నేను పలికిన మధుర లీలా కథామృతమును గ్రోలినదై ఆమె ‘అమృతతుల్యమైన ఈ దివ్యలీలలను నాకు వినిపించిన ఉత్తముడు నా ఎదుటకు ఎందులకు రాలేదు'? అని పలికెను.
నేను వృక్షమునుండి దిగిన వాడనై ఆమె చరణారవిందములకు ప్రణామములను అర్పించితిని. వానరరూపుడనగు నన్ను గాంచి మొదట జానకీ దేవి అనుమానించినది. కాని నేను క్రమముగ అన్ని విషయములను ఆమెకు విన్నవించితిని. తదనంతరము నీ ముద్రికను ఆమెకు ఇచ్చితిని. అప్పుడు జానకి నన్ను విశ్వసించినది.
క్రూరుడైన రావణుని రాజ్యములో భయంకరులైన రాక్షస స్త్రీల నడుమ అత్యంతకష్టములను అనుభవించుచు నీ వియోగ దుఃఖముతో జీవితమును గడుపుచున్న ఆ తల్లి పుత్రుడనైన నన్ను చూడగానే పొంగివచ్చు దుఃఖమును ఆపుకొన లేకపోయినది. ఆమె 'కుమారా! నేనెట్లు అహర్నిశములు క్రూరులైన ఈ రాక్షసస్త్రీలచే కష్టములను అనుభవించుచున్నానో చూచితివి కదా! ఈ విషయమును వెంటనే నా ప్రాణనాథునకు నివేదింపు’ మని పలికినది. నేను అనేక విధముల అమ్మకు ధైర్యమును చెప్పి, ఊరడించి ఇట్లు పల్కితిని. “జననీ! నా ప్రభువును నేను చేరుటయే ఆలస్యము. అమితశక్తి సంపన్నుడగు రాఘవేంద్రుడు నీ సమాచారమును ఆలకింపగానే లంకకు వచ్చి అసురు వంశమును విధ్వంసమొనరింపగలడు.
దుఃఖించుచు అత్యంతకరుణతో నీవు శీఘ్రముగా రావలయునని ప్రార్థించుచు లక్ష్మణు కిట్లు సందేశమిచ్చినది. “లక్ష్మణా! నిన్ను నేను అజ్ఞానవశమున కఠోరవచనములను పల్కి బాధించితిని. అందులకు నన్ను క్షమింపుము. శీఘ్రమే శ్రీరఘునాయకునితో కలసివచ్చినవాడవై నన్ను రక్షింపుము, లేనిచో ఒక మాసము తరువాత నేను జీవించియుండను,”
No comments:
Post a Comment