దుఃఖశమనుడు, మహావీరుడు నగు శ్రీ ఆంజనేయుడు విషయములను అన్నిటిని విన్నవించి నవనీరద సుందరుడైన శ్రీరామచంద్రుని ముఖారవిందమును రెప్ప వేయక చూచుచుండెను. రుద్రావతారుని వచనములును ఆలకించి ప్రభువు అత్యంత ప్రసన్నుడై ఇట్లు పల్కెను.
శ్లో॥ కార్యం కృతం హనుమతా దేవైరపి సుదుష్కరమ్ |
మనసాపి యదన్యేన స్మర్తుం శక్యం న భూతలే ||
శతయోజనవిస్తీర్ణం లంఘయేత్క : పయోనిధిమ్ |
లంకాంచ రాక్షసైర్గుప్తాం కోవా ధర్షయితుం క్షమః ||
భృత్యకార్యం హనుమతా కృతసర్వమ శేషతః |
సుగ్రీవస్యేదృషో లోకే న భూతో న భవిష్యతి ||
అహం చ రఘువంశశ్చ లక్ష్మణశ్చ కపీశ్వరః |
జానక్యా దర్శనేనాద్య రక్షితాః తాః స్మోహనూమతా || ( ఆ.రా. 6.1.2 5 )
శ్రీ ఆంజనేయుడు ఒనరించిన ఈ కార్యము దేవతలకైనా అత్యంతకఠినము. ఈ పృథ్వీతలముపై ఆ విషయమును ఎవ్వరైనను మనస్సులో స్మరింపనైనను స్మరింపజాలరు. శతయోజన విస్తీర్ణమైన సముద్రమును లంఘించి రాక్షసులచే సురక్షితమైన లంకాపురమును ధ్వంసమొనరించుటలో మఱియొకరెట్లు సమర్థులు కాగలరు. శ్రీ ఆంజనేయుడు సేవక ధర్మమును బాగుగా పూర్తి చేసెను. ఈ సంఘటన వెనుక జరుగలేదు, ముందు జరుగబోదు. ఈ పవనాత్మజుడు సీతాదేవిని కనుగొని నేడు నన్ను, లక్ష్మణుని, రఘువంశమును, సుగ్రీవాదులను అందఱిని రక్షించినాడు.
తదనంతరము సీతాపతియైన శ్రీరాముడు కిష్కిందాధిపతియైన సుగ్రీవునితో ఇట్లు పలికెను. “మిత్రమా! సుగ్రీవా! ఈ సమయములో విజయమను ముహూర్తము జరుగుచున్నది. ఈ క్షణమే సమస్త వానరసైన్యమును లంకా నగరమును ముట్టడించుటకు బయలు దేరవలసినదిగా ఆ దేశమిమ్ము. ఈ ముహూర్తములో జైత్రయాత్రకు బయలుదేరి నేను అసురసహితముగా దుర్జయుడైన దశాననుని సంహరించి సీతా దేవిని రక్షించెదను.
No comments:
Post a Comment