Sunday, 23 January 2022

శ్రీ హనుమద్భాగవతము (139)



శ్రీహనుమంతుడు ఇంకా ఇట్లు పలుక ఆరంభించెను "కరుణామయుడవగు స్వామి! నేను త్రికూటపర్వతము పై నిర్మింపబడిన లంకానగరమును పరికించితిని. ఆ నగరమునకు నాల్గు దిక్కులలోను దీర్ఘ విశాలమైన ద్వారములు గలవు. ఆ ద్వారములు అత్యంత బలిష్ఠములైన తలుపులతో మూయబడి యుండెను. ఆ ద్వారములపై అనేకశక్తి సంపన్నములైన యంత్రములు అమర్చబడియున్నవి. అవి శత్రుసైన్యముల పై శతఘ్నులను, సహస్రఘ్నులను కురిపించుటలో సమర్థవంతములు. ఆ ద్వారములను దాటి లంకానగరమును ప్రవేశించుట అత్యంతకఠినము. లంకానగరమునకు నాల్గు వైపులు బంగారముచే నిర్మింపబడిన ఎత్తైన ప్రాకారము కలదు. ఆ గోడలను ఛేదించుట అత్యంతదుష్కరము. వాటిపై మణులు, మాణిక్యములు, రత్నములు, ముత్యములు పొదగబడియుండెను. ఆ దుర్గమనకు నాల్గు వైపుల మొసళ్ళచే నిండిన అగాధమగు అగడ్త గలదు. లంకానగరమును ముట్టడించుటకు మార్గము లేదు. సుదృఢములైన కోటగోడలు కలవు. పర్వతములు, వనములు లంకానగరము చుట్టును శోభించుచు ఆ నగరమునకు ప్రకృతిసహజమైన రక్షణను కల్పించెను. లంక విస్తృతమైన సముద్రమునకు ఆవల దక్షిణదిశగా ఉన్నది. జలయానముపైనైనను లంకను చేరుట కఠినమగును.


లంకానగర పూర్వద్వారముపై ప్రచండవీరులైన వేలకొలది రాక్షసయోధులు కావుండిరి. దక్షిణద్వారము చెంత అహర్నిశములు చతురంగబలములతో లక్షలకొలదిగా అసుర యోధులు యుద్ధమునకు సన్నద్ధులైయుందురు. ఉత్తరద్వారము చెంత కోటానుకోట్ల రక్కసవీరులున్నారు. మధ్య భాగములో యద్ధశిబిరములందు సహస్రాధికములుగు దుర్జయులైన నిశాచర వీరులు అప్రమత్తులై యున్నారు. కుంజరయూధములతో, అశ్వసమూహములతో, శతఘ్ని మున్నగు యంత్రములతో, అగడ్తలతో, దీర్ఘ ప్రాకారములతో, రావణుని లంకానగరము సురక్షితముగా ఉండెను; కాని శ్రీ రామభద్రా! నీ కృపా విశేషముచే నేను ఆ రక్షణవ్యవస్థనంతటిని ఛిన్నాభిన్నం చేసితిని. ద్వారములను విరుగగొట్టితిని; ప్రాకారములను పడద్రోసితిని; అగడ్తలను పూడ్చితిని; శతఘ్నులు, సహస్రఘ్నులు మొదలగు యంత్రములను భగ్నం ఒనరించితిని. దేవాదిదేవా! నీ కృపా పాత్రుడనై నేను రావణునకు గల సమస్తసైన్యములో నాల్గవ వంతును మడియించితిని. అదియిది యననేల? లంకానగరమును అంతటిని దహనం ఒనరించితిని. రావణుని నగర వాసులననేల ? సైనికులననేల? తుదకు వాని మనసులో కూడా నీవంటే భయము కల్గునట్లు చేసితిని. అసురుల మనోబలము సమాప్తమయ్యెను. శ్రీరామప్రభూ! ఇక ఆలస్యం ఒనరింపక శత్రువును ముట్టడించుటయే ఉచితమగును.


No comments:

Post a Comment