Tuesday, 25 January 2022

శ్రీ హనుమద్భాగవతము (141)



ఆ క్షణమందే సుగ్రీవుడు వానర భల్లూక వీరులను రణరంగమునకు తరలింపవలసినదిగా వానరసైన్యాధిపతులను ఆజ్ఞాపించెను. ఆ వీరులందరి మనస్సులలో లంకానగరమును ధ్వంసమొనరింపవలెననెడి ఉత్సాహము నిండెను. వారందఱు ముక్త కంఠముతో శ్రీ సీతారామచంద్రులకు జయమగుగాక! శ్రీలక్ష్మణ సహితుడైన శ్రీరామచంద్రునకు జయమగుగాక! అనుచు జయజయారవములను ఒనరించిరి. సుగ్రీవాజ్ఞచే కోటానుకోట్ల వానరవీరులు, అసంఖ్యాకులైన భల్లూక వీరులు గుమిగూడిరి. వారి హృదయములలో ఆనందము, విజయోత్సాహము పరవళ్ళు త్రొక్కుచుండెను. ఆ అపారమైన విశాలసైన్య మధ్య భాగములో జటాజూటధారియైన శ్రీరామచంద్రుడు ధనుర్భాణధారియై భాగ్యవంతుడైన శ్రీ ఆంజనేయుని భుజస్కంధమును అధిష్ఠించెను. శ్రీ రామానుజుడు అంగదుని భుజముపై ఆసీనుడయ్యెను. సుగ్రీవుడు ఆ అన్నదమ్ముల వెంట నడిచెను. గజుడు, గవాక్షడు, మైందుడు, ద్వివిదుడు, నీలుడు, నలుడు, సుషేణుకు, మహావీరుడైన జాంబవంతుడు మొదలైన సేనాధిపతులందఱు ఆ మహా సైనిక వాహినిని నాల్గు వైపులనుండి సావధానులై నడుపుచున్నారు. చంచలురైన వానర వీరులు సుగ్రీవాజ్ఞచే అనుశాశితులై సైన్యాధిపతుల ఆదేశములను పాటించుచు, ఎగురుచు, దుముకుచు, గర్జించుచు, మార్గమధ్యములో మధురఫలములను ఆరగించుచు దక్షిణదిశగా బయలు దేరిరి.


ఆహా! ఆ వానర వీరుల సౌభాగ్యమేమని పొగడగలము. సురముని దుర్లభుడు, సవస్తసృష్టికి స్వామి దయాధాముడైన శ్రీరామచంద్రుని కార్యమును నిర్వర్తించుటకు వారందఱు ఆనందమగ్నులై ప్రయాణమును సాగించుచుండిరి. వారి సౌభాగ్యమును గాంచి ఇంద్రాది దేవతలందఱు మనస్సునందే ఆ వానర భల్లూక వీరులను ప్రశంసింప సాగిరి. భగవంతుడైన శ్రీరామచంద్రుడు ప్రసన్న హృదయాంతరంగుడై బయలు దేరగానే సీతాదేవి వామనేత్రము, భుజము అదర అరంభించెను. అదే సమయములో లంకానగరమందు అనేకములైన అపశకునములు ప్రారంభమయ్యెను. ఆ దుశ్శకునములను గాంచినవారై అసురులఁదఱు చింతామగ్నులైరి.          


No comments:

Post a Comment