై నేను అతిసుందరమైన వాని అశోక వనమును విధ్వంసమొనరించితిని. రావణునికుమారుడైన అక్షయునితో పాటు అసంఖ్యాకులైన అసులవీరులను సంహరించితిని, తదనంతరము రావణకుమారుడైన ఇంద్రజిత్తు బ్రహ్మా స్త్రమును ప్రయోగించి నన్ను రావణునిసభకు తోడ్కొని పోయెను. అచ్చోట దుష్టుడైన ఆ రావణుడు నా వాలమునకు నిప్పుపెట్టవలసినదిగా ఆజ్ఞాపించినాడు. దేవాదిదేవా! నీకృప వలన నేను లంకానగరమును దగ్ధమొనరించితిని.


భగవంతుడైన శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, వానరరాజైన సుగ్రీవుడు, మహామతిమంతుడైన జాంబవంతుడు, అంగదుడు, ద్వివిదుడు, మైందుడు, నలుడు, నీలుడు మొదలగు వానరశ్రేష్ఠులందఱు లంకానగరములో జరిగిన సంఘటనలను శ్రద్ధగా ఆలకించుచుండిరి. శ్రీహనుమంతుడు శ్రీ రాఘవేంద్రుని చరణారవిందములపై పడినవాడై “ప్రభూ! ఈ కార్యములను అన్నింటిని నేనొనరింపలేదు. అంతర్యామివి, నా ప్రభుడవైన నీవు నాలో నుండి నీ శక్తిచే ఈ కార్యములను చేయించితి" వని సవినయముగా మనవి చేసికొనెను.”


1 comment:

  1. Meeru chala great sir..
    Mee blog ante naku chala estam..

    ReplyDelete