Monday 3 January 2022

శ్రీ హనుమద్భాగవతము (121)



సీతాదేవికడ సెలవు తీసుకొనుట


హర్షాతిరేకముచే శ్రీహనుమంతుని నోటినుండి జయ జయ శ్రీసీతారాం' అను జయధ్వని బయల్వెడలుచుండెను. ఆయన తీవ్రగతితో పరుగుపరుగున జానకిని దర్శించుటకు బయలు దేరెను. శ్రీ ఆంజనేయుడు కుశలమేనా ? అనే చింతతో జానకి కూర్చొని ఉండెను. శ్రీపవనకుమారుడు పరుగు పరుగున ఆ ప్రదేశమునకు జేరి “అమ్మా! అమ్మా” అంటూ సీతా దేవిచరణకమలములపై తన శిరము నుంచెను. తల్లి హృదయము నుండి వాత్సల్యరసము పొంగి ఆమె నేత్రములు సజలములయ్యెను. ఆమె పరమభాగ్యవంతుడైన శ్రీ ఆంజనేయుని శిరముపై తన అభయ కరారవిందము నుంచెను.


అత్యంత స్నేహముతో సీతాదేవి ఇట్లా ప్రశ్నించింది. "కుమారా ! నీవు కుశలముగా నుండుట గాంచి వ్యాకులమవుచున్న నా మనస్సు శాంతించినది. నీ అవయవములు దగ్ధము కాలేదా! శ్రీపవనాత్మజుడు తల్లి యొక్క సహజ స్నేహమును పొంది పులకితుడై ఇట్లు పల్కెను. “జననీ! పరమపావనము, అభయప్రదమైన నీ కరకమలము నా శిరముపై నుండగా ఈ త్రిభువనములలో నా కెట్టిహానియు సంభవించునా? నీ కరుణ వలననే నీ లంకానగరమునకు వచ్చిన కార్యము సిద్ధించినది. నేను నీ దివ్యపాదారవిందములను దర్శించితిని. లంకానగర రహస్యములను గ్రహించితిని; రాక్షసుల శక్తియుక్తులు నాకు అవగతమయ్యింది. లంక యందు గల కీలక ప్రదేశములను బాగుగా పరికించాను. అమ్మా! నీ విక కృపతో నాకు అనుజ్ఞను ప్రసాదింపుము. నేనీ క్షణమందే ప్రభువు యొక్క చరణముల చెంతకు చేరుకొని నీ సందేశమును వినిపించెదను. సర్వసమర్థుడు, కరుణానిధానుడైన ప్రభువు శీఘ్రముగా లంకను ప్రవేశించి క్రూరులైన ఈ అసురులను సంహరింపగలడు."".


No comments:

Post a Comment