Wednesday 26 January 2022

శ్రీ హనుమద్భాగవతము (142)



విశాలమైన రామదండు విశ్రాంతిని కూడా తీసుకొనక రేయింబవళ్ళు పయనించుచుండెను, వారందఱు శ్రీరాఘవేంద్రునితో మధ్యాచలమును, సహ్యాద్రిని, మనోహరములైన అరణ్యములను తరించుచు మార్గములో నేత్రానందకరములైన దృశ్యములను గాంచుచు తుదకు విశాలసాగరతటమును చేరిరి. ఆ ప్రదేశమందు వానర భల్లూక వీరులు అత్యధిక ప్రసన్నులై 'జయ శ్రీసీతారాం’ 'జయ శ్రీలక్ష్మణరాం' అనుచు గర్జించిరి.


కోటానుకోట్ల వానరభల్లూకవీరుల గర్జనముల ఎదుట సముద్రుని భయంకర గర్జనము ప్రభావహీనమయ్యెను. 


విభీషణునిపై అనుగ్రహము చూపుట 


మహావీరులైన వానర భల్లూక యోధులతో శ్రీ రామచంద్రుడు దక్షిణ సముద్ర తటమును చేరెను. ఈ సమాచారం అందగానే లంకానగరములో వ్యాకులత్వము వ్యాపించెను. రాక్షసులు, రాక్షస స్త్రీలు, మిగులు చింతితులై పరస్పరమిట్లు పలుకనారంభించిరి. ఒకే ఒక వానరుడు సమస్త లంకా నగరమునకు నిప్పు పెట్టి భయంకరమైన నష్టమును కలుగ జేసెను. ఇపుడు కోటానుకోట్ల వానరవీరులచే ఈ దేశమునకు ఎట్టి దుర్దశ పట్టునోకదా! తుదకు దశకంఠుడు కూడ భయము చెందెను. వాని మనస్సు వ్యాకులమయ్యెను; కాని తన మనోభావములను లోననే ఉంచుకొని పైకి గంభీరముగా నుండెను. సభాభవనములో అతడు రాక్షసవీరులను ఉద్దేశించి ఇట్లు పలికెను. “వీర యోధులారా! వానరసైన్యములను తోడ్కొని దశరథకుమారులైన శ్రీరామలక్ష్మణులు లంకను ముట్టడించుటకు సముద్రమునకు ఆవలి తటమును చేరిరి. కావున తుచ్చులైన ఆ వానరుల కెట్టి దండనము విధింపవలెనో యోచించి నిర్ణయించుడు”.


రాక్షసాధిపతి పల్కిన వచనములను ఆలకించి ముఖ ప్రీతి కొఱకై సభాసదులందఱు అతని దుర్జయత్వమును, పరాక్రమమును, బలమును, శక్తియుక్తులను ప్రశంసించడ, ఆరంభించిరి. ప్రహస్తుడు, దుర్ముఖుడు, వజ్రదంష్ట్రుడు, ఇంద్రజిత్తు, మహా పార్శ్యుడు, మహోదరుడు, కుంభుడు, అతికాయుడు, కుంభకర్ణుని కుమారుడైన నికుంభుడు మొదలగు రాక్షసవీరులందఱు రావణునకు నమస్కరించి వాని శౌర్యపరాక్రమములను పొగుడుచు నిట్లుపల్కిరి. 'రాజా! క్షుధార్తులమైన మాకు ప్రియహారమైన నరవానరులు కాలప్రేరణముచే స్వయముగా మన సమ్ముఖమునకు వచ్చుట మా భాగ్యము. పవనపుత్రుడు మేమందఱము అసావధానులమైయున్న సమయములో మా ఉదారతను ఆసరాగా తీసికొని లంకానగరమునకు-నష్టమును కలిగించి వెడలిపోయెను. సమరాంగణములో మీ ధనువునుండి బయల్వెడలు రెండునాల్కలు గలిగిన సర్పసమానములు, తీక్షములు, విషయుక్తములైన శరపరంపరలను దశరథరాజు కుమారులు చూచియుండలేదు. ఆ కారణమువలననే ప్రజ్వలిత దీపము పైబడి మరణించు పతంగములవలె ఈ ప్రదేశమునకు వచ్చుటకు ప్రయత్నించుచున్నారు. విచారించవలసినదేదీ లేదు. మీరు మాకు అనుజ్ఞను ప్రసాదింపుడు. ఈ క్షణముననే మేము సముద్రమునకు ఆవలి తటమును చేరి క్షుద్రవానరులను వెదకి వెదకి సంహరించెదము.


No comments:

Post a Comment