Sunday 9 January 2022

శ్రీ హనుమద్భాగవతము (126)



దశకంఠుని బంగారులంకకు నిప్పుపెట్టి శ్రీ కేసరీనందనుడు జగజ్జనని యైన జానకి సమీపమునకు పోయేను. ఆయన తల్లి చరణారవిందములకు ప్రణామములు ఆచరించి ఇట్లు ప్రార్థించెను. “తల్లీ ! నీవు నా భుజస్కంధములపై కూర్చుండుము. క్షణమే నిన్ను సముద్రము దాటించి శ్రీరామచంద్రుని చెంతకు చేర్చగలను”.


అందులకు వైదేహి ఇట్లు ఉత్తరం ఇచ్చింది. "కుమారా ! అప్రమేయుడు, శూరుడు, వీరుడైన నా ప్రాణ నాథునకు అన్యులు నన్ను చెరనుండి విడిపించుట స్వప్నమందైనను సమ్మతము కాజాలదు. రావణుని వధ, నా బంధవిమోచనము నా ప్రాణనాథుని కరకమలములచే జరుగుట నాకూ, ఆయనకు శోభాకరము. అందువలన నీ స్వామియొక్క కీర్తి దశదిశల వ్యాపించును. నీవు చూడామణిని, శ్రీరామ నామాంకితమునైన ముద్రికను తీసికుని వెళ్ళి ప్రభువున కిమ్ము, క్షణమైనను విలంబనం ఒనరింపక వెంటనే నన్నుద్ధరించుటకు రావలసినదిగా ప్రభువును ప్రార్థింపుము.


ఆంజనేయుడు తల్లి నుండి చూడామణిని, శ్రీరామ ముద్రికను అత్యంతాదర పూర్వకముగా తీసుకుని పరమపావనమైన సీతా దేవి పాదపద్మములకు నమస్కరించి బయలు దేరెను. ఆ మహావీరుడు సముద్రతటము నందున్న గిరిశిఖరమును అధిరోహించి ఆకాశమునకు ఎగిరాడు. పర్వతం ఆయన వేగమును సహించలేక చూర్ణమయ్యింది. ఆ సమయములో లోకపితామహుడైన బ్రహ్మ దేవుడు లంకాదహన కార్యక్రమమును గూర్చి విస్తృతవర్ణనము గల ఒక పత్రమును శ్రీ రామచంద్రునకు చేర్చవలసినదిగా శ్రీహనుమంతునకు ఇచ్చాడు. శ్రీ రామ దూత చతురాసనుని పత్రమును, జానకి ఒసంగిన చూడామణి ముద్రికలను తీసుకొని భయంకరమైన సింహనాదం చేస్తున్నవాడై ఆకాశమార్గమున సముద్రమును దాటెను.


No comments:

Post a Comment