తల్లి యొక్క ఈ దయనీయమైన పరిస్థితిని గాంచగనే మహావీరుడైన హనుమంతుని ధైర్యము సహితము సన్నగిల్లెను. దుఃఖము పెల్లంబుగా ఆయన వెక్కి వెక్కి ఏడ్వ నారంభించెను. ఎంతో కష్టముతో తన్నుతాను సంబాళించు కొని ఇట్లుపల్కెను. "అమ్మా! నీవు ధైర్యమును వహింపుము. నేను ఆవలకు చేరగానే నిన్నుద్ధరించుటకు ప్రభువు బయలు దేరి రాగలడు.” కొంచెమాగి ధైర్యముతో శ్రీహనుమంతుడిట్లా పల్కెను. “జననీ! శ్రీ రామచంద్రుడు నీకొఱకై ముద్రికను పంపినట్లుగా నీవు కూడా ఒక చిహ్నము నిమ్ము. దానిని నేను ప్రభువునకు చూపింపగలిగెదను.”
సీతా దేవి తన కేశపాశమునుండి చూడామణిని బయటకు తీసి శ్రీపవనాత్మజునకు ఇచ్చుచు ఇట్లు పల్కెను. “వత్సా! ఈ చూడామణిని గాంచగనే ఆర్యపుత్రుడు లక్ష్మణుడు, నిన్ను విశ్వసింపగలరు. నిన్ను విశ్వసించుటకు నీకొక రహస్యమును చెప్పెదను. దానిని నా ప్రాణనాథునకు నివేదింపుము. ఇది చిత్ర కూట పర్వతముపై జరిగిన సంఘటన. ఒక దినమున నా జీవన సర్వస్వమైన శ్రీ రామభద్రుడు నా ఒడిలో శిరమును ఉంచి నిద్రించుచుండెను. ఆ సమయములో ఇంద్రకుమారుడైన జయంతుడు వాయసం (కాకి) వేషమును ధరించి మాంసలోభియై ఎఱ్ఱని నా కాలి వేళ్ళను తన తీక్షమైన ముక్కుతో పొడవటం ఆరంభించెను. ప్రభువునకు నిద్రాభంగము కాగా జరిగినది గాంచి ఎదురుగా నున్న రక్తసిక్తముఖముగల వాయసమును చూసి కోపించినవాడై ఒక తృణమును తీసికొని దివ్యాస్త్రముగా జయంతునిపై ప్రయోగించెను. కాకరూపమున నున్న జయంతుడు భయమునొంది పలాయనము చిత్తగించెను. దివ్యాస్త్రము వానిని వెంటాడెను. జయంతుడు బ్రహ్మాది దేవతలను శరణువేడగా ఆ శ్రీరామచంద్రునకు వ్యతిరేకముగా వారు ఆశ్రయమును ఈయలేమన్నారు. తుదకు 'రక్షింపుము, నా అపరాధమును క్షమింపు'మనుచు ప్రభువు చరణములను ఆశ్రయించెను. ఆ అస్త్రం అమోఘము; అందువలన జయంతుడు తన ఎడమ కంటిని సమర్పించి ప్రాణములను రక్షించుకొన్నాడు. శరణాగత వత్సలుడైన ప్రభువును అనేక విధముల ప్రార్థించినవాడై నిజ ధామమున కేగెను. కుమారా! అచింత్యమగు శక్తి సంపన్నుడైన ప్రభువును శీఘ్రమే రావలసినదిగా పార్థింపుము.
శ్రీ ఆంజనేయుడు సీతా దేవి చరణారవిందముల పై శిరము నుంచి “తల్లీ! నా కనుజ్ఞని”మ్మని ప్రార్థించెను.
No comments:
Post a Comment