Wednesday, 19 January 2022

శ్రీ హనుమద్భాగవతము (135)



శ్రీ ఆంజనేయుని ద్వారమున తన ప్రాణ ప్రియురాలైన సీతా దేవి యొక్క సమాచారమును తెలిసికొని అత్యంత ప్రసన్నుడై ప్రభువిట్లు పలికెను. ఆంజనేయా! ఈ కార్యము దేవతలకు కూడా దుష్కరమైనది. నీవు ఒనరించిన ఈ మహోపకారమునకు నేనేమి ప్రత్యుపకారం ఒనరింపగలను? కుమారా! నేనెంతగానో ఆలోచించుకొని నీ ఋణమును ఎప్పటికిని తీర్చలేనని నిర్ణయించుకొంటిని.


ఇట్లుపల్కి కరుణావతారుడు, మహా ప్రభువైన శ్రీరామచంద్రుడు శ్రీ ఆంజనేయుని గాఢాలింగనం ఒనర్చుకొనుచు ఇట్లు పలికెను.


శ్లో || పరిరమ్భోహి మే లోకే దుర్లభః పరమాత్మనః |

అతస్త్వం మమ భక్తోసి ప్రియోసి హరిపుంగవ ||

(ఆ. రా. 5-5-63 )


పరమాత్ముడనైన నా ఆలింగనము లభించుట ఈ విశ్వములో అత్యంత దుర్లభము. వానరశ్రేష్ఠుడా ! నీకు ఈ సౌభాగ్యము సంప్రాప్తమయ్యెను. కావున నీవు నాకు పరమ భక్తుడవు, అత్యంతప్రియతముడవు నైతిని.


పరిపూర్ణ భగవంతుడైన శ్రీరామచంద్రుని అనన్యభక్తుడైన శ్రీమహా దేవాత్మజుని ఒక్కగానొక్క కోరిక పరిపూర్ణమయ్యెను.  ఆయన ఈ వానర శరీరమును ధరించుటలో గల ఉద్దేశ్యము సఫలీకృతమయ్యెను, ఆయన పులకితగాత్రుడై శ్రీరామచంద్రునకు అనేక ప్రణామములను అర్పించుచు ఆనంద మగ్నుడై సాశ్రుపూర్ణ నయనములతో ప్రభువు చరణకమలములను కడిగి ‘ దేవాది దేవా!' నన్ను రక్షింపుము. కరుణింపుమని ప్రార్థించెను. భక్తవత్సలుడైన ప్రభువు శ్రీ ఆంజనేయునిట్లు ప్రశ్నించెను. “కుమారా! ఈవిశాలమైన సముద్రమును ఎట్లు లంఘించి లంకను చేరితివి? లంకలో సీతాదేవి నెట్లు కనుగొంటివి? ఆమె ఎట్టి సందేశమును పంపినది? లంకాధిపతియైన రావణుని శక్తియుక్తులేపాటివి. ఈ విషయములను అన్నింటీని సవిస్తరముగా చెప్పు.


No comments:

Post a Comment