Tuesday 11 January 2022

శ్రీ హనుమద్భాగవతము (128)



వయోవృద్ధుడైన శ్రీ మహర్షి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చాడు. “ఆంజనేయా! భగవంతుడైన శ్రీ రామచంద్రుడు  అనేక పర్యాయము లీ భూమి పై అవతరించాడు. ప్రతి అవతారమందు సీతాపహరణము జరుగుతూనే ఉంది. సీతను అన్వేషించుటకు హనుమంతుడు పంపబడుతుంటాడు. ఆయన సీతను దర్శించి మరలివస్తూ నా వద్దనుంచిన ముద్రికలను వానరములు నా కమండలములో పడవేసినాయి. వీనిలో నీ ముద్రికను వెతుక్కో.


శ్రీ హనుమంతునిలో ఉద్భవించిన గర్వాంకురము ఆ మూలాగ్రముగా నశించెను. ఆశ్చర్యచకితుడై ఆయన మహర్షిని పూతచరితా! నేటివరకు శ్రీరామచంద్రుడెన్ని అవతారములను ధరించెను అని ప్రశ్నించెను. అందులకు మహర్షి కమండలములోని ముద్రికలను లెక్కింపవలసినదిగా పల్కెను. శ్రీ హనుమంతుడు తన దోసిళ్ళతో శ్రీరామ ముద్రికలను కమండలము నుండి తీయడం ఆరంభించెను. వాని కంతులేదు, అవి అసంఖ్యాకములు. శ్రీహనుమంతుడు ఆ మహర్షి చరణారవిందములకు నమస్కరించి ఇట్లా ఆలోచించెను. భగవంతుడైన శ్రీ రామచంద్రుని గుణములకు, శక్తులకు అంతము లేదు. ఆయన అవతారములకు కూడా లెక్కలేదు. నాకు పూర్వము కూడా జగత్ప్రభువైన శ్రీ రామచంద్రుని ఆజ్ఞానుసారముగా బయలు దేరి ఎందఱో ఆంజనేయులు సీతాన్వేషణార్థమై శ్రీరామకార్యమును సాధించిరి. వారిలో నేనెంతటివాడను.


అభిమానము నశించినంతనె శ్రీ ఆంజనేయుడు శ్రీసీతారామచంద్రుల చరణారవిందములకు అనేక పర్యాయములు ప్రణామములను ఆచరించెను. తదనంతరం ఆ గిరిశృంగము నుండి సముద్రతటము జేరెను. శ్రీ ఆంజనేయుడు ప్రకాశించు సూర్యునివలె వచ్చుచుండుట గాంచిన వానరులందఱు జయజయ ధ్వానములను ఒనరిస్తూ ఆయన చుట్టూ జేరాడు.


No comments:

Post a Comment